Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

వీరశైవ భక్తి రస గంగా తరంగం - వీరభద్రుని వీధిపళ్ళెం . 
- లక్ష్మి రమణ 

  వీరభద్రుడు - పేరులోనే వీరత్వాన్ని , భద్రతనూ దాచుకున్న దేవుడు . పరమేశ్వరుని మహోగ్రస్వరూపమే వీరభద్రుడు. ఆయనకి చేసే విశిష్టమైన పూజ , వీరశైవులు ఆచరించే ఒక ఆచారము వీరభద్ర పళ్లెం / వీరభద్రుని వీధి పళ్ళెం . ఈ పూజా తతంగం అద్భుతమైన వీరవిన్యాసాలతో కూడి ఉంటుంది.  అసాధ్యం అనిపించే వీరనాట్యంతో అద్భుతమనిపిస్తుంది .  శివద్వేషులని అంతంచేసే  మహావీర ఖడ్గాన్ని ఈ తతంగంలో ప్రదర్శిస్తారు .  ఆ వీరనాట్యం (veera Natyam) చూసి తీరాల్సిందేగానే చెప్పశక్యం కాదు. అటువంటి వీరభద్రుని పళ్ళెం (Veerabhadra Pallem) వీరశివాచారకుటుంబాలకు ఒక కుటుంబ ఆచారంగా వస్తూంటుంది . ఈ విన్యాసాన్ని గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . 

వీరభద్ర స్వరూపము : 

రుద్రం రౌద్రావతారం హుతవహ నయనం 
ఊర్ధ్వ రేతం సుదంష్ట్రం వ్యోమాంగం భీమరూపం 

కిణికిణి రభసం జ్వాలామాలావృతాంగం 
భద్రకాళీ ప్రియాయ శ్రీ వీరభద్రం నమామి .
  

ఈ ఒక్క శ్లోకము చాలు భీతావాహమైన ఆ వీరభద్రుని (Veerabhadra) స్వరూపాన్ని కనుల ముందర ఆవిష్కరించడానికి . శ్రీ వీరభద్ర స్వామి సతీమణి భద్రకాళి. (Bhadrakali) వీళ్ళిద్దరూ కూడా శివుని (Shiva) మహోగ్రస్వరూపానికి సంపూర్ణ స్వరూపము.  వీరభద్రుడు ఆయుధం పేరు పట్టిసం.  వెయ్యి చేతులు కలిగి అనేక ఆయుధాలు శస్త్రాస్త్రాలు ధరించిన సంపూర్ణ రుద్రస్వరూపుడు.  సమస్తములైన భూత, ప్రేత, పిశాచ గణాలు, శాకిని, ఢాకిని, కామిని వంటి ప్రథమగణ పిశాచాలు ఈయన అధీనంలో ఉంటాయి. ఈ  రుద్ర గణాలు ఈయనని సేవిస్తూ ఉంటాయి. 

విపత్కర సమయంలో, దిక్కుతోచని పరిస్థితిలో భక్తులను ఆదుకునే పరమ భోళామూర్తి వీరభద్రుడు.  సమస్త క్షుద్ర గణాలకు వీరభద్రుడు అంటే పరమ భయం. ఆ  స్వామిని తలుచుకుంటే చాలు, సేవించుకుంటే చాలు.  అటువంటివారిని  పిశాచ బాధలు, సర్ప బాధలు, క్షుద్ర శక్తులు ఏమీచేయలేవు. కనీసము దరిదాపుల్లోకి కూడా రాలేవు. వీరభద్రుడు  పిశాచ గణాలకు అధిపతి.  అంటే వాటిని ప్రోత్సహించేవాడని అర్థం కాదు, అమంగళమైన శక్తులన్నిటికీ వీరభద్రుడు అంటే అమితమైన భీతి . వాటిని నియంత్రించేవాడు, పాలించేవాడు, అడ్డుకోనేవాడు అని గ్రహించాలి. 

అందరి కోరికలు తీర్చేవాడు పరమేశ్వరుడైతే ఆయన ఆదేశాన్ని అనుసరించి దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేసి, శివునికి మానసిక ఉపశమనాన్ని కలగజేసిన మహత్తర పరాక్రమవంతుడు శివ మానస పుత్రుడు శ్రీ వీరభద్రుడు. 

వీరభద్ర పళ్ళెం : 

వీరభద్రుని పూజించే విధానం అంతా కూడా వీర విన్యాసాలతో కూడి ఉంటుంది.  వీర శైవ సంప్రాదాయం వారు ఎక్కువ మంది ఈ వీర భద్ర వినాస నృత్యాలు చేస్తూ వుంటారు. ఈ విధానాన్ని వీర భద్ర పళ్ళెం పట్టట మంటారు. ఇందులో వీరభద్రుని ఆవిర్భావకథని దక్షుయజ్ఞ దండకం గా అమితమైన ఆవేశంతో చదువుతూ, ఢమఢమ డప్పులు మోగిస్తూ,  నారసాలు పొడుచుకోవడం, అగ్గి విన్యాసాలు చేయడం, సూదుల్లాంటి మేకులున్న పావుకోళ్ళని ధరించి అశ్శరభ శ్శరభ, దశ్శరభశ్శరభ అని నాట్యం చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం  ఇలా ఎన్నో వీరోచిత విన్యాసాలుంటాయి. 

వీరభద్ర ఆవిర్భావం : 

భృగుమహర్షి ఆధ్వర్యంలో, ఈశ్వరునికి మామగారైన దక్షప్రజాపతి అహంకారంతో తలపెట్టిన యజ్ఞం నిరీశ్వర (ఈశ్వరుడులేని) యజ్ఞం.  దీనికే దక్షయజ్ఞం అని పేరు. ఈ దక్షయజ్ఞానికి తండ్రి ఆహ్వానాన్ని అందుకోకుండానే , హాజరవుతుంది సతీదేవి. అక్కడ పిలవని పేరంటానికి వచ్చిందన్న ఎత్తిపొడుపుని , శివనిందని, హేళనని తట్టుకోలేక, ప్రాయోపవేశం చేసి, యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైయ్యారు. ప్రక్రుతి స్తంభించిపోయింది. అప్పుడు  తన ఝటాఝూటం నుండీ ఒక పాయని తీసి నేలకేసి విసిరికొట్టారు. ఆ పాయ నుండీ పుట్టినవాడు మహోగ్ర రుద్రస్వరూపుడు, విధ్వంసకుడు వీరభద్రుడు.  అదే పాయ నుండీ వెలువడిన కాళీ స్వరూపిణి - వీరభద్రునికి తగ్గని వీరనారీమణి భద్రకాళి. 

శివుని ఆజ్ఞమేరకు ఆ దక్షయజ్ఞాన్ని, తన అనుచర శివగణాలతో వెళ్లి నాశనం చేశాడు వీరభద్ర , భద్రలయాళీల జంట. దక్షుని కుత్తుకని తెగనరికి హోమగుండంలో పడేశాడు.  అక్కడ నూరుసూర్యులకి సమానమైన వీరభద్రునిముందర సూర్యుడితో సహా నిలబడగలిగిన దేవత ఒక్కరు కూడా మిగల్లేదు. దొరికినవాడు దొరికినట్టే నిర్జీవమై పడిపోయాడు అంతే ! అది ఒక కరాళ నృత్యం .  అది వర్ణనలకందని భీభత్సం.  భీతావహం. నెత్తురు ఏరులయ్యింది.  శివుని మనసు శాంతించింది. 

ఆ తర్వాత శాంతించిన ఈశ్వరుడు తిరిగి దక్షుని బ్రతికించడం మిగిలిన కథ.  అయితే వీరభద్రుడు మాత్రం భద్రతని కల్పించేవాడు. వీరుడు . స్వయంగా రుద్రుడు.  పాహిమాం అని ఒక్క సారి ఆ రుద్రుని శరణంటే చాలు. కష్టమేదైనా ఇక మనగడప తొక్కలేదు.  ఇది నూటికి నూరుపాళ్లు సత్యం. వీరశైవుల విశ్వాసం. అందుకే ఆ వీరభద్రుని పూజలో వారు ఎంతటి వీరప్రదర్శనకైనా తెగబడతారు.  ఆయన్ని మెప్పించడానికి తమ శరీరానికి ఎన్ని బాధలైనా ఓరుస్తారు. గాయాలైనా, రక్తం కారినా  భక్తి  పారవశ్యంతో భరిస్తారు. 

ఖడ్గవిన్యాసం: 

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం (వీరభద్ర ఆవిర్భావ గాథ ని వివరించే పదాల్లాంటివి) చదువుతాడు. పళ్లెంలో మహావీర ఖడ్గాన్ని ఉంచుతారు.  వీభద్రపళ్లెంలో ఈ ఖడ్గ విన్యాసం తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గం పట్టి చేసే  ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ మహావీరఖడ్గ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి దట్టంగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద _ అబబబబ _ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని వీరభద్రుని ఆవిర్భావగాథ లైన దక్షుని దండకం తదితరాలు చదువుతూ వీరనాట్యం చేస్తాడు. హంగూ, ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరా వేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతనుగాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్య గాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానాహంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ వుత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా వూరంతా ఊరేగుతూ ఒక్కొక్క మజలీ వద్దా... అంటే నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా వుత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు. కొన్ని చోట్ల నిమ్మకాయలు గుచ్చడం ఉంది. 

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాస ముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా వుత్తేజంగానూ, భయంకరం గాను వుంటుండి. ఖడ్గ నృత్యంఅయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచు కుంటాడు. 

నారసాలంటే రెండు మూడు రకాలుగా వుంటాయి.  ఏకనారసం _ కంటి నారసం _ గొంతు నారసం _ శిరసు నారసం_ శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా వుండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. వుద్రేకంలో వున్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతి కిస్తారు. నృత్య కారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగి నట్టు వీరాధి వీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

స్థలానుకూలంగా ఆచారాలు: 

వీరభద్రుని పళ్ళెం పట్టే విధానంలోని ప్రధాన విన్యాసాల గురించే మనం ఇంతసేపూ చెప్పుకున్నాం.  కొన్ని చోట్ల ఈ విన్యాసాలతో పాటుగా నిప్పుల గుండాలు తొక్కడం తదితర ఎన్నో భీభత్సమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. కలియుగంలో జంతుబలులు నిషేధించినా కొన్ని చోట్ల అవి ఈ విన్యాసాల్లో చోటుచేసుకుంటాయి. సాధారణంగా కూష్మండాన్ని   సాత్విక బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇలా వీరభద్ర పల్లె వృరోచిత విన్యాసాలతో కూడి చివరగా ఏదైనా ఒక వీరభద్ర దేవాలయం దగ్గరే ముగుస్తూ ఉంటుంది. 

 ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కురవి ప్రత్యేకం : 

వీరభద్రునికి ఎన్నో ప్రదేశాల్లో అద్భుతమైన మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నప్పటికీ, వరంగల్ జిల్లాలో, కురవి మండలంలోని కురావు గ్రామంలో నెలకొన్న వీరభద్రుడు ప్రత్యేకమైన స్వామీ. ఇక్కడి స్థానికులతో ఆ స్వామీ మానుష రూపంలో వచ్చి ఆటలాడేవారని, అంతలోనే హటార్తుగా మాయమయ్యేవారని ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు.  

ఇప్పటికీ ఈ స్వామిని శరణు వేడినవారికి స్వామి సులభ ప్రసన్నుడై దర్శనమిస్తారని విస్వాసం.  శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. భద్రకాళి, వీరభద్రుల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతారు. రధోత్సం జరుగుతుంది. ప్రభల బళ్ళు కడతారు. వీరభద్రుని వీధి పళ్లెం సంప్రదాయాన్ని కనులారా తిలకించి వీరోచితమైన ఆ వీర సంప్రదాయపు అనుభూతిని మనసూ శరీరం లీనమయ్యేలా అనుభవించాలంటే, కురవిలోనే చూడాలని అత్యధికుల విశ్వాసం. 

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

శాంతి !! శుభం !!

Veerabhadra Veedhi Pallem, 

#veerabhadra #veerabhadraveedhipallem

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda