Online Puja Services

వేదాలు - ఒక అవలోకనం

18.217.6.114

వేదాలు - ఒక అవలోకనం 
- లక్ష్మి రమణ 

మన సంస్కృతిని ప్రామాణికం వేదమే . వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు"తెలియుట" అని ఉన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని పిలుస్తారు .

ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, 
(ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం

మొదట  వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు అధ్యయనం చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయడం చాలా కష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. 

ఈ వేదరాశిని వ్యాసుడు-

 ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, 
యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను,
 సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే 
అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. 

కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.

ఋగ్వేదము
యజుర్వేదము
సామవేదము
అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి


మంత్ర సంహిత
బ్రాహ్మణము
ఆరణ్యకము
ఉపనిషత్తులు


ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

ఋగ్వేదము: 
ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంధాలలో ఒకటి ఋగ్వేదం. తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
 

ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః | 
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు (మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

యజుర్వేదము:
యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ | 
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||

మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. 

యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది. 

కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

సామవేదము:
సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః | 
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||

కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ, కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది. 
ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

అధర్వణవేదము:
ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః | 
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||

తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha