Online Puja Services

వైశాఖమాసంలో కేవలం ఇవి దానం చేయడం గొప్ప సంపదని, మోక్షాన్ని ఇస్తుంది .

18.216.32.116

వైశాఖమాసంలో కేవలం ఇవి దానం చేయడం గొప్ప సంపదని, మోక్షాన్ని ఇస్తుంది . 
- లక్ష్మి రమణ 

వైశాఖమాసము మంచి ఎండాకాలంలో మొదలవుతుంది . సూర్యనారాయణుడు అనంత తేజస్సుతో జీవులని తపింపజేస్తుంటాడు. అదే మాసంలో విష్ణు ప్రీతి కోసం మనం చేయవలసిన పనులని వైశాఖమాసపురాణం వివరించిన తీరు గొప్ప సైన్స్ ని చెబుతుంది అంటే అతిశయోక్తి కాదు.  ఈ పురాణం మన మునుల దార్శనికతని తెలియజేస్తుంది .  నారద మహర్షి, అంబరీష మహారాజుకి చెప్పిన వైశాఖ పురాణంలోని రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం . 

ఓ రాజా ! వైశాఖమాసముతో సమానమైన మాసం లేనే లేదు. ఉత్తమము అని మనము భావించేవాటన్నింటిలోకీ ఉత్తమమైన మాసము ఈ వైశాఖమాసము . శేషశాయి అయిన శ్రీ మహా విష్ణువుకి వైశాఖ మాసము చాలా ప్రియమైనది.  ఈ మాసంలో విధించిన వ్రతాన్ని పాటించకుండా, వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడు అవ్వడమే కాక పశుపక్ష్యాది జన్మలను పొందుతున్నాడు. వైశాఖ మాస వ్రతాన్ని పాటించని వాడు చెరువులు త్రవ్వించడం, యజ్ఞ యాగాదులను చేయడం, మొదలైన ఎన్ని ధర్మకార్యాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్ధాలే అవుతున్నాయి. చివరికి వైశాఖమాస వ్రతాన్ని ఆచరించి, ఆ పూజలో  మాధవునికి అర్పించినటువంటి  పూలు, ఫలాలూ కూడా శ్రీ మహావిష్ణువు సాన్నిహిత్యాన్ని పొందుతున్నాయి . అంతటి మహిమోపేతమైనది ఈ వైశాఖమాసవ్రతము .  

ఓ రాజా ! అధిక ధన వ్యయముల చేత చేసేటటువంటి వ్రతాలు ఎన్నో ఉన్నాయి. శారీరిక శ్రమని కలుగజేసే పూజాదికాలూ ఎన్నో ఉన్నాయి .  అయితే, అవి ఆ వ్రతాలన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే కలిగిస్తాయి. అంతేకాకుండా పునర్జన్మను ప్రసాదిస్తాయి. పూర్తిగా ముక్తిని ప్రసాదించవు. కానీ వైశాఖమాసంలో కేవలం  నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతః కాల స్నానము పునర్జన్మని పోగొడుతుంది.  అంటే ముక్తిని ప్రసాదిస్తుంది.  

అన్ని దానాలు చేస్తే వచ్చే పుణ్యము, సర్వ తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే పుణ్యము, ఈ  మాసంలో జల దానము చేయడం చేత లభిస్తుంది. జలదానం ప్రత్యక్షంగా చేసేటటువంటి శక్తి లేనట్లయితే, అటువంటి శక్తి గల మరొకరిని పురికొల్పి జలదానము చేయించినట్లయినా కూడా, చేసినవారికి , చేయించినవారికి కూడా  సర్వసంపదలు ప్రాప్తిస్తాయి. శుభములు కలుగుతాయి . 

ఓ రాజా ! త్రాసులో దానములన్ని ఒకవైపు, మరోవైపు జలదానం ఉంచినప్పటికీ జలదానమే హెచ్చుతూగుతుంది .  బాటసారుల దప్పిక తీర్చడానికి మార్గంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వలన అతని  కులములోని వారందరూ ( వంశములోని వారందరూ )కూడా పుణ్యలోకాలను పొందుతారు.  ఆ విధంగా  పితృదేవతలందరూ పుణ్యలోకాలను పొందుతారు.  జలదానము చేసిన వారు విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ వైశాఖమాసములో  చలివేంద్రములను ఏర్పాటు చేసి  బాటసారుల దాహం తీర్చడం అనే పూజ వలన  సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులై, ప్రీతిని పొంది, వరములను ఇస్తారు . ఇందులో ఎంతమాత్రమూ సంశయము లేదు . 

రాజా ! ఈ మాసములో వాతావరణము వలన దప్పికగలవారు నీటిని కోరుతారు. ఎండ బాధ పడినవాడు నీడని కోరుకుంటాడు . చెమట పట్టిన వాడు విసురుకోవడానికి విసిని కర్రను కోరుకుంటాడు.  కాబట్టి వైశాఖ మాసములో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునికి ఒక నీరు గల చెంబు, గొడుగు, విసిరి కర్రను దానమియ్యాలి. నీటితో నిండిన కుంభమును దానం ఇవ్వడం వలన అనంతమైన పుణ్యము లభిస్తుంది.  ఈ విధంగా దానము చేయనివాడు చాతకపక్షిగా జన్మిస్తాడు.  చాతకపక్షి భూస్పర్శ గల నీటిని తాగినట్లయితే చనిపోతుంది.  కాబట్టి మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టు కింద పడకుండా, ఆకాశంలోనే తాగి జీవిస్తూ ఉంటుంది.  ఆ నీరే దానికి జీవనాధారమైన ఆహారం అని కవులు వర్ణిస్తారు.  ఆ విధంగా  చాతకమై  జన్మించవలసి ఉంటుంది.  దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వారికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. 

 ఎండకు సొమ్మసిల్లినవానిని ఆప్యాయముగా  ఆదరించిన వారు పక్షిరాజై త్రిలోక సంచార లాభాన్ని పొందుతాడు.  ఆ విధంగా జలము ఇయ్యని వారు బహువిధములైన వాత రోగములను పొంది పీడితులవుతారు. 

వైశాఖమాసములో సూర్యతాప బాధితులను ఆదుకున్నవారు  యమదూతలను తిరస్కరించి విష్ణులోకాన్ని చేరుకుంటారు . ఇహలోకములో బాధలను పొందడు.  సర్వలోకములలో  సర్వసుఖాలనూ  పొందగలడు.  చివరికి  చెప్పులు లేక బాధపడే వానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులు దానము చేసినవాడు బహుజన్మలలో కూడా రాజుగా  జన్మస్తాడు.  బాటసారులకు ఉపయోగపడేటట్టు, అలసట తీరే తట్టు మండపాలు మొదలైనవి నిర్మించిన వాని పుణ్యము ఇంత పరిమాణమని బ్రహ్మ కూడా చెప్పలేడు.  మధ్యాహ్నం కాలములో అతిథిగా వచ్చిన వారికి ఆహారమిచ్చి ఆదరించినట్లయితే, అనంతపుణ్యము లభిస్తుంది. 

ఓ అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమమైనది.  కాబట్టి అన్నదానముతో సమానమైన దానమే లేదు.  అలసి వచ్చిన బాటసారిని  వినయ మధురముగా కుశలములు అడిగి, ఆదరించి వాని పుణ్యము అనంతము.  ఆకలి గలవానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మొదలైనవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు.  అన్నము మాత్రమే ఇష్టము ఆవశ్యకము. కాబట్టి అన్ని అన్నదానములతో సమానమైన దానము ఇంతకుముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. 

 జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చినదాతలు మాత్రమే . కన్నందుకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి ఉంటుంది.  కానీ అన్నదానము చేసినవాడు తల్లిదండ్రుల కంటే ఉత్తమ బంధువు.  నిజమైన తల్లి తండ్రి అన్నదాతే.  కాబట్టి అన్నదాత సర్వ తీర్థ ,సర్వదేవతా స్వరూపుడు.  సర్వ ధర్మ స్వరూపుడు.  అంటే దాతకు  అన్నదానము చేత -అన్ని తీర్థములో స్నానం చేసినటువంటి పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలము, సర్వ ధర్మములో అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగుతుంది.” నారద మహర్షి అంబరీష రాజర్షికి చెప్పారు . 

ఆ విధంగా ప్రాతఃకాల స్నానము, విష్ణుపూజ, జల, అన్న తదితర దానాలు ఈ మాసములో విశేషమైన ఫలాన్ని అందిస్తాయి . కాబట్టి వాటిని ఆచరించి దుర్లభమైన విష్ణు సాయుజ్యాన్ని పొందుదాం . 

శుభం !! 

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha