Online Puja Services

తొలి తిరుపతి - తిరుమల తిరుపతి కాదా ?

52.14.85.76

తొలి తిరుపతి - తిరుమల తిరుపతి కాదా ?
- లక్ష్మి రమణ 

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు కష్టాలని కడతేర్చే ఆపదమొక్కులవాడు . తిరుపతి వెంకన్నని శరణంటే , కష్టాలు కనిపించనంత దూరం పారిపోతాయని , పాపాలన్నీ తొలగిపోతాయని , లక్ష్మీ కటాక్షం కనికరిస్తుందని అశేషమైన భక్తుల అనుభవం , నమ్మకం కూడా ! అయితే, వెంకన్న కొలువైన తొలి తిరుపతి మాత్రం తిరుమల కాదని ఈ క్షేత్ర స్థల పురాణం వివరిస్తోంది . 

 తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివిలి లో కొలువైన శృంగార వల్లభుని సన్నిధే తొలి తిరుపతి అని ఇక్కడి  స్థల పురాణం  చెబుతోంది .  దీనిని చెదలవాడ క్షేత్రంగా కూడా చెబుతారు . ఈ స్వామి పురాతనత్వం దృవ నక్షత్రమంత పాతది . ఇంకా చెప్పుకుంటే, ఆ నక్షత్రంతో ముడిపడినది . 

 సింహాచలంలో  శ్రీహరి  8000 సంవత్సరాల క్రితం వెలిశారు.  తిరుమల తిరుపతిలో  వెంకన్నగా  6000 సంవత్సరాల క్రితం కొలువయ్యారు . ఈ విధంగా  దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలతో పోల్చి చూస్తే,  అత్యంత  పురాతనమైన , పరమ పవిత్రమైన క్షేత్రం పెద్ద పురంలోని శృగారవల్లభుని సన్నిధి . 

ఈ  చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉంది . 

విష్ణుమూర్తి ఈ భువిమీద శిలా రూపంలో తొలుత  ఇక్కడే వెలసినందుకు ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువుగా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.

ఆలయ చరిత్ర : 

ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యంగా ఉండేది.  అది ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయం. అప్పుడు  ధృవుని తల్లి అయిన సునీతి, నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే,  శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట.  అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. ఆ  సమయంలో ఇక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉండేది . ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని, శ్రీ మహా విష్ణువుని గురించిన  తపస్సు చేసే విధానాన్ని తెలుసుకొని, హరి నామాన్ని ఉపదేశంగా పొందారు . 

అలా చిన్న పిల్లాడైన ధృవుడు శ్రీ హరిని గురించి తీవ్రమైన తపస్సు చేశారు . మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు.  ఆయన తేజస్సుని, పరమాత్మ స్వరూపాన్ని చూసి ధృవుడు భయపడ్డారు .  అప్పుడు విష్ణుమూర్తి “నాయనా భయమెందుకు? చూడు  నేనూ నీ అంతే వున్నాను కదా!”  అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టారట . అలా ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిశారని స్థల పురాణం .

ఆలయం - విశిష్టత: 

ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు.  ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).

అద్భుతమైన దర్శనం : 

“స్వామి నేనూ  నీ అంతే వున్నాను కదా !” అని అన్నందుకు ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న  గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)! అద్భుతం అనే మాట తప్ప మరో మాట ఈ దర్శనం తర్వాత అనలేము . భగవంతుని సర్వవ్యాపకత్వానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా ? స్వామి దర్శనంలో మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి . 

1) స్వామి చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 

2) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 

3) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 

4) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లబిస్తుంది. 

పూజా విశేషాలు : 

నిత్యమూ ధూప దీప నైవేద్యాలతో పాటుగా స్వామికి  శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి నాడు అంటే,  చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు మొదలవుతాయి.  అప్పటినుండీ  అంగ రంగ వైభవంగా  ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి . ధనుర్మాసం లో నెల రోజుల పాటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి.  

ఇలా చేరుకోవచ్చు : 

తొలి తిరుపతిగా ప్రసిద్ధిని పొందిన   శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.

పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi