Online Puja Services

పద్దెనిమిది పురాణాలూ గణపతి ఉత్పత్తిని ఒక్కోరకంగా వివరిస్తున్నాయా ?

3.137.171.121

పద్దెనిమిది పురాణాలూ గణపతి ఉత్పత్తిని ఒక్కోరకంగా వివరిస్తున్నాయా ?
- లక్ష్మి రమణ 

గణపతిని  ఏవిధంగా వేదాలు కీర్తించాయనే విషయాన్ని ఇదివరకే చెప్పుకున్న అనేక గణపతి విశేషాన్వితమైన పోస్టుల్లో చెప్పుకున్నాం . ( చూడండి : పందొమ్మిది ముఖాలు కలిగిన వైశ్వానరుడు “గణపతే”). అటువంటి వేదాలు పామరులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చక్కని పురాణాలుగా అందించిన మన మహర్షులు ఆ శృతులలో కూడా గణపతి గొప్పతనాన్ని ఎంతో  ఉన్నతంగా వివరించారు. వీటిల్లో గణేశుని జననం గురించిన కథలు రకరకాలుగా ఉన్నాయి . వాటిని గమనించినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు . 

 పురాణాలలో గణపతి

గణేశుని పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. వేదవ్యాసుడు వ్రాసిన 18 పురాణాలు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి క్రమాన్ని వివరిస్తున్నాయి. అయితే, ఈ కథనాలను పరస్పర విరుద్ధాలైనవిగా మనం అర్థం చేసుకోకూడదు . అవి వేరు వేరు కల్పాలలో జరిగిన విశేషాలుగా మనం  అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పురాణాలు వివరిస్తున్న వినాయకుని ఆవిర్భావ ఘట్టాలు కొన్నింటిని ఇక్కడ చూద్దాం!

పురాణాలలో మహాగణపతి వైభవం అనేక విధాలుగా వర్ణించాడు వేదవ్యాసుడు. “పినాకి భార్యా తనుజ మృద్భవ” అన్న విధంగా, గౌరీదేవి దేహ వ్యర్థం నుండి గణేశుడు జన్మించాడనే కథ స్కాందపురాణంలోనిది.  ఇది విశేషమైన ప్రసిద్ధిని పొందింది. 

కానీ బ్రహ్మవైవర్త పురాణంలో పుత్రభిక్షకై పరమేశ్వరి ఆ , శ్రీమన్నారాయణుడిని ప్రార్ధించారు . ఆ విధంగా  వైకుంఠవాసుని వరం వల్ల గణపతి ఆవిర్భావం జరిగిందని తెలుస్తోంది. ఈ విధంగా పురాణ కథ ఏదైనా, విఘ్నేశ్వరుని ఆవిర్భావం మాత్రం పరమశివుని సంకల్పానికి అనుగుణంగానే జరిగింది అనేది నిర్వివాదాంశం .

మహాశివుని వైభవాన్ని వివరించడానికై ఆవిర్భవించిన లింగపురాణం గణేశుణ్ణి వేనోళ్ళా కొనియాడింది. “తవావతారో దైత్యానాం వినాశాయ మమాత్మజ దేవానాం – ఉపకారార్థం ద్విజానాం బ్రహ్మవాదినాం” అంటూ సదాశివుడు తన పుత్రుణ్ణి ఆశీర్వదించాడని వివరిస్తోంది లింగపురాణం. దాని అర్థం దుష్టులైన దైత్యుల వినాశనం, శిష్టులైన దేవతలు, సాధకులకు ఉపకారం – ఇవే గణేశుని అవతారం ప్రధాన ఉద్దేశాలని లింగపురాణం నిరూపిస్తోంది.

గజముఖుడైన వినాయకుణ్ణి వేదాలు, పురాణాలతో బాటు సంహితలు, ఆగమశాస్త్రాలు కూడా బహుధా పొగిడాయి. అత్యంత ప్రాచీన సంహితగా గుర్తింపబడిన పాద్మసంహితలో చతుర్ముఖ బ్రహ్మ – శ్రీమన్నారాయణ సంవాద రూపంగా గణపతి జన్మవృత్తాంతం వర్ణితమయింది. మహావిష్ణువు పంచరూపాలలో ఒకటైన ప్రద్యుమ్న రూపం నుండి ప్రభవించిన మహాద్భుత తేజోమూర్తి ఈ గణేశుడని పాద్మసంహిత వర్ణిస్తోంది. శిష్టులకు విజయాన్ని, దుష్టులకు విఘ్నాలను కలిగించే విశిష్ట దేవతగా వినాయకుణ్ణి పాద్మసంహిత వర్ణించింది. 

ఈవిధంగానే ప్రాచీనమైన నారద పాంచరాత్రమనే ఆగమ శాస్త్రం కూడా గణపతిని అత్యంత హృద్యంగా వర్ణించింది. ఇందులో గణపతి ఆదిమూర్తి అని, సర్వశ్రేష్ఠుడని, గజవదనుడని, ముక్తిదాత అని ఉల్లేఖించబడ్డాడు.

వినాయక తత్వాన్ని వివరించే అద్భుత చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమయినది – ’మహాభారత రచన,’.

 “సర్వజీవ ప్రణేతారం వందే విజయదం హరిమ్”

సృష్టిలోని సమస్త జీవులకు విఘ్నాలను తొలగించి, విజయాలను కటాక్షించే పరమాత్మగా శ్రీహరిని పురాణాలు కీర్తిస్తున్నాయి. అటువంటి మహాదైవం వేదవ్యాసునిగా అవతరించి, పంచమవేదమైన మహాభారతాన్ని లిఖించ సంకల్పించాడు. సకల వేదసారమయిన మహాభారతంకు కలియుగంలో విఘ్నమే ఎరుగని శాశ్వత స్థానాన్ని పొందింపజేయాలన్న సంకల్పంతో విఘ్ననివారకుడైన గణపతితో వ్రాయించాడు వేదవ్యాసుడు.

ఒక్క క్షణమైనా విరామాన్ని తీసుకోకుండా వ్యాసుడు ఆశువుగా చెబుతుంటే ఒక్క అక్షరమైనా పొల్లు పోనీకుండా వేగంగా వ్రాసాడు విఘ్నేశుడు. “జయా” అన్న మరో సార్థక నామాన్ని కలిగిన భారతాన్ని వ్రాసిన మూషికవాహనుణ్ణి భాద్రపద శుద్ధ చవితి నాడు కొలిచిన వారికి సర్వజయాలు, సకల శుభాలు కలుగుతాయని ఈవిధంగా సూచించాడు వేదవ్యాసుడు.

ఈ విధంగా పురాణాలు , ఆగమాలూ కీర్తించిన గణపతి మహాదేవుని సంకల్పానుసారం అవతరించినవానిగా , ఆది దేవునిగా, విష్ణువాంశ సంభూతునిగా దర్శనమిస్తారు. ఆ దివ్యస్వరూపుని అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ .. 

శలవు .  

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore