Online Puja Services

పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలా ?

3.147.54.6

పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలా ?
- లక్ష్మి రమణ 

పెట్టుకోకపోతే ఏమవుతుంది ? భగవంతుడు మన పూజని ఆమోదించడా? అని ఇప్పటి పిల్లల ప్రశ్న .  నిజమే మనం దీనికి సహేతుకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది . సాధారణంగా మనం పూజించే దేవుళ్లందరూ కూడా తిలకాన్ని ధరించే ఉంటారు .  శివుడు త్రిపుండ్రాలు అడ్డంగా ధరిస్తారు .  మహావిష్ణువు నిలువుగా ఊర్ధ్వపుండ్రము ధరిస్తారు .  అయ్యవార్ల తోపాటు  అమ్మలందరూ రూపాయి కాసంత కుంకుమ నుదుటన దిద్దుకొని కనిపిస్తారు .  

సంప్రదాయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి . రష్యావాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు . సంతాన ధర్మం అనుసరిస్తున్నారు .  మనం పాశ్చ్యాత్త పోకడలకు అలవాటు పడి బొట్టు పెట్టుకోవడం అనే సంప్రదాయాన్ని వదిలేస్తున్నామేమో అనిపిస్తోంది . 

స్నానం దానం తపో హోమో దేవతాపితృకర్మ చ 
తాత్సర్యం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా | 
బ్రాహ్మణా స్తిలకం కృత్వా, కుర్యా త్సంధ్యాన తర్పణమ్ ||

అని ఆర్షవాక్యం . నుదుట బొట్టు పెట్టుకోకుండా చేసే ధార్మిక కార్యక్రమాలన్నీ నిష్ప్రయోజనాలే అని ఈ శ్లోకం చెబుతోంది .  తిలకము అంటే కేవలం కుంకుమనో , గంధాన్నో మాత్రమే గుర్తుతెచ్చుకుంటాం .  నదీ తీరంలో సంధ్యావందనం ఆచరించిన వారు వెంటనే బొట్టుగా కుంకుమని ధరించలేరు కదా ! అటువంటి సమయంలో జలాన్ని కుంకుమగా భావించి జలతిలకం పెట్టుకోమంటుంది శాస్త్రం . కొన్ని సమయాల్లో మృత్తికని తిలకంగా ధరించే ఆచారం కూడా ఉంటుంది . ధర్మశాస్త్రానుసారం, సందర్భానుసారం ఇలా ధరించాల్సిన సందర్భాలలో ఇటువంటి తిలకాన్ని ధరించినా, నిత్యమూ మనం సాధారణంగా పెట్టుకొనే తిలకాన్ని ధరించాలంటుంది శాస్త్రం . 

స్నానం, దానం, తపస్సు , హోమం ఇలా ఏ విధమైన దైవసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొన్నా , విధిగా బొట్టు పెట్టుకోవాలి . తిలకశూన్యమైన  లలాటాన్ని అశుభానికి సూచికగా పరిగణిస్తారు . 

 తిలకం లేదా బొట్టు ఆజ్ఞా చక్ర స్థానంలో పెట్టుకుంటాం . అక్కడ స్టిక్కర్ అంటించుకోవడం ఆ స్థానానికి ప్లాస్టర్ వేసి సీల్ చేసినట్టే !  మహిళలతో  పాటు ఇది పురుషులకి కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి .  శుభం .  

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi