Online Puja Services

కొబ్బరికాయ కుళ్ళిపోతే అపచారమా !

18.118.226.105

కొబ్బరికాయ కుళ్ళిపోతే అపచారమా !
-లక్ష్మీరమణ 

కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటాం . పూర్ణమైన ఫలితాన్ని ఆశించి ఆ భగవంతునికి నైవేద్యంగా కొబ్బరికాయని సమర్పిస్తాం . కొబ్బరికాయని దానం చేసినా పూర్ణఫలదానం అని పిలుస్తాం . ఇక హోమాలు చేసినప్పుడు , చివరిలో పూర్ణాహుతిగా కొబ్బరికాయ సహితంగానే  వివిధ ద్రవ్యాలని అగ్ని ముఖంగా ఆయాదేవతలకి సమర్పణ చేస్తాం. ఇదీ కొబ్బరికాయకి సనాతన ధర్మంలో ఉన్న ప్రాధాన్యత . అయితే, కొబ్బరికాయ భగవంతునికి సమర్పించేప్పుడు కొన్నిసార్లు కుళ్లిపోతుంది . అది కొట్టాక గానీ మనకైనా తెలీదు . ఇలా కుళ్ళిపోతే, అశుభమా ? అపచారమా ? అనేది చాలా మందికి సందేహమే !

కొబ్బరికాయని కలశంపైన ఉంచి, భగవంతుని స్వరూపంగా ఆ కలశాన్ని స్థాపన చేసి ఆరాధిస్తాం కదా ! అటువంటి ప్రశస్తమైన స్థానాన్ని పొందిన కొబ్బరికాయని , ప్రసాదంగా భగవంతునికి సమర్పించినప్పుడు అది కుళ్ళిపోతే, మనసు లో ఒక గిలి మొదలవకుండా ఉంటుందా ? అయ్యో భగవంతుని ప్రసాదంకోసం తీసుకొచ్చిన కాయ కుళ్లిపోయిందే అని బాధపడతాం . అసలు ఇలా జరగడం మంచిదా కాదా అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం . 

ఇక్కడ కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర - చర్మం. పీచు - మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు - ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక.

 అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి. ఇందులోని పరమార్థమిదే. త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ.

అయితే, కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా ఇటువంటి నమ్మకాలకి తావీయడాన్ని గమనించవచ్చు .  కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు. నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని భావిస్తారు.

ఇక, దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా ,అపచారమా అనే సందేహం విషయానికి వస్తే,  కొంత మంది కాయ కుళ్లితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. మనమనస్సులో ఉండే చెడు స్వభావం తొలగిపోయిందని భావిస్తే మంచి స్వభావం అలవర్చుకునే అవకాశానికి స్పూర్తి అవుతుంది. కొబ్బరికాయ కుళ్ళిపోతే చేతులు కాళ్లు కడుక్కుని పూజని కొనసాగించాలని, మరో కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించవచ్చని  పండితులు సూచిస్తుంటారు.

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi