Online Puja Services

హరిహరులకి యుద్ధం తెచ్చిన వెయ్యిచేతుల బాణాసురుడు !

3.144.187.103

హరిహరులకి యుద్ధం తెచ్చిన వెయ్యిచేతుల బాణాసురుడు !
- లక్ష్మి రమణ 

వెయ్యి చేతులున్న కార్త వీర్యార్జనుడి కథ మనకి తెలిసినదే ! ఆ విధంగా సహస్ర బాహువులున్న వారు శృతులలో మరెవరన్నా ఉన్నారా ? అంతటి వీరత్వాన్ని ప్రదర్శించి, హరుని ఇంట నిలుపుకొని , హరుని ఇంటికి తన బిడ్డని కోడలిగా పంపిన చక్రవర్తి ద్వాపర యుగంలో ఉన్నారు .  ఆయన కథ విన్నవారికి అన్ని మంగళప్రదమైన శుభాలూ సిద్ధిస్తాయని పురాణ వచనం . రండి, శివ పురాణాంతర్గతమైన ఆ రమ్యమైన కథని చెప్పుకుందాం . 

శోణితపురము రాజధానిగా పరిపాలన చేస్తున్న చక్రవర్తి బాణాసురుడు .  మహాశివభక్తుడు. ఏకకాలంలో తన వెయ్యి చేతులతోనూ ఆడీ - పాడీ - అర్చించినందుకూ, ఆనందింప జేసినందుకు మహేశుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు . అసలే బోళాశంకరుడేమో ,  ఏదైనా వరం కోరుకోమని అనుగ్రహించారు. మానులూ , మాణిక్యాలూ, మరణం లేకుండా వరాలూ కోరలేదు ఆ అసురోత్తముడు , ఏకంగా  శివుని తనయింట ఉండమని కోరాడు.

ఇకనేం - తదాస్తూ ! అని బాణాసురుని ఇంట సపరివార సమేతంగా కాపురం పెట్టేశాడు శివుడు. అమ్మ ఆయన వెంట రాలేదు . అయినా భక్తుని కోరిక, కాదనే సమస్యే లేదన్నాడా రుద్రుడు .  ఆవిధంగా 

కొంతకాలం గడిచింది. శివుడే తన ఇంట కొలువై వుండగా, ఆయనే  కొండంత అండగా నిలిచి ఉండగా ఇక తన అధికారానికి ఎదురెవరు అనుకున్నాడు  బాణాసురుడు. మరింత మద గర్వంతో రెచ్చిపోయాడు . భువిని , డివినీ విడిచి పెట్టకుండా తన అరాచకత్వాన్ని కొనసాగించాడు . 

ఇదిలా ఉంటె, బాణాసురుని కూతురు ఉషాదేవి. పార్వతీదేవి అనుగ్రహం ఉన్న కన్య. మన్మధుని వంటి వరుణ్ణి పతిగా కోరుకున్న భక్తురాలు .  ఉష హృదయం తెలిసిన పార్వతి 'కార్తీక శుద్ధ ద్వాదశీ తిథి' యందు నీకొక పురుషుడు తారసపడి, నిన్ను రమించి, నిన్ను వరించగలడు అని వరం అనుగ్రహించింది.  ఆమె సంకల్పం వల్ల కృష్ణుని మనుమడు అనిరుద్ధుడు  ఉషాంతఃపురాన వ్రవేశించి ఆమెతో రతిసుఖాలాడి వెళ్లిపోయాడు.

మన్మధుని మించిన అందగాడై నందున ఉష అతడికి ఎటువంటి అభ్యంతరాన్ని చెప్పలేదుగాని, వివాహం గాకుండానే పరపురుషుని సంగమించడమేమిటని మథనపడింది. చిత్రమేమిటంటే - తన్ను రమించిన పురుషుడెవ్వడన్నదీ, ఎలా ఉంటాడన్నదీ ఆమె వర్ణించలేకపోయింది. అతడ్ని తలపుల్లో దాచడం ఇక తనవల్ల కాక చెలికత్తె చిత్రలేఖతో చెప్పుకుంది.

చిత్రలేఖ ఉపాయం ఆలోచించింది. దేశ దేశాల రాకుమారుల చిత్రాల్ని తెప్పించి, అందులో ఉషను రమించిన వాడిని గుర్తుపట్టమన్నది.

ఇదిలా ఉండగా - ఓ రోజు శివుడి దగ్గర కొచ్చిన బాణాసురుడు "పరమేశా! వెయ్యి చేతులిచ్చావు కాని, ఏం లాభం? వీటికి తగ్గపని కల్పించ లేకపోయావు. నా సహస్ర బాహువులతోనూ ఏకకాలంలో యుద్ధం చెయ్యగల వైరిని చూపించవయ్యా!" అని వేడుకున్నాడు.

"అభీష్ట సిద్ధిరస్తు! నీకు భుజబల గర్వం అధికమైనట్టుంది. నీచేతుల్ని ఒక్కొక్కటే నేలకూల్చే ఘనుడితో నీకు యుద్ధం అతి త్వరలోనే సంప్రాప్తించుగాక!" అని దీవించాడు శివుడు.

ఉష చెప్పిన రాకుమారుడిని, చిత్రపటాల ద్వారా అనిరుద్ధుడిగా గుర్తుపట్టిన చిత్రలేఖ తనకున్న యోగశక్తి చేత రాత్రికిరాత్రే అనిరుద్ధుడ్ని అపహరించి తెచ్చి, ఉష శయ్యాగృహంలోకి చేర్చింది. ఉష యధేశ్చగా తన ప్రియుడితో సుఖాల తేలియాడింది.

ఈ విషయం బాణాసురుడికి తెలిసి, తన అంతఃపురంలోకి - ఈతడెలా ప్రవేశించాడో అర్ధం గాక యుద్ధసన్నద్ధుడయ్యాడు. అయితే అశరీరవాణి హెచ్చరిక మేరకు అనిరుద్ధుని వధించక,చెరలో బంధించాడు.

ఇటు ఉషా అటు అనిరుద్ధుడు సాక్షాత్ దుర్గా స్వరూపురాలైన అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందిన వారు కావడంతో , అనిరుద్ధుడు చిత్రంగా చెరసాలనుంచి బైటికి వచ్చేయగలిగాడు. అనంతరం ఉషా - అనిరుద్ధులు తిరిగి సుఖాలలో్ మునిగిపోయారు.

అక్కడ- ద్వారకానగరిలో అనిరుద్ధుడు అదృశ్యమైన వైనం అందర్నీ విచారంలో ముంచెత్తింది.  నారదుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించాడనే విషయం చెప్పాడు . అప్పుడు కృష్ణుడు  శోణపురాన్ని ముట్టడించాడు.

బాణాసురుని కిచ్చిన మాటప్రకారం - శోణపురంలో కొలువై ఉన్న శివుడు బాణాసురుడికి బాసటగా నిలిచాడు. దాంతో శివ కేశవులకి  ముఖా ముఖీ తలపడవలసిన అగత్యం ఏర్పడింది. శివుడి వరం దేవతలకు అనుకూలంగా మల్చడానికి కృష్ణుడొక ఎత్తువేశాడు.

దాని ప్రకారం - శివుడు స్తబ్ధుడయ్యేలా శౌరి జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడు. మహనీయమైన ఆ అస్త్ర ప్రభావంతో శంభుడు రణ భూమినుంచి వైదొలిగాడు.

వేయిచేతుల బాణాసురుడు, ఇంతకాలానికి తనకు తగ్గ వైరి దొరికాడని సంబరపడి, రణభూమిలో సంబరంగా అడుగుపెట్టాడు . సర్వవశంకరుడైన శంకరుడినే పక్కకు తప్పించగలిగిన విరాధి వీరుడితో యుద్ధం సంఘటిల్లినందుకు - తన భుజబల పరాక్రమం చూపించి లోకాలను మరింత గడగడలాడించే అవకాశం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు.

లోకభీకరమైన యుద్ధం సాగింది. ఏకకాలంలోనే తన వెయ్యి చేతులతోనూ చతుర్భుజుని ఎదుర్కొన్నాడు. సుదర్శన చక్రంతో అన్ని చేతులనూ ఒక్కటొక్కటిగా తరిగి పారేశాడు చక్రపాణి. అలా ఒక్కటొక్కటిగా వెయ్యికి నాలుగు చేతులను మాత్రం మిగిల్చి, (తనతో సముజ్జీ అయినందున) ఈసారి ఎత్తిన చక్రంతో బాణాసురుని శిరస్సు ఖండించబోగా, శివుడు అడ్డుపడ్డాడు.

"వాసుదేవా! బాణుడి గర్వం అణగడానికే నేనీవరం ఇచ్చినాను తప్ప, అతడిశిరః ఖండనం జరగాలనికాదు" అని అనుగ్రహించి ఉషా అనిరుద్ధుల వివాహం దగ్గరుండి జరిపించాడు. ఆవిధంగా హరి హరుల యుద్ధం ముగిసి , ఉషా అనిరుద్ధుల పరిణయం జరిగింది , కథ సుఖాంతం అయ్యింది . 

పరమాత్మ మనవైపునే ఉన్నా, గర్వం తలకెక్కినప్పుడు ఆయనే, స్వయంగా గుణపాఠం చెబుతారు. ఎంతటి బలవంతులైన అప్పుడు పరమాత్మ ప్రేమ ప్రకాశం ముందు, సూర్యుని ముందర దివిటీల్లా వెలవెలబోవాల్సిందే !!

శుభం !! 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha