శ్రీమదాంధ్ర భాగవతం - 29

100.24.115.215

శ్రీమదాంధ్ర భాగవతం - 29

యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమందలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు. 

అపుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ‘స్వామీ, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనం అయిపోతుంది’ అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు. 

ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. 

ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు. 

ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. 

5. కర్దముడు – కపిలుడు. 

వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము.

స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి. నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. అపుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నుల వెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తాము. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నీలమీద పడ్డాయి. అది ఎంత విచిత్రమయిన సంఘటన అంటే – ఆయన కన్నుల వెంట కారిన భాష్పబిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు. 

పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగాద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భాగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు ‘నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు?’ అని అడిగారు. అంటే ఆయన ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యమ్. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి’ అని అద్భుతమయిన స్తోత్రం చేశాడు. 

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమ ప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు’ అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు. 

కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప తోటి, తన కుమార్తె అయిన దేవహూతి తోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వాయంభువ మనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినది’ అని అడిగాడు. అపుడు కర్దమ ప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకం.

శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువ మనువు కూతురును కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna