శ్రీమదాంధ్ర భాగవతం -32

44.192.25.113

శ్రీమదాంధ్ర భాగవతం -32

ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో  వెళుతూ వాళ్ళు  ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అన్నది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టి ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు అన్నది. శంకరుడు ‘దేవీ! నీవు చెప్పినది యధార్థమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు.   నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. వాళ్ళు మనలను చాలా దారుణముగా అవమానిస్తారు.  బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు ఎంతగొప్పవాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు వెళ్ళవద్దు’ అని చెప్పాడు. ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అన్నది. శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు అన్నీ తెలుసు.
 
తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహము ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహము ఉంటే ఐశ్వర్యం వస్తుందో  ఆ తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్తబ్రహ్మాండములను కాల్చివేయగల శక్తి. ప్రమథగణములు చూసాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. నీకొక మాట చెపుతున్నాను ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారము లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమపవిత్రుడయిన శంకరుని సాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసనము వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదానవాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నిటిలో నుంచి  అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నియందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పయి  క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథగణములకు ఎక్కడలేని కోపంవచ్చి కత్తులుతీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్రగణములను తరిమి కొట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతముగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్న శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చింది.

శాంతమూర్తి శివుడు రుద్రుడయి ఒక్కసారి లేచి పెద్ద వికటాట్టహాసం చేసాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికి అందరు హడలిపోయారు. వీరభద్రావతారం ఉద్వేగముతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ! నాకు ఏమి ఆనతి?’ అని అడిగాడు. శంకరుడు ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు.

వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకున్నది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడు సభలో శంకరనింద  జరుగుతుంటే కళ్ళు ఎగురవేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగినశిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు.   భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా! నువ్వు శంకరనింద జరుగుతుంటే నోరు పెద్దగ తెరచి నవ్వావు. నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతము కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు. ఎలా త్రుంచాలని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్ఞపశువు శరీరమును తుంచినట్లు తుంచేస్తానని గుండెలమీద కుడికాలు వేసి తొక్కిపట్టి తోటకూరకాడను తిప్పినట్లు కంఠమును తిప్పి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రములో పడేసాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించినవాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి లేకపోతే పాడైపోతాము. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా! పాపకర్మ చేసాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు?’ అని అడిగారు.
 
బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో  ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడండి . ఎన్నితప్పులు చేసినా కాళ్ళమీద పడితే రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వారితో కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా! తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టి, స్థితి, లయ ఈ మూడు నీయందు జరుగుతుంటాయి. తెలియని వారు ఈ రకంగా అపచారబుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు.

మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్షప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగము పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేత్రములు ఇస్తాను. ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. 

దక్షప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ! నీవు నన్ను దండించడమును రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక!   నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. శంకరుడు వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు. తరువాత దక్షప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రంచేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ! నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అంత గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna