Online Puja Services

అష్టాదశవర్ణాలకు అట్లతద్ది

18.117.153.38

అష్టాదశవర్ణాలకు అట్లతద్ది - గొప్ప పండుగ .
లక్ష్మీ రమణ .  

భారతీయ పండుగలు పర్వదినాలు గొప్ప తాత్వికతను , నిగూఢమైన అర్థాలనూ కలిగి ఉంటాయి . ఉండ్రాళ్ళతద్ది ఋతుసంధికాలంలో వస్తుంది , చిరుచలి మొదలయిన తర్వాత వచ్చేది అట్లతద్ది . ఈ రెండు పండుగలూ జరుపుకునే విధానంలో సారూప్యాలున్నా , అట్లతద్ది మరింత సరదాలని సందళ్ళని తీసుకొచ్చే పండుగ . స్త్రీలకి సౌభాగ్యాన్ని , ఆరోగ్యాన్ని అందించే పండుగ .  ఆరేళ్ళ పాప నుండీ అరవయ్యేళ్ళ ముత్తైదువ వరకూ ఈ పండుగని జరుపుకుంటారు . పుణ్యంకొద్దీ పురుషుడు అంటారుకదా ! అలా తమకి లభించే పురుషుడు సుగుణాల రాముడుగా ఉండాలని కన్నెపిల్లలు , నిండుసౌభాగ్యంతో వర్ధిల్లాలని ముత్తైదువలూ శ్రద్ధగా ఉమా దేవిని పూజిస్తారు . 

అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ తదియనాడు జరుపుకుంటారు. అంతకుముందు రోజు వచ్చే విదియనాడు భోగి పండుగ ఉంటుంది. ఉండ్రాళ్లతద్దికి, మకర సంక్రాంతికి ఉన్నట్టుగానే ఈ పండుగకు కూడా భోగిపండుగ ముందుగా వస్తుంది. అట్లతదియనాడు చేసే ఉమాదేవి పూజని లేదా వ్రతాన్ని చంద్రోదయ ఉమావ్రతం అంటారు . ఈ పూజలో అమ్మవారికి ప్రత్యేక నివేదన అట్లు . అందుకే ఆ తర్వాత వాడుకలో ఈ పేరు కాస్తా అట్లతద్ది అని  విస్తృత ప్రచారంలోకి వచ్చిందంటారు పెద్దలు. ఈ పండుగ పరిధి కూడా అంత సామాన్యమైనది కాదు. అన్ని కులాలవారు దీన్ని జరుపుకుంటారు. అందుకే అష్టాదశవర్ణాలకు అట్లతద్ది అనే నానుడి కూడా బహుళ ప్రచారంలో ఉంది. 
     

భోగి : 

భోగిపండుగనాడు తలంటిపోసుకొని పట్టుపావడాలు కట్టిన పిల్లలందరూ, గోరింటాకు చెట్ల వేటలో పడతారు . కొమ్మవిరగకుండా పూలు తెంపండని పాడుకుంటూ , ఆడుకుంటూ చక్కగా గోరింటాకు కోసుకొచ్చి , దానిని రుబ్బి చేతులకి కాళ్ళకీ పెట్టుకుంటారు . 

గోరు+అంటు+ఆకు గోరుకు అంటుకొనే రంగును కలిగించే ఆకు కనుక గోరింటాకు అయింది. గోరింటాకు దగ్గర నుంచే పండుగలో ఆరోగ్యసూత్రాలు చెప్పకనే చెబుతున్నట్లు మొదలవుతాయి. గోరింటాకు పెట్టుకోవటంవల్ల గోళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. దీనికే నఖరంజని అనే పేరు కూడా ఉంది. ఆయుర్వేదశాస్త్రాన్ని అనుసరించి గోరింటాకు ఆరోగ్యపరిరక్షణకు పనికొచ్చే మంచి వనమూలిక కూడా. 

అట్లతద్ది :

సూర్యోదయానికి పూర్వమే లేచి , చక్కగా స్నానం చేసి , సంప్రదాయ బద్ధంగా భోజనం చేయాలి . ఇందులోనే దాగుంది అసలైన సరదా అంతా . అందులోనూ  గోంగూరపచ్చడి, నువ్వులపొడి, పెరుగుపచ్చడి, ఉల్లిపాయలు, ఇతర కాయగూరముక్కలు వేసిన పులుసు వేసుకోవాలి. కొన్నిచోట్ల కందిపచ్చడి, పొట్లకాయకూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, గోంగూర చేస్తుంటారు. ఈ ఆహార పదార్థాలు ప్రాంతాలవారీగా ఒక్కొక్క చోట ఒక్కోలా ఉన్నా అవన్నీ స్త్రీల ఆరోగ్యానికి ఉపకరించేవిగా ఉండటమే విశేషం. ఈ అన్నం తిన్నాక మళ్ళీ సాయంత్రం వ్రతం పూర్తయ్యేవరకూ ఇంకేం తినకూడదు. పిల్లలందరినీ ఒకచోట చేర్చి అమ్మమ్మో , నానమ్మో తమ వాత్సల్యాన్ని కూడా అన్నంలో కలిపి , అట్లతద్ది పాటలు పాడుతో కొసరికొసరి తినిపిస్తుంటే, అలాతిన్న పిల్లల జన్మలు చరితార్థమేకదా ! అంతకన్నా వాళ్ళకి ఆశీర్వాదం ఏముంటుంది . 

తాంబూలచర్వణం :

అట్లతద్దిని తాంబూలాలపండుగ అనికూడా అంటారు . తాంబూలం వేసుకోవడంలో సంప్రదాయంతో పాటు ఎన్నో సుగుణాలున్నాయన్న మాట అందరికీ తెలిసిందే ! సూర్యోదయానికి ముందర తిన్న ఆహారం చక్కగా అరిగిపోవడంతోపాటు , శీతాకాలంలో వచ్చే వ్యాధులకు చక్కటి ముందుగా పనిచేస్తుంది తమలపాకు . సంప్రదాయానుసారం కూడా అట్లతద్ది ఉదయ భోజనానంతరం తాంబూలం తప్పనిసరిగా వేసుకోవాలి .  

ఈ పండుగలో గోరింటాకుకు, తాంబూలాలకు ప్రత్యేక స్థానం ఉంది. చెయ్యి ఎంత ఎర్రగా పండితే, నోరు మరెంతగా  పండితే, అంత మంచి మెగుడు వస్తాడన్నది సరదా నిండిన నమ్మకం. 

తూగుటుయ్యాల సరదాలు : 

మధురానగరీలో తూగుటుయ్యాలపై రాధాదేవిని కూర్చోబెట్టి , మాధవుడు ప్రేమగా ఆటపట్టిస్తూ ఊపుతున్నప్పుడు  పరవశించి ప్రక్రుతి లతాలై ఆ ఊయలని చుట్టుకొని పుష్పించి ఆ దృశ్యాన్ని మరింత మనోహరంగా మలిచిందట . అలాగే, అట్లతద్ది నాటి ఉయ్యాలలూగే వేడుకకూడా బావామరదళ్ళ సరదా సంభాషణలతో , ఆటపట్టించే పాటలతో అల్లరల్లరిగా సాగుతుంటాయి . నవవధువులని అల్లరిచేస్తూ , ముత్తయిదువులు చేసే సందడి అంతాఇంతాకాదు . దీనినే ‘ఢోలోత్సవం’ అంటారు. 

ఢోలోత్సవంలోని ఇంత అల్లరిలోనూ, ఆరోగ్యసూత్రాలను భాగం చేయడం మర్చిపోలేదు మన పెద్దలు .  ఈ పండుగనాడు ఏ ప్రాంతంలోనైనా వినిపించే మొదటిపాట ‘‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌ చప్పట్లోయ్‌ తాశాలోయ్‌ దేవుడి గుళ్లో మేశాలోయ్‌ పప్పూ బెల్లం దేవుడికోయ్‌ పాలు నెయ్యి పాపాయికోయ్‌.....’’ అనేది. ఈ పాటలో పైపైకి చూస్తే అట్లతద్ది సంబరాన్ని చప్పట్లతో తెలియచెప్పినట్టు కనిపిస్తుంది. పాటలోని ఆరట్లు, ముద్దపప్పుతో కూడిన మూడట్ల సంగతి కొస్తే అట్టు వెయ్యటానికి ఉపయోగించే వాటిలో మినప్పిండి, బియ్యపిండిల మిశ్రమంతో తయారైన అట్లు రుచికరంగా ఉండటమేకాదూ స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా ఉపయోగపడతాయి. అలాగే ఋతుక్రమం సరిగారాని స్త్రీలలో ఆ సమస్య పోతుంది. గర్భధారణలో సమస్యలు రావు. ఆరోగ్యసూత్రాలతోపాటు ఈ అట్లలో జ్యోతిషశాస్త్ర సంబంధమైన వ్యవహారం కూడా ఉందని పెద్దలు చెబుతారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. వీటి మిశ్రమంతో తయారయ్యే అట్లనే అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ముత్తైదువులకు వాయనాల రూపంలో ఇవ్వటం వల్ల ఆ గ్రహదోషాలుపోయి వాయనాలిచ్చిన స్త్రీలు పిల్లాపాపలతో, సంసార సుఖంతో సౌభాగ్యవతులుగా ఉంటారన్నది నమ్మకం. 

అట్లతద్దెకు కారణం:

త్రిలోక సంచారి అయిన గౌరీదేవి నారదుని ప్రోద్భలంతో శివుని పతిగా పొందగోరి, ఆ తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్ర్తిలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమది. ఇది చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీల  సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత , బాంధవ్యాలు, సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థముంది. నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజ దోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయానికి కారకుడు కనుక రుతుచక్రం సరిగా ఉంచి, రుతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినువులు, బియ్యం నానబెట్టి వాటిని రుబ్బి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.

చంద్రోదయఉమావ్రతం:

 అట్లతదియ నాటి సాయంకాలం చంద్రోదయఉమావ్రతం పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటారు. చీకటి పడిన తర్వాత చంద్రదర్శనం చేసుకుని, పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని పెట్టుకుని షోడశోపచార పూజలు చేస్తారు. మినపట్లు వేసుకుంటారు. పదకొండు అట్లు సిద్ధంచేసుకుని (కొన్ని చోట్ల పది అట్లు వేసుకుంటారు ) , బియ్యప్పిండితో దీపం చేసి, జ్యోతిని వెలిగిస్తారు. పదకొండు ముళ్ళతో తోరాలు అమ్మవారికి, తమకి, పేరంటాళ్లకు తయారుచేస్తారు. గణపతికి, గౌరీదేవికి రకరకాల వంటకాలు చేసి నివేదన చేస్తారు. ఈ రోజు అమ్మవారికి నివేదనలో పదకొండు రకాల కూరగాయలతో పులుసు, పాలతాలికలు తప్పనిసరిగా చేస్తారు.

వాయనం :

అమ్మవారి పూజానంతరం తోరమును కట్టుకుని,పదకొండు అట్లు నివేదన చేసి, మరో పదకొండు అట్లు, ఒక తోరమును, ఒక ముత్తయిదువుకు వాయనమిస్తారు . 

చంద్రోదయఉమావ్రతం కథ:

పూర్వం ఓ రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ స్నేహితులు నలుగురూ ‘అట్లతద్ది’ వ్రతం ఆచరించారు. ఉదయమంతా ఈ నలుగురూ ఆటపాటలతో, ఊయలలూగుతూ కాలం గడిపారు. పరమ సుకుమారి అయిన కారణంగా ఉపవాసం వల్ల ఆకలికి తట్టుకోలేక రాజు కూతురు సొమ్మసిల్లి పోయింది. ఈమె అంటే అన్నయ్యలకు గారం.అందుచేత ఒక అన్న చింతచెట్టు కొమ్మకు అద్దం కట్టి, అందులో గుండ్రంగా ఉండే వస్తువును కనబడేలా పెట్టి, చెల్లెలు ముఖంమీద నీరుజల్లి ఆమెను సేదదీర్చి ‘చెల్లెమ్మా..అదిగో చంద్రుడు వచ్చాడు., చూడు’ అని అద్దంలో నున్న గుండ్రని వస్తువును చూపించారు. రాజకుమార్తె చంద్రదర్శనం చేసాను అనే నమ్మకంతో ఆహారం భుజించి, ఉమాదేవి వ్రతం ఆచరించింది. ఈ సంగతి తెలియని ఆమె స్నేహితులు యథావిధిగా వ్రతం ఆచరించారు.

ఈ నలుగురికీ యుక్తవయస్సు రాగానే వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే..రాజు కూతురుకు ముసలి వరుడు., తక్కిన స్నేహితులకు పడుచు వరులు వచ్చారు. రాజు కూతురు ముసలి వరుని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక,ఒకరోజు రాత్రి ఇల్లు వదిలి అడవికి వెళ్లి తపస్సు చేయడం ఆరంభించింది . ఆమె తపస్సుకు శివపార్వతులు ప్రత్యక్షమై రాజకుమార్తె చేసిన వ్రతలోపాన్ని ఆమెకు తెలియచెప్పి, ‘ఈసారి అట్లతద్ది నోము యథావిథిగా ఆచరించి, పూజాక్షతలు నీ భర్త శిరసుమీద జల్లు’ అని సలహా ఇచ్చి అదృశ్యమయ్యారు. రాజకుమార్తె ఆ విధంగా వ్రతం ఆచరించి యవ్వనవంతుడైన వరుని భర్తగా పొంది సుఖించింది.

ఉద్యాపన :

ఈ వ్రతాన్ని పది సంవత్సరములు చేసిన తర్వాత పది అట్లు, గుంట పుస్తెలు గల నల్లపూసలతాడు, దక్షిణను పది మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ఇలా ఈ వ్రతానికి ఉద్యాపన చేసిన తర్వాత కూడా ఈ వ్రతాన్ని కొనసగించవచ్చు. 

ఆరోగ్యకరం, మంగళప్రదం అయిన మన సంప్రదాయాలని కొనసాగిద్దాం . ఈ అట్లతద్దిని వేడుకగా జరుపుకుందాం . ఆ ఉమాదేవి దీవెనలు అందుకొని సుఖంగా వర్ధిల్లుదాం . 

శుభం 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha