Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

నాయనార్ల గాథలు -ఎరిపాత నాయనారు. 
లక్ష్మీ రమణ 

గోపాలుడు లేకపోతే, గోవులని రక్షించేవారెవరు? రాజు లేకపోతే ప్రజలని పాలించి కాపాడేవారెవరు? తన భక్తులని కాపాడుకునేందుకు ఈశ్వరుడే ఆవిధంగా రక్షకుడై నిలుస్తాడు. అటువంటి కార్యాన్ని ఈశ్వరుని తరఫున తాను  నిర్వర్తించాలని  నడుంకట్టి సదా ఈశ్వర భక్తులని రక్షిస్తూ జీవనాన్ని గడిపిన వారు ఎరిపాత నాయనారు. ఈయనకి , కరువూరు (కరువ్యూర్ అనిలై) పశుపతినాధుని ఆలయానికి విడదీయరాని సంబంధముంది. ఈ పశుపతినాధుని అనిలయ్యప్పర్ అనికూడా పిలుస్తారు. ఇంతకీ అనిలై అంటే కామధేనువు అని అర్థం . ఈ ప్రదేశములో కామధేనువు ఈశ్వరుణ్ణి ఆరాధించి, ప్రసన్నం చేసుకున్న కారణంగా ఈ ప్రదేశానికి ఆ పేరొచ్చింది.  పశుపతి అంటే జీవులకి పతి/జీవులని పాలించేవాడు అని అర్థం . కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమే ఈ అనిలయప్పర్. దివ్యమైన ఆ స్వామి కరుణా కటాక్షాలతో నిండిన ఎరిపాత నాయనారు కథని ఇక్కడ చదువుకుందాం .

కరువూరుని అంబరావతీ నది పావనం చేస్తూ ఉంటుంది. అక్కడ కొలువైన  పశుపతినాధుడు స్వయంభువు.  అమ్మవారు సౌందర్యనాయకి.  ఇక్కడ బ్రహ్మదేవుడు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఈ ఆలయం పురాణకాలంనాటిదిగా మనకి ఆధారాలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన వృత్తాంతం మనకి స్కాంద పురాణంలో కనిపిస్తూఉంది . చోళ రాజైన  ముచికుందుడు కరువూరుని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించేవాడు. తన కుమార్తె అయిన దేవసేనని స్కందునికిచ్చి వివాహం చేస్తూ, ఇంద్రుడు ముచికుంద చోళుణ్ణి  ఆహ్వానించినట్టు ఈ పురాణం చెబుతున్నది.  అప్పటి నుండి కరువూరు ఒక పట్టణంగానే విలసిల్లింది. 

 అటువంటి  చరిత్ర గలిగిన పట్టణంలో పుట్టారు మన ఎరిపాత నాయనారు.  మహా శివ భక్తుడు.  శివాంశ అయిన వీరభద్రునిలా, కాల భైరవునిలా ఉండేది ఆయన్ని చూస్తుంటే ! అదే విధంగా త్రిపుండ్రాలతో, రుద్రాక్షలతో చేతిలో ఒక గొడ్డలి పుచ్చుకొని తిరిగేవారాయన .  ఎవరైనా శివ భక్తులకి హాని చేస్తున్నట్టు , ఇబ్బందిని కలుగజేస్తున్నట్టు ఆయనకి అనిపిస్తే, వెంటనే ఆ గొడ్డలిని అటువంటి వారిమీద ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకాడేవారు కాదు.  ఆవిధంగా శివుడు తనని, శివ భక్తులకి రక్షణగా ఈ భువికి పంపారని ఎరిపాత నాయనారు భావించేవారు . 

కరువూరులోనే శివకామీ ఆండార్ అనే శివభక్తుడు ఉండేవారు.  ప్రాతఃకాల శివార్చనలు, అభిషేకాలూ ముగించుకొని, శివునికి  ప్రీతికరమైన పూలని సేకరించి అందమైన మాలలల్లి ఈశ్వరునికి  సమర్పించడం ఆయన దినచర్య .  

ఒకనాటి మహానవమి నాడు శివకామీ ఆండార్ శివపూజకు తాను సేకరించిన పూలన్నీ ఒక సజ్జలో వేసుకొని పశుపతినాధుని ఆలయానికి బయలుదేరారు. అదే సమయంలో ఆ దేశపు రాజుగారి పట్టపుటేనుగుని అంబరావతీ నదీ స్నానానికి తీసుకువచ్చారు  మావటీలు. ఆ ఏనుగుకి ఉన్నట్టుండి తీవ్రమైన ఆవేశం వచ్చింది. ఒక్కసారిగా అదుపు తప్పి జనాల మీద పడింది. శివకామీ ఆండార్ వయసులో పెద్దవాడు.  గబగబా పరుగెత్తలేని శివభక్తుడు.  ఆయన ఆ ఏనుగు ప్రతాపానికి దొరికిపోయారు. ఆ ఏనుగు శివపూజ కోసం  ఆండార్ సేకరించిన పూలసజ్జని లాగి నేలకేసి విసిరి కొట్టింది.  అదే ఊపుతో ముందుకు పరిగెత్తింది. 

ఆ ఏనుగు తన జోలికి రానందుకు సంతోషించలేదు ఆండార్.  శివ పూజకి తాను సేకరించిన పూలన్నీ నేలపాలు చేసేసిందన్న ఆవేదనతో, దానివల్ల శివాపరాధం జరిగిందన్న ఆక్రోశంతో  ‘శివా! శివా!’ అని కేకలు పెడుతూ పిచ్చివాడిలా ఆ ఏనుగు వెళ్ళినవైపు పరుగెత్తే ప్రయత్నం చేశాడు.  నాలుగడుగులు వేయగానే ఆయాసంతో కుప్పకూలి కిందపడ్డాడు.  

అప్పుడే అటుగా వెళుతున్న ఎరిపాత నాయనారు, శివకామీ ఆండార్ ‘శివా! శివా!’ అని ఆర్తిగా పెడుతున్న కేకలు విన్నారు.  ఆయన దగ్గరికి వచ్చి , జరిగినా విషయమంతా తెలుసుకున్నారు. “ ఆ ఏనుగు ఎటు వెళ్ళింది?” అని అడిగారు. ఆండార్ చేతితో చూపినవైపు సుడిగాలిలా పరిగెత్తుకుంటూ  వెళ్లారు.  మదమెక్కిన ఆ పట్టపుటేనుగుని చూస్తూనే , తన చేతిలో ఉన్న గొడ్డలితో ఒక్క వేటున నరికేశారు.  పట్టపుటేనుగుమీద అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆయనమీదికి వచ్చారు మావటీలు.  నిస్సంకోచంగా వాళ్ళని కూడా ఊచకోత కోశేశారు ఎరిపాత నాయనారు. 

ఎవరో పట్టపుటేనుగుని చంపేశారన్న వార్త తెలిసిన రాజుగారు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. అక్కడ ఎరిపాత నాయనారు అపర వీరభద్రుడిలా ఇంకా ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. అయితే రాజుగారికి చనిపోయిన తన పట్టపుటేనుఁగు కనిపిస్తోంది. కానీ అక్కడ నిస్చేష్ట్రమై ఉన్న జనం మధ్యలో ఎవరు దాన్ని అంతమొందించారో తెలియలేదు. దాంతో  “ఎవరీ ఘాతుకానికి ఒడిగట్టింది?” అని గద్దించాడు. వెంటనే ఎరిపాత నాయనారు “ రాజా! నేనే ఈ పని చేశాను.  అయితే, జరిగింది శివ ద్రోహం.” అంటూ శివకామి ఆండార్ వృత్తాంతమంతా వివరించారు . 

రాజుగారు అమితమైన శివభక్తుడు.  జరిగింది శివద్రోహమని తెలుసుకొని చలించిపోయాడు.  వెంటనే తన కత్తి  దూశాడు.  “ ఓ శివ యోగీ ! ఇంతటి శివాపరాధం జరిగిందని నేను తెలుసుకోలేకపోయాను. ఇటువంటి వారిని పనిలో పెట్టుకున్నందుకు, వీరికి యజమాని అయిన నేను కూడా శివాపరాధం చేసినట్టే లెక్క .  అందువల్ల మీరు నన్ను కూడా సంహరించవలసిందే ! మీ పవిత్రమైన ఆయుధానికి (గొడ్డలికి ) ఈ కళంకాన్ని అంటనీయకండి.  నా ఈ ఖడ్గంతో నా కంఠాన్ని తెగనరకండి” అంటూ ఆ శివ యోగి ముందు మోకాళ్లపై మోకరిల్లాడు. 

రాజుగారి మాటలు విన్న ఎరిపాత నాయనారు కోపం పొంగే పాలమీద నీళ్లు జల్లినట్టు చల్లారిపోయింది.  వెంటనే, ఇంతటి శివ భక్తుని పట్ల నేను అనుచితంగా ప్రవర్తించానా అనే సందేహంలో పడిపోయారు. అంతటి శివభక్తుడు, ఉత్తముడు అయినా రాజుకి బాధని కలిగించి తానే తప్పు చేశానని భావించారు. రాజుగారు ఇచ్చిన ఖడ్గంతో తన కంఠాన్నే నరుక్కోబోయారు.  అప్పుడు రాజుగారు తనవల్ల మరో ఘాతుకం జరుగబోతుందని , ఎరిపాత నాయనారు చేతిని పట్టుకొని ఆయన ప్రాణం పోకుండా ఆపేశారు. 

అప్పుడు అశరీరవాణి పలుకు వినిపించింది.  అశరీరవాణి అంటే సాక్షాత్తూ ఆ ఈశ్వరుని వాక్కే కదా ! “ భక్తులారా ! ఇదంతా ఆ పశుపతీశ్వరుని లీలా విలాసం .  మీ భక్తి తత్పరతని ప్రపంచానికి చాటేందుకు ఆ ఈశ్వరుడు చేసిన కేళీ విలాసమే ఇదంతా  ! దీనికి మీరు చింతించవలసిన పనిలేదు.  కాలమున్నంతవరకూ జీవించి, అంత్యాన మీరు శివసాయుజ్యాన్ని పొందగలరు” అని దివ్య సందేశం వినిపించింది.  అంతేకాదు, ఆశ్చర్యకరంగా అక్కడ చనిపోయిన ఏనుగు, మావటీలు అందరూ కూడా పునర్జీవితులయ్యారు. శివకామీ ఆండార్ పూల సజ్జ చక్కని పుష్పాలతో నిండిపోయింది.  

ఆ రాజుగారు , ఎరిపాత నాయనారు ఒకరికి ఒకరు నమస్కారం చేసుకున్నారు . శివకామీ ఆండార్ కి సాగిలపడి మొక్కారు.  ఈశ్వరుని కృపా కటాక్షాలకు సంతోషంతో ఒకరిని ఒకరు కౌగలించుకున్నారు. అందరూ కలిసి ఆ పశుపతీశ్వరుని ఆలయాన్ని చేరుకొని ఆ స్వామిని వేనోళ్ళా కీర్తించారు. 

ఆ విధంగా జీవించిన ఎరిపాత నాయనారు, ఆ పశుపతీశ్వరుణ్ణి , ఆయన భక్తులనీ సేవించుకుంటూ అంత్యాన అశరీరవాణి చెప్పినట్టు  ఈశ్వరుని చేరుకున్నారు. ఈ నాయనారు కథని చెప్పుకొని ఎవరైతే ఆ పశుపతి నాధుని స్మరిస్తారో వారికి జీవితంలో భయం అనేది దరిచేరదు. ఈశ్వరుని రక్ష లభిస్తుంది. ఆ విధంగా ఆ పశుపతి నాధుడు అనుగ్రహించాలని కోరుకుంటూ .. 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు . శుభం    

 

Nayanar, Stories, Eripatha, Eripata, 

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda