Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 38

13.59.82.167

శ్రీమదాంధ్ర భాగవతం - 38

4. పురంజనోపాఖ్యానం:

భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా ఉన్నది – ఇదంతా తమకు అందదని అంటారు. ఋషులు బోధ చేసేటప్పుడు తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు.

ప్రాచీనబర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకుని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకుని ఒక రకమయిన అజ్ఞానములో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన కథకు ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు. 

పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నీ తిరిగాడు. ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణకొసన ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలలపాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాలే ఉంటాడు.   పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకు తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటాను. నువ్వు మంచి యౌవనములో ఉన్నావు. నా పేరు ‘పురంజని’ నీ పేరు పురంజనుడు.  నువ్వు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉన్నది. ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.

ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోటకోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమునందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణదిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది.  ఏనాటికయినా శ్మశానములో చేరవలసినటువంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దానిమీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు.  రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయస్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము.  ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.

పురంజని ఎదురువచ్చి తనను వివాహం చేసుకోమన్నది. పురంజనుడు ఆమెను నీవు ఎవరని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అన్నది. ఆవిడ బుద్ధి. ఆవిడని అయిదు తలలపాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు ప్రాణములు. ఈవిడతో పాటు పదకొండుమంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకున్నది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి – అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది.

మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున ఉన్న రెండుద్వారములే రెండుకళ్ళు. ఈ రెండుకళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు. ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’, రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’.  ఎంతో  చిత్రమయిన పేర్లు. ఈ రెండుద్వారములలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు. ఒకడు ‘ద్యుమంత్రుడు’, రెండవ వాని పేరు ‘మిత్రుడు’. ‘ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురు  ఉన్నపుడు మాత్రమే చూడగలరు. ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. ఇవి రెండూ రెండు ద్వారములు.

క్రిందను మరో రెండుద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈరెండు ద్వారముల నుండి బయలుదేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు వాయువు. వాయువనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని ద్వారా సౌరభమనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. మూడవది ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ నోరు. ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండు కాయ అన్నం పులిగోర చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలినవి  మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప  అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు.

కుడిపక్కన ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు.  వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవిద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గము. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమచెవి ద్వారంలోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు.

ఆ తర్వాత ఉత్తరమునుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగములో ఒక ద్వారం ఉన్నది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.

పడమట అనగా వెనకభాగమందు ఒక ద్వారమున్నది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టనివాడు. లోపలే కూర్చుని ఉంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దానిపేరు ‘వైశసము’. అలా రెండురకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళనని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పేచీపెట్టి తన శరీరము మీద భోగముల మీద తన ఐశ్వర్యము మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరములో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గము ద్వారా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకములో యాత్ర మొదలుపెడతాడు.

ఇన్ని ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తే ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. ఇంకొక అంధుడిమీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానే  బంధింపబడుతూ ఉంటాడు. ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒకరోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన  పదకొండుమంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవి పది ఇంద్రియములు, ఒక మనస్సు. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి. అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా? అన్నాడు. ఆవిడ అలకగృహంలో ఉన్నది. అనగా మరల సాత్విక బుద్ధియందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధియందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒకరోజున స్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు.

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore