Online Puja Services

అంధకాసురుడు అనే రాక్షసుడు

3.144.250.223

అంధకాసురుడు అనే రాక్షసుడు - అతని కథ 
- లక్ష్మి రమణ 

ఇటీవల ఒక ప్రముఖ తెలుగు సినిమాలో అంధకాసురుడు - అసుర , అంధకాసుర అని విర్రవీగుతూ డైలాగ్ వేస్తుంటాడు . అసలు ఈ అంధకాసురుడు అనే రాక్షస రాజు ఉన్నాడంటారా ? ఉన్నాడు . కానీ ఆ రాక్షసుడు స్వయంగా ఈశ్వరుడి కొడుకు. పుట్టు గుడ్డి. ఆయన గణాలలో ఒకడు. ఈశ్వరుడి పుత్రుడు అంటున్నారు ! మరి పుట్టు గుడ్డి అంటున్నారు అదెలా జరిగింది ? అనుకుంటున్నారా ? అయితే శివ పురాణాంతర్గత మైన ఈ దివ్య ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే !! 

మందరగిరిపై విహారం చేసి, చాలా రోజులైనదని పార్వతీ మాత ముచ్చట పడింది. అమ్మ ముచ్చట తీర్చడం అయ్యవారి వంతు . వారిద్దరూ కలిసి  మందరగిరిని చేరి విహరిస్తూ ఉన్నారు .  రుద్రుడు ఎంతటి ఉగ్రుడైనా, స్వయంగా అగ్ని స్వరూపమైన , చల్లని అమ్మ సన్నిధిలో ఆయన శశిధరుడు, సుందరేశ్వరుడే ! అంతే. ఆయన అలా మహానందపరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడ్డారు . సౌందర్యంలో అమ్మకి ఏ మాత్రం తీసిపోతారు గనుక ఈశ్వరుడు? ఓ క్షణం పాటు ఆ మహామాయ మోహపరవశ అయ్యింది . ఆమె  వెనుక నుండి వెళ్లి చిలిపిగా, ఆయన కళ్లు మూసింది. దాంతో ఒక్కసారిగా సమస్త లోకాలకూ చీకటి కమ్మినట్లయింది.

అంతలోనే జరిగిపోయిన ఆ హఠాత్ - అంధకారానికి అమ్మ కూడా నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల, అరచేతుల్లో స్వేదం కమ్మింది. ఆ కలయిక వల్ల, ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడిన అంధకారం సంఘటితమైనందున 'అంధకుడు' అనే ఓ గ్రుడ్డి బాలకుడు అక్కడ ఉద్భవించాడు.

హిరణ్యాక్ష - హిరణ్య కశిపులనే ఇద్దరు అసుర సోదరులలోను, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే మహాహరి భక్తుడైన కొడుకు ఉన్నాడన్న విషయం తెలిసిందే ! కానీ,  హిరణ్యాక్షుడికి  ఎంతకాలానికీ సంతానం కలగలేదు. దాంతో  అతడు శివునికై తపస్సు చేస్తున్న అటువంటి తరుణంలోనే ఈ బాలకుడు జన్మించడం జరిగింది. ఒకవైపు చీకటి వల్ల అతడు గ్రుడ్డిగా పుట్టాడు. మరి వైపు "తక్షణం తనకో పుత్రుడిని ప్రసాదించవలసింది"గా కోరిన ఆ అసుర భక్తుడు . 

వెంటనే,  అంధకుడిని దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు. గ్రుడ్డి బాలుడని చింతపడ నక్కర్లేదనీ - అసమాన శౌర్య పరాక్రమంతో విలసిల్లగలడనీ అనుగ్రహించాడు. ఆ విధంగా హిరణ్యాక్షుడికి దత్తుడిగా వెళ్లడం అంధకుడు, అసురుడిగా చెలామణీ అయ్యాడు.

హిరణ్యాక్షుడు భూలోకాది సమస్తలోకాలనూ వశపరుచుకుని దేవతలకు పీడగా పరిణమించాడు. భూమినంతటినీ చాపలాగ చుట్టి సముద్రంలో పారేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ రాక్షస కృత్యానికి బాగా నలిగిపోయిన భూదేవి, శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా ఆయన వరాహావతారం ఎత్తి, భూదేవిని తన కోరలపైన నిలిపి, హిరణ్యాక్షుడిని నిర్జించాడు.

అంధకాసురుడు రాజయ్యాడు. 

సాధుస్వభావి అయిన అంధకుని, జ్ఞాతులంతా దాడిలో వశపర్చుకొని అతని రాజ్యం ఆక్రమించుకున్నారు. పుట్టిగ్రుడ్డివాడైన అంధకుడు అడవులపాలై బ్రహ్మను గురించి ఘోర తపమాచరించాడు. బ్రహ్మదత్త వరప్రభావం వల్ల తిరిగి తన రాజ్యాన్ని గెల్చుకొని ఇచ్చా భోగ సుఖా లనుభవిస్తూ,' కోరరాని కోరిక కోరేవరకు తనకు చావు ఉండదన్న' వర గర్వం చేత సంచరిస్తున్నాడు.

ఒకసారి అంధకుడు మందరపర్వతం పై విలాసినులతో విహరిస్తుండగా, అతిలోక సౌందర్యవతి అయిన ఓ స్త్రీని చూసినట్లు - ఆమె ఓ జడదారికి భార్యగా ఉన్నట్లు - చూడగా అతడామెను ఎక్కడినుంచో అపహరించి తెచ్చినట్లు కొందరు గూఢచారులు వార్త తెచ్చారు. అందులో కొందరు ఆప్తులు మరింత ముందడుగు వేసి, "అసురేంద్రా! ఆ అతిలోక సౌందర్యరాశి ముందీ విలాసినుల వందమంది కూడా సాటిరారు" అని అతిశయోక్తి లేకుండానే చెప్పారు. ఆ మాటలకు అక్కడున్న సుందరీమణులు అలిగి వెళ్లిపోయారు. ఎలాగైనా అంతగొప్ప సుందరిని కూడి తీరాలన్న పట్టుదల అంధకుడికి తీవ్రమైంది.

ఆమె ఓ జడధారి ఆధీనంలోగదా ఉన్నది. ముక్కుమూసుకొని తపమాచరించు ముని మ్రుచ్చులకేల ముగ్ధ సౌందర్యం. అతడిని నయాన, భయాన బెదిరించి, ఆ మాననిని  లొంగదీసుకోవడానికి అంతగా ఆలోచనలేల?...అనుకున్నవాడై,తాను ప్రభువు గనుక - స్వయంగా వెళ్లడం హీనకార్యం గనుక ముందుగా రాయబారం పంపాడు.

నిజానికి - తాను ఆ రుద్రాంశ సంభూతుడనీ, పార్వతీదేవి తనకు మాతృసమాన అనీ గ్రహించలేనంత మదించి ఉన్నాడు అంధకాసురుడు.

'పరాక్రమించడం వీర పురుష లక్షణం ' అని తిరుగు రాయబారం పంపాడు శివుడు.

"ఔరా! ఓ జడతాలుపు కింతధిక్కారమా?" అని యుద్ధ సన్నద్ధుడయ్యాడు అంధకుడు.

శివుడు తన త్రిశూలంతో అంధకుణ్ణి పైకెత్తి పట్టుకున్నాడు. అది అతని శరీరంలో మూడుచోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు. అలా కొంతసేపు గడిచేసరికి అంధకుడిలోని కామ, క్రోధ, మాత్సర్యాలు మూడూ అణగిపోయాయి. ఒక్క లోభం మాత్రం వరప్రభావం చేత మిగిలిపోయింది. మదం - మోహం - కామం ప్రతిరూపాలే గనుక అవీ అణగిపోయాయి. అసురగుణాలన్నీ అణగి పోయినందున, ఈ పంచప్రాణాలూ ఎగిరి పోయినందున - అంధకాసుర వధ జరిగినట్లే భావించి దేవతలంతా సంతసించారు.

అలా త్రిశూలానికి వ్రేళ్లాడుతూ, అంధకుడు తానెవరో, ఎటువంటి కోరరాని కోరిక కోరాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని - సామగానంతో సాంబశివుడ్ని సంస్తుతించాడు. హర్షామోదాలతో సాంబమూర్తి అంధకుడ్ని కరుణతో చూసి గణాధిపతులలో ఒకడిగా మన్నించాడు".

ఆ విధంగా అంధకాసురుడు బుద్ధికి పట్టిన అంధకారాన్ని శివుని త్రిశూలపు వేటుతో తొలగించుకొని పరమేశ్వర ప్రకాశంలో తన ఆత్మ ప్రకాశాన్ని జోడించ గలిగాడు . శివ గణాలలో ఒక్కడై శాశ్వత కీర్తిని పొందాడు . శుభం . 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha