Online Puja Services

బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి ?

18.227.0.192

బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి ?
-లక్ష్మీ రమణ 

చేతికున్న ఐదు వేళ్ళల్లో అలవాటు ప్రకారం ఏ వేలితో నైనా పెట్టుకోవచ్చు . దానికి అభ్యంతరం ఏమిటి చాదస్తం కాకపొతే !! ఇంకా నయ్యం !! ఆ ఊయల్లో ఉన్న చిన్నదానికి ఏ వేలు నోట్లో వేసుకుంటే ఏ ఫలితం ఉంటుందో చెప్పింది కాదు మీ బామ్మ !! ప్రతి దానికీ ఏదో ఒక మెలిక పెట్టి చెప్పడం అలవాటయ్యింది . మీ ధర్మ సందేహాలూ అలాగే ఉన్నాయి , ఆవిడ చెప్పే విషయాలూ అలాగే ఉన్నాయి . బామ్మోవాచ ఘాటు తెలీని మా పిన్నమ్మ , బాబాయిని కాస్త ఘాటుగానే మందలించింది . 

ఇదిగో, అంటే అన్నావు గానీ, మా బామ్మ చెవిలో పడేట్టు గొణిగేవు ! ఆవిడ చేతిలో ఉన్న పన్నుకర్రకి పనిచెప్పగలదు. ఆట్టే వాగక, కాస్త ఆవిడ చెప్పే మాటలు వంటబట్టించుకోమరి !! మా బామ్మంటే  ఏమనుకున్నావ్ !! సైన్సునీ , పురాణాలనీ, ఒకే సారి  ఒకపట్టుపట్టిన మేధావి . అని బామ్మ గారి గురించి కాస్త రెండాకులు ఎక్కువే వెనకేసుకొచ్చి మరీ హితవు చెప్పాడు బాబాయ్ . 

అడిగే వాళ్ళు , వినే  వాళ్ళూ ఉండాలి గానీ, మా బామ్మకి చెప్పడానికి ఎక్కడలేని ఓపికా వచ్చేస్తుంది . గొంతు సవరించుకొంటూ కొడుకు ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు ఉపక్రమించింది . 

అనామికా శాంతి డా స్యాత్ 
మధ్య మాయుష్కరీ భవేత్ | 
అంగుష్ఠ: పుష్టిదః ప్రోక్తః 
తర్జనీ మోక్షదాయినీ || 

అని స్కాందపురాణం చెబుతోంది రా! బొట్టు పెట్టుకోకపోవడమే ప్యాషన్ అని తిరుగుతున్నారు ఈ కాలం పిల్లలు . అది చాలా తప్పురా ! చూడూ , ఈ ఉంగరం వేలుతో తిలకం పెట్టుకుంటే, శాంతి కలుగుతుంది.  మధ్యవేలితో తిలకం దిద్దుకుంటే ఆయుష్షు పెరుగుతుంది .  బొటనవేలితో బొట్టు పెట్టుకుంటే, ఆరోగ్యం సిద్ధిస్తుంది . ఇక, చూపుడు వేలితో బొట్టు పెట్టు కుంటే మోక్షం సిద్ధిస్తుంది . అందుకే, ఇతరులకి చూపుడు వేలితో బొట్టు పెట్టొద్దు .  అని చెబుతారు .  ఇక చిటికెన వేలితో తిలకధారణ చేయకూడదా ! అంటావేమో,  ఆ పరమేశ్వరుడి తిలకాన్ని దిద్దెప్పుడు చిటికెన వేలితోనే దిద్దుతారు . ‘ కనిష్ఠికాభ్యాం గంధం పరికల్పయామి’ అని కదా ఆ స్వామికి గంధాన్ని అలంకరిస్తాము . 

అందువల్ల , ఏ వేలితో తిలకమ్ దిద్దుకోవాలి ? అనే ప్రశ్నేమీ అవసరం లేదు . తిలకమ్ దిద్దుకోవడం మాత్రం ప్రధానం .  అది గుర్తుంచుకొని, నీతో పాటు , నీ పెళ్ళాం , పిల్లలూ కూడా ఆచరించేలా చూడండి . అని సమాధానం చెబుతూనే కోడలికి చురకేసింది మా బామ్మ . ఆఁ ఎవరైనా మూతి తిప్పుతే మాత్రం మా బామ్మకేమంట! మా బామ్మ మాటంటే, నిజంగానే బంగారు మూట !! అని మేమంతా అనుకుంటాంగా !

మీరూ బామ్మ మాట గుర్తుంచుకోండేం !! శుభం !! 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi