Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 51

18.119.136.235

శ్రీమదాంధ్ర భాగవతం - 51

ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?” అని అడిగాడు. “ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివేమయినా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు” అన్నాడు. 

ఇవన్నీ విని ప్రహ్లాదుడు “

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు 
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని ‘కూ’ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్నమయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?” అని అడిగి వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు’ అని అన్నాడు.

ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి ‘మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చోస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి. అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో “నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉంది. కాబట్టి మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?” అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను’ అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు.

ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.

లీలావతి కుమారుని ప్రశ్నించింది ‘నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు’ అంది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాల అమారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి “నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంతున్నావా? లేక సొంత బుద్ధితో ఏమయినా నర్చుకున్తున్నావా?’ అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

“చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే 
జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!

గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. అపుడు హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్నపద్యం ఒక్కటి నాకు చెప్పు’ అని కుమారుని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!! 

అంటారు వ్యాసమహర్షి. ‘తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నేను చదువుకున్న చదువుల మొత్తం సారాంశము’ అని చెప్పాడు.

ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అపుడు అతను అన్నాడు ‘ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?” అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

తండ్రీ, మీకందరికీ రాని యాలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం. 

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
 దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!

కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు” అని ఇంకొక మాట చెప్పాడు. 

కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!

ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పడి వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కన్జాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు. అది వట్టి తోలుతిత్తి. అందుచేత తండ్రీ చెయ్యవలసినది ఏదయినా వుంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya