Online Puja Services

Mantras are energy-based sounds.They are primarily used as spiritual conduits, words or vibrations that instill one-pointed concentration in the devotee. Other purposes have included religious ceremonies to accumulate wealth, avoid danger, or eliminate enemies etc. 
Mantra is a combination of magical/mystical words and sound waves.Mantra is recited to relax mind & to fulfill the desired work.

మంత్రపుష్పం - అర్థం తెలుసుకున్నారా ? 
-సేకరణ: లక్ష్మి రమణ  

దేవాలయానికి వెళ్ళాక , స్వామిని దర్శించుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకున్నాక , అక్కడి ఆచార్యవర్యులు మంత్రం పుష్పం ఇస్తారు . అప్పుడు చదివే మంత్రం చాలా మంది సంప్రదాయానుసారణవేత్తలకి నోటికి వస్తుంది కూడా ! ఆ మంత్రం చక్కగా స్వరయుక్తంగా , వినసొంపుగా ఉంటుంది . కానీ ఆ మంత్రానికి అర్థం ఏమిటి ? 

ఏ విజ్ఞాన్నయితే, మన మహర్షులు తెలుసుకున్నారో , దానిని సంప్రదాయంగా మనకి అందించారు . నిత్యం ఆ విజ్ఞానాన్ని వింటూ ఉండడం , మననం చేయడం వల్లనైనా సత్యాన్ని గుర్తిస్తారని , సామాన్యులకి కూడా ఆ పరాత్పరుని సన్నిధి సిద్ధించాలనే మహత్తరమైన ఆకాంక్షతో రూపొందించిన అపురూప మంత్రాలలో ఈ మంత్రపుష్పం ఒకటి . సృష్టిలో పరమ సత్యమైనదేమిటో  ఈ మంత్ర పుష్పంలో  వివరించడం విశేషం . ఆ జ్ఞాన బాండాగారం వంటి మంత్రానికి తాత్పర్యాన్ని సేకరించి మీకోసం ఇక్కడ పొందుపరిచాం . చదవండి . 
 

ఓమ్ ధాతా పురస్తా ద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్త్రః
త్వమేవం విద్వా నమృత ఇహ భవతి
నాన్యః పాంథా అయనాయ విద్యతే!

తా: పూర్వము పరమ పురుషుడు ఈ మంత్ర పుష్పమును నిర్మింపగా, సకల ప్రాణికోటిని రక్షించేందుకు  ఇంద్రుడు దీనిని నలు దిక్కులా వ్యాప్తి చేసెను. ఆ పరమాత్మను ధ్యానించుట వలన అమృతత్వము లభించును. ఇది  తప్ప మోక్షప్రాప్తికి వేరు మార్గం లేదు.

శ్లో: సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమ్ పదమ్!(1)

తా: వేయి శిరస్సులు కలిగి అనేక నేత్రములతో ప్రపంచమునకు సుఖము చేకూర్చు వాడును, సర్వ వ్యాపకుడును, సమస్త ప్రాణికోటికీ ఆధారమైనవాడును, శాశ్వతుడూ, శుభకరుడును, మోక్షస్థానమైన వాడును అయిన నారాయణునకు  నమస్కరించెదను.

శ్లో: విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ హరిమ్,
విశ్వ మే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి.(2)
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం
నారాయణం మహాయజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్.(3)

తా: విశ్వానికి అతీతుడును, విశ్వమే తానైనవాడును, నిత్యుడును, సర్వవ్యాపకుడును, విశ్వానికి జీవనాధారమైనవాడును, విశ్వపతియును, విశ్వానికి ఈశ్వరుడును, శాశ్వతుడును, మంగళకరుడును, నాశనము లేనివాడును, తెలిసికొనదగిన పరమాత్ముడును, విశ్వాత్ముడును, విశ్వపరాయణుడును, అయిన నారాయణునికి నమస్కారము.  

శ్లో: నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణపరం బ్రహ్మ తత్వం నారాయణః పరః
నారాయణ  పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః!(4)

తా: నారాయణుడే పరం జ్యోతి, పరమాత్మస్వరూపుడు, అతడే బ్రహ్మ, పరతత్వము, ధ్యానం చేసేవాడూ, ధ్యానమూ కూడ ఆ నారాయణుడే..

శ్లో: యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శూయతేపి వా,
అంత ర్బహి శ్చ త త్సర్వం వ్యాప్య నారాయన స్థితః
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతంవిశ్వసంభువమ్!(5)

తా: బ్రహ్మాండంలో ఈ స్వల్పమైన జగత్తు మహాకాశంలో వేరుగా తోచు ఘటాకాశం వలే కనిపించును. ఉనికిని పొందియుండును. దానికి బయటా, లోపలా, అంతా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అనంతుడు, వినాశములేనివాడు అయిన ఈ దేవుడు సంసార సాగరం నుండి విముక్తిని ప్రసాదిస్తూ ప్రపంచమునకు సుఖం కలిగించును.

శ్లో: పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్!(6)

తా: కంఠమునకు కిందిభాగంలో, నాభికి పై భాగంలో ద్వాదశాంగుళ ప్రమాణం గలిగి, అథోముఖంగా, ముకుళించి ఉన్న పద్మాన్ని పోలిన హృదయం నెలకొని ఉంది.

శ్లో: అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యా ముపరి తిష్ఠతి,
జ్వాలామాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సంతతగ్ం శిలాభి స్తు లంబత్యాకోశసన్నిభమ్,
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్టితమ్,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః,
సోగ్రభుగ్విభజంతిష్ఠ న్నాహార మజరః కవిః,
తిర్యగూర్ధ్వమధశ్శాయీ  రశ్మయ స్తస్య సంతతా.(7,8,9)

తా: ఆ హృదయ కమలమును ఆశ్రయించి, జ్వాలాసమూహముతో వెలుగుతూ, జీవులకు ప్రధాన స్థానమై, అనేక నాడీ సమూహాలకు ఆలంబనయై, అరవిరిసిన పద్మమును బోలిన హృదయాగ్రభాగములో సూక్ష్మమైన కమలం ఒకటున్నది. దానిలో సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది.  దాని మధ్యలో అంతటా జ్వాలలుగా వ్యాపించి గొప్ప అగ్నిదేవుడున్నాడు. ఆ అగ్నియే జఠరాగ్ని.

శ్లో: సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తకః,
తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః.(10)


తా: భుజించిన అన్నాన్ని ఆ అగ్ని సముచిత భాగాలుగా విభజించి పైకి, కిందికి, అడ్డముగాను పంపిస్తున్నది . ఆ అగ్నికిరణాలు ఆపాదమస్తకము వ్యాపించి ఉన్నవి. ఈ న్యాసముచే యోగధ్యానులు చేసేవారు మహా తేజోవంతులవుతారు.

శ్లో: నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవార శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా.(11)

తా: ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ ఊర్ధ్వముగా పైకెగయుచున్నది. అది నీల మేఘము మధ్య మెఱపు వలె ప్రకాశించుచున్నది. నివ్వరి ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అది అణువుతో సమానమై ఉన్నది.

శ్లో: తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరి స్సేంద్రస్సో క్షరం పరమస్స్వరాట్!(12)

తా: ఆ అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ ఉంటాడు. బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు ఆ పరమాత్మయే. నాశరహితుడు, మూలకారణము, స్వయంప్రకాశము గలవాడు ఆ పరమాత్మయే!

శ్లో: యోపాం పుష్పం వేద, పుష్పవాన్, ప్రజావాన్ పశుమాన్ భవతి,
చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద.(13)

తా: ఉదకమున భగవంతుడు, ఆ భగవంతునిలో ఉదకమూ పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి పుష్పాలు, సంతానం, పశువులు లభించుచున్నవి. ఆ ఉదక స్థాన వివరణమెఱిగిన వారు ముక్తులవుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
అగ్నిర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
యోగ్నేరాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
ఆపోవా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(14)

తా: అగ్నిలో ఉదకము, ఉదకములో అగ్ని పరస్పర ఆశ్రయాలు, ఈస్థితిని తెలిసిన వారు ముక్తులగుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
వాయుర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
యో వాయో రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
ఆపోవై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(15)

తా: వాయువు ఉదకమునకు స్థానము. వాయువునకు జలములు స్థానము. పరస్పర ఆశ్రయాలైన వీటిస్థానములను గ్రహించిన వారు ముక్తి పొందుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
ఆసోవై తపన్న పామాయతనం, ఆయతనవాన్ భవతి,
యోముష్యతపత రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
ఆపోవా అముష్యతపత ఆయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(16)

తా:తపింపజేయుచున్న ఈ సూర్యుడే జలస్థానమునకు అధినేత. జలస్థానమే ఆదిత్య స్థానం. వీటి పరస్పర అభేధ స్థితిని ఎఱిగినవారు ముక్తులగుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
చన్ద్రమా వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
యశ్చ్ణన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
ఆపోవై చన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(17)

తా: జనులందరికీ సంతోషము కలిగించే చంద్రుడే జలస్థానపతి. జలాలే చంద్రునికి స్థానము. ఈ విషయం గ్రహించినవారు ముక్తి పొందుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
నక్షత్రాణివా  వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
యోనక్షత్రాణామాయతనం, ఆయతనవాన్ భవతి,
ఆపోవైనక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(18)

తా:  జలములకు నక్షత్రములే స్థానము. ఆ నక్షత్రముల స్థితిని తెలుసుకుని జలమే స్థానమని గ్రహించినవారు ముక్తులగుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
పర్జన్యో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యః పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
ఆపో వై పర్జన్యస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.(19)

తా: ఉదకస్థానమునకు మేఘుడే అధినేత. మేఘములకు జలమే స్థానము. ఈ విషయం తెలుసుకున్నవారు ముక్తులగుదురు.

శ్లో: యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
సంవత్సరో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యః సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
ఆపో వై సంవత్సరస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.
యో ప్సు నావం ప్రతిష్ఠి తాం వేద, ప్రత్యేవ తిష్ఠతి. (20, 21)

తా: సంవత్సరమే ఉదకమునకు స్థానము, ఉదకమే సంవత్సరమునకు స్థానము. వీటికున్న అభేదమును తెలుసుకున్నవాడు ముక్తుడగును. కాబట్టి ఇవి ఏవిధంగా అన్యోన్య ఆశ్రయంగా వున్నాయో తెలుసుకొనవలెను. అట్లు గ్రహించిన వారే ముక్తులు. వరదకు-నీటికి ఎలా అన్యోన్యాశ్రయం వున్నదో అదే విధముగ ఇదికూడా తెలుసుకొన వలెను.

శ్లో: కిం తద్విష్ణోర్బల మాహుః, కాదీప్తిః కింపరాయణం,
ఏకో యాదారయ ద్దేవః, రేతసీ రోదసీ ఉభే. (22)  

తా: ఐహికము, ఆముష్మికము అనే రెంటికి స్వయంప్రకాశమూర్తి ఐన భగవంతుడు ఒక్కడే లోకాన్ని ఎలా ధరించాడు? ఆ విష్ణువు బలమేమిటి? ఆయన ప్రకాసం ఎలాంటిది? అతని పరంధామం ఏది?

శ్లో: వాతాద్విష్ణో ర్బల మాహుః, అక్షరాద్దీప్తిః రుచ్యతే,
త్రిపదా ద్దారయ ద్దేవః, యద్విష్ణో రేక ముత్తమమ్. (23) 


తా: ప్రాణాయామాదులచేత విష్ణువునకు బలం లభించింది. నాశనం లేనివాడడగుట చేత ప్రకాశము కలిగినది. త్రిపదావిభూతి వలన లోక ధారణ చేయగలిగినాడు. ఆయనకు విష్ణులోకం ఒక్కటే పరమపద స్థానం.

శ్లో: రాజాధిరాజాయ ప్రహస్య సాహినే, నమోవయం వై
శ్రవణాయకుర్మహే, సమే కామాన్, కామకామాయ
మహ్యం, కామేశ్వరో వై శ్రవణో దదాతు, కుబేర
య వై శ్రవణాయ, మహారాజాయ నమః.(24)

తా: రాజులందరికీ రాజైన ఆ భగవంతునికి నమస్కారము. కామములకు ప్రభువైన ఆ దేవదేవుడు కోర్కెలన్నింటినీ సపహలెకృతం చేస్తున్నాడు. స్తోత్రాలు వినడంలో ఆసక్తి గలవాడు, బ్రహ్మాండానికి అధినేత ఐన శ్రీమన్నారాయణునకు వందనం.

శ్లో: ఓం తద్బ్రహ్మ,ఓం తద్వాయు, ఓం తదాత్మా,
ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః
అన్తశ్చరతి భూతేషు, గుహాయాం విశ్వమూర్తిషు, త్వం
యజ్ఞ స్త్వం వషట్కార స్త్వ మిన్ద్రస్తగ్ం రుద్రస్త్వం 
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః.(25-26)

తా: ఓం అనే ప్రణవమే బ్రహ్మ స్వరూపం. అదే వాయువు, అదే ఆత్మ, అదే సత్యం, సర్వకారణ స్వరూపం. ఇలా పలికి దానికి నమస్కరిస్తున్నారు. ఆ ప్రణవస్వరూపుడు సకల భూతముల హృదయాల్లోనూ నెలకొని ఉంటాడు. పర్వత గుహలో సంచరిస్తున్నాడు. విస్వమంతా వ్యాపించి ఉంటాడు.  ఓ దేవా! నువ్వు యజ్ఞానివి, నువ్వే వషట్కారమవు, ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ స్వరూపుడూ నువ్వే. ప్రజలను పాలించేవాడవూ నువ్వే!

శ్లో: త్వం తదాప ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్!(27)
ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మదిపతిర్
బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం!(28)

తా: ఓ దేవా, స్వయంప్రకాశాత్మవైన నువ్వే అపోజ్యోతివి. అమృతస్వరూపుడవు. రస స్వరూపుడవు. బ్రహ్మ రూపుడవు. భూర్భువస్సువర్లోకాలలో ప్రణవస్వరూపుడవు నీవే!
తా:నువ్వు సర్వ విద్యలకు అధిపతివి. సమస్తభూతాధిపతివి. బ్రహ్మలోకానికి, బ్రహ్మానికి అధినేతవు. బ్రహ్మస్వరూపుడవు. శివుడవు, ఓంకార స్వరూపుడవు, మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించవలెనని ప్రార్ధిస్తున్నాను.

శ్లో: తద్విష్ణో పరమం పదగ్‌ం సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతమ్!(29)

తా: తతవ్వేత్తలు పరమపదమైన విష్ణులోకాన్ని అంతరిక్షంలోని నాటకదీపమువలె జ్ఞాన దృష్టిచేత ఎల్లప్పుడూ చూస్తూఉన్నారు.

శ్లో: తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య
త్పరమం పదమ్!(30)

తా:పరమపదమైన భగవంతుని మోక్షస్థానాన్ని శ్రద్ధాళువులు పొందుతారు.

శ్లో: ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్,
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః.(31)

తా:ఋతస్వరూపుడు, సత్యస్వరూపుడూ, పరముడూ, బ్రహ్మస్వరూపుడు, విశ్వాకారుడూ, విశ్వనేత్రుడు, జగత్తుకు సుఖం ప్రసాదించువాడూ, పింగళవర్ణుడూ, ఊర్ద్వరేతస్కుడూ, ఐన భగవంతునికి ప్రణామములు.

శ్లో: నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి,
తన్నోవిష్ణుః ప్రచోదయాత్.(32)

తా: శ్రీమన్నారాయణుడు, సర్వవ్యాపి అయిన వాసుదేవుడు, మహా విష్ణువు మా బుద్ధిని అపరోక్షానుభవ లాభసిద్ధియందు ప్రేరేపించును గాక.(ఇది నారాయణ గాయత్రి మంత్రం. ఇక్కడ ఇతర దేవతా గాయత్రి మంత్రములను సందర్భానుసారంగా చెప్పుకొనవచ్చును.)

శ్లో: ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి  సాగరం,
సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి!(33)

తా: ఆకాశం నుండి పడిన నీరు సముద్రాన్ని చేరుతున్నట్లు ఏ దేవునికి నమస్కరించినా ఆ నమస్కారం  కేశవునికే చెందుతోంది.

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇటువంటి అద్భుతమైన మంత్రాల యొక్క సారాంశాన్ని పూర్వం అరుగుల మీద చేరి , లేదంటే, గుడిలో పూజా కార్యక్రమాల అనంతరం ఊరంతా ఒకచేత చేరి కాలక్షేపంగా చెప్పుకొని తరించేవారు . ఇప్పుడలాంటి సౌలభ్యం మనకి లేదుగణాంక , మనం తెలుసుకొని మన వారసులకు చెప్పడం వల్ల , ఇంతటి జ్ఞాన బాండాగారం ముందుతరాలకు వారసత్వంగా అందించినవారమవుతాం . మన మహర్షుల సంకల్పానికి ఉదాత్తాసాయం చేయగల్గినవారమవుతాం . శుభం .

Videos View All

మంత్రపుష్పం - అర్థం తెలుసుకున్నారా ?

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya