Online Puja Services

అక్షయ తృతీయరోజున చేయవలసిన పనులేమిటి ?

3.12.155.100

నిజానికి అక్షయ తృతీయరోజున చేయవలసిన పనులేమిటి ? బంగారం కొనడమేనా ?
- లక్ష్మి రమణ 

అక్షయ తృతీయ ఈ పర్వము బంగారం షాపులకి ఇబ్బడి ముబ్బడిగా జనాన్ని తీసుకువస్తుంది . ఖచ్చితంగా ఈ రోజున బంగారం కొనాలనే సంప్రదాయం చాలామందికి ఉంటుంది . అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది ?  ఇందుకు మూలమైన పురాణ ఇతిహాసాలేమైనా ఉన్నాయా ? లక్ష్మీదేవి ఆరాధనని ఆరోజు విశేషించి ఎందుకు చెప్పారు అనే విషయాలు ఇక్కడ చెప్పుకుందాం . 

అక్షయ తృతీయ నిజంగానే విశేషమైన రోజు . ఈ రోజు వైష్ణవాంశ సంభూతుడైన పరశురాముడు జన్మించిన రోజు.  ఇది పవిత్ర గంగా నది భూమిని తాకిన రోజు. శ్రీరామునిగా మహావిష్ణువు అవతరించిన   త్రేతా యుగం మొదలైన రోజు.  శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడ్ని కలుసుకున్న రోజు లేదా ఒక భక్తుని అవ్యాజమైన తన కరుణతో కష్టాలే లేకుండా భగవంతుడు అనుగ్రహించిన రోజు. ద్రౌపదిని  శ్రీకృష్ణుడు దుశ్శాసనని వారి నుంచి కాపాడిన రోజు. అంతేనా, వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు.  సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్రను ప్రసాదించిన రోజు.  శివుడిని ప్రార్థించి కుబేరుడు, మహాలక్ష్మితో కలిసి  సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు. ఆదిశంకరులు కనకధారా స్తవాన్ని చెప్పిన రోజు.  అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.  

ఇంతటి విశేమైన భగవంతుని అనుగ్రహం లభించే దివ్యమైన పర్వాన్ని మనం కేవలం బంగారం కొనుక్కునే రోజుగా పరిగణిస్తున్నాం .  ఈ విధంగా బంగారం కొనుక్కోమని ఏ శాస్త్రంలోనూ లేదు. అయితే మొదట తమిళనాడులో ఈ నాడు బంగారం కొనుక్కునే ఆచారం మొదలయ్యింది . ఇప్పుడది దేశమంతా పాకి బంగారు వర్తకులకు మంచి గిరాకీని తెచ్చిపెడుతోంది. దీనివల్ల ఆధ్యాత్మిక పరంగా లోభము, మొహమూ పెరుగుతాయి తప్ప మనకి ఒరిగే లాభం ఇసుమంత కూడా లేదు . 

మరైతే ఈ దివ్యమైన పర్వంలో మనం చేయాల్సిన పనులేమిటి ? అంటే, మొట్టమొదట సూర్యోదయ కాలానికే నిద్రలేచి వీలైనతవరకూ బయట ఉన్న జలాలలో అంటే నదుల్లో, తటాకాల్లో స్నానం చేయాలి.  ఆ తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సహితంగా ఆరాధించాలి . గుర్తుంచుకోండి , లక్ష్మీ దేవికి ఎప్పుడూ విష్ణువక్షస్థలమే ఇష్టమైన నివాసము . అయ్యవారితో కలిపి అర్చిస్తేనే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది . 

ఒక్కసారి పైన ఈరోజు సంభవించిన దివ్యమైన విశేషాలని ఒకసారి చూస్తే, అందులో విష్ణుమూర్తి అవతారాలకి సంబంధించిన అనేక విశేషాలు కనిపిస్తాయి . అన్నపూర్ణమ్మ కూడా పోషకురాలు. పోషించేవాడే కదా విష్ణువు. 

కనుక , పరశురామునికి అర్ఘ్యప్రదానం చేయడం మంచిది . అదే విధంగా మళ్ళీ మాస ధర్మాన్ని, వైశాఖమాస పురాణాన్ని అనుసరించి ఉదకభాండాన్ని దానంగా  ఇవ్వడం, చలివేంద్రాలు నిర్వహించడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం తదితరాలు విశేషమైన పరమాత్మ అనుగ్రహాన్ని, తరగని సంపదని, కీర్తిని, అంత్యాన మోక్షాన్ని అనుగ్రహిస్తాయి . 

ఉదక బాండం అంటే, ఒక  కుండలో లేదా కూజాలో నీటిని (తాగడానికి అనువుగా, శుభ్రంగా  ఉండాలి) నింపాలి. ఆ నీటిలో కాస్త ఏలుకల పొడి, కాస్త పచ్చ కర్పూరము కలిపి ఆ పాత్రను తీసుకువచ్చి బ్రాహ్మణునికి, దక్షిణ, తాంబూలాలతో దానం ఇవ్వాలి . దీన్నే ఉదకభాండము అంటారు. దీనివల్ల  ఆకలి దప్పిక రెండూ కూడా తీరతాయి. దీంతోపాటుగా చెప్పుల జతని, గొడుగుని, స్వయంపాకాన్ని కూడా దానంగా ఇవ్వడడం అనంత పుణ్యప్రదమని వైశాఖ పురాణం చెబుతోంది.  కేవలం అక్షయ తృతీయనాడే కాకుండా, ఈ నెలలో ఏ రోజైనా ఈ దానం చేయడం మంచిది . 

విశేషించి సువాసినులు ముత్తైదువకు చీరె లేదా రవిక పెట్టి  గాజులు పసుపు కుంకుమ ఇచ్చుకుంటే, జన్మజన్మాంతరముల వరకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందవచ్చు. సువాసినీత్వం అక్షయంగా ఉంటుంది .  అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అది పుణ్యం కావచ్చు లేదా పాపము కావచ్చు అక్షయంగా నిరంతరము జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూనే ఉంటుంది. 

ఇవీ చేయాల్సినవి , పోగేసుకోవాల్సిన సంపదలు . అంతేకానీ , బంగారం కొనుక్కోమని ఏ శాస్త్రమూ కూడా చెప్పలేదు .  ఈ మానవ సేవలో మాధవ సేవని చేసే గొప్ప అదృష్టాన్ని వినియోగించుకొని, ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులమవుదాం . 

శుభం !!

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha