Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? 
సేకరణ 

పితృదేవతలను  శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో ఎదురవుతుంటాయి. ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య  పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలీ పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవతాగణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాలను గురించి తెలియచెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.

 పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారు. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వీరే వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. 

మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందాలనుకొని ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్ఠులయ్యారు. ఇలా భ్రష్ఠులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు.

ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. 

సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం విశేషం.  ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడానికి వెనుకాడలేదు. ఆమెకు దివ్యత్వం నశించాలని శపించారు. 

కానీ, మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. 

అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు. ఈ విధంగా అమావాస్యకి ఆపేరు రావడం, ఆ తిధి పితృదేవతలకు అత్యంత ప్రియమైనది కావడం సంభవించంది. 

కాబట్టి ఈ రోజున పితృదేవతలకు శ్రార్ధ కర్మలు నిర్వహించేవారికి అనంతఫలాలు దక్కుతాయి. 

శుభం !!

Relation between Pitru Devata (Pitru Devatha) and Amavasya

#pitrudevata #pitrudevatalu #pitrudevatha #pitrudevathalu #amavasya

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi