Online Puja Services

హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి

18.116.239.195

హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి 
- లక్ష్మి రమణ 

ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు,రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ చేత వరాలు పొందిన త్రిమూర్తుల స్వరూపం. ఆ స్వామిని ప్రతి నిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సిద్ధిస్తాయి. హనుమయ్యకి  మంగళ,శని వరాలు అంటే ఎంతో ప్రీతిపాత్రము. ఈ  రెండు రోజులు శ్రద్ద తో స్వామి వారిని కొలిస్తే విశేషామైన ఫలితాలు లభిస్తాయి. ప్రత్యేకించి హనుమంతుని జయంతి రోజున ఆయనని అర్చించడం విశేషమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది .

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"

ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో , అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములు నిండిన కళ్ళతో, చేతులు తలపై పెట్టుకొని ఆనంద పారవశ్యంతో నమస్కారం చేస్తూ,  నాట్యం చేస్తూ ఉంటారని " అర్థం. తన నామాన్ని పలికినా పలుకక పోయినా ‘రామా’ అనే రెండక్షరాల పేరు పాళికామా , భక్తిగా రామునికి నమస్కారం చేసుకున్నామా, హనుమంతుడు వారిని వెన్నంటే ఉండి కాపాడతారు . 

బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్

హనుమంతుణ్ణి తలుచుకుంటే చాలు , చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం, అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగామరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం, వీటన్నింటినీ మించి ఆరోగ్యం కలుగుతాయి . 

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్

హనుమంతుడు అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడు. మహావీరుడు . సూర్యసమానమైన తేజో స్వరూపుడు . అటువంటి రామదూతకి మనస్ఫూర్తిగా నమస్కారం . అందరమూ కలిసి చేద్దాం . ఈ విధంగా  ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే,  ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా  సిద్ధిస్తుందని విశ్వాసం.

ఆంజనేయునికి ఈ జయంతి రోజున చక్కగా తమలపాకులతో పూజ చేయండి . వీలుంటే సింధూరాన్ని అర్పించండి . నైవేద్యంగా అప్పాలు లేదా గారెలు పెట్టండి.  అరటిపళ్ళు కూడా ఆయనకీ ఇష్టమైన ఫలాలు . రోజంతా రామ నామాన్ని , రామ గానాన్ని , రామ భజనని నిర్వహించండి . రామ కథామృతాన్ని పారాయణ చేయండి. ఇవన్నీ ఉన్నచోట హనుమంతుడు తప్పక ఉంటారు . 

హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో , శలవు . 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha