Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 39

3.144.233.150

శ్రీమదాంధ్ర భాగవతం - 39

ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు. నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని.  నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
 
కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమన్నది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే  అప్పుడు  వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో అన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి.  ఈకోట శిధిలం అయిపోయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.

ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి' అని నారదుడిని అడిగాడు.  నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పడడము  ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.

పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.

భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!
స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారదమహర్షి గురుత్వం లభించింది. నారదమహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా! నీకు పట్టాభిషేకము చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు.  ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.

ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు.  ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు.  బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా! సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము.  నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి.  ఆయన  – మహానుభావా ! మీరు వచ్చి ఈ మాట చెప్పారు.  నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda