Online Puja Services

చెట్లకి ప్రాణముంది

3.141.29.145

చెట్లకి ప్రాణముంది అని మన శాస్త్రవేత్తలకంటే ముందర ఎవరైనా నిరూపించారా ?
సేకరణ 

మహాభారతంలో రాజనీతి ఉంది. మహాభారతంలో భగవంతుని తత్వ నిరూపణ ఉంది. మహాభారతంలో పరమాత్మని చేరుకొనే మార్గం ఉంది. మహాభారతంలో ధర్మం ఉంది . మహాభారతంలో సైన్స్ యొక్క అద్భుత ప్రగతి ఉంది . అందులో ఉన్నటువంటి సైన్స్ ప్రగతి ఇప్పటి సైన్స్ అద్భుతాలకు తీసిపోదంటే అది మనకి అబ్బురంగా అనిపించవచ్చు .   ఇవన్నీ ఉన్నాయి కాబట్టే , అది పంచమవేదం అని పేరుగాంచింది . 
 
మహాభారతంలో విలన్ పాత్రలు కౌరవులు . ఆ కౌరవులు పుట్టింది గాంధారికే అయినా వారి పిండాలని కుండల్లో భద్రపర్చి వాటిని సరైన వేడిలో ఉండేలా సంరక్షించి, పిల్లలుగా మారేలా చేసే ప్రక్రియ ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీలని మరపిస్తుంది . స్పెర్మ్ బ్యాంకుల నుండీ గ్రహించిన శుక్రకణాలతో గర్భందాలుస్తున్న మహిళలని ఇవాళ మనం చూస్తున్నాం . ఆవిధంగానే కుంతీ ఆరుగురు బిడ్డలకి తల్లికావడం అప్పటి సైన్స్ కాదా! 

ఇలాంటి ఎన్నో విశేషాలు మహాభారతంలో ఉన్నాయి . 

ఇక వృక్షాలకు సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తే,  మహా భారతంలోని శాంతి పర్వం 184 వ అధ్యాయంలో భృగు, భరద్వాజ మహర్షుల సంభాషణ ఉంటుంది .  ఇందులో భరద్వాజుడు, భృగు మహర్షిని ఇలా అడుగుతారు. 

“వృక్షములు చూడవు, వినవు, రస గ్రంథాలను అనుభవించవు, స్పర్శ లేదు కదా అయినా కూడా వాటిని పాంచభౌతిక చేతన పదార్థములుగా ఎందుకు పరిగణిస్తారో  చెప్పవలసింది” అని అడుగుతారు .

దానికి భృగు మహర్షి ఇలా సమాధానం ఇస్తారు . “భరద్వాజా ! వృక్షములు దృఢమైనవిగా కనిపించవచ్చు. కానీ వాటిలోనూ శూన్యము అనగా ఆకాశమున్నది. దీని వలననే నిత్యం పుష్ప, ఫలముల ఉత్పత్తి సాధ్యమవుతోంది. వృక్షములలో వేడి ఉంటుంది. కాబట్టే, ఆకులు, బెరళ్ళు, పూలు, కాయలు, పళ్ళు వాడిపోతాయి, రాలిపోతాయి. దీని అర్థమేమిటి మొక్కలకు  స్పర్శ జ్ఞానముందని కదా ! 

ఇక , వాయువు,అగ్ని,విద్యుత్ యొక్క ఫెళ ఫెళ శబ్దాలు చేసినప్పుడు చెట్ల నుండి ఆకులు, పూలు, పళ్ళు రాలి పడుతాయి. అంటే అర్థం ఏమిటి? చెట్లకు వినికిడి జ్ఞానం ఉన్నట్లే కదా!

తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని పైపైకి పాకుంది. చూడకుండానే ఎవరైనా ముందుకెలా వెళ్ళగలుగుతారు. అంటే మొక్కలు చూడగలుగుతాయనే కదా !

సువాసన – దుర్వాసనల వలన ,అలాగే  అనేక రకాల పొగ వాసనల వలన, అగరు వత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములుగా మారుతున్నాయి . పుష్పిస్తున్నాయి .  దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలుస్తోంది కదా !

వృక్షములు తమ వేళ్ళ తో నీరు త్రాగుతాయి. చెట్టుకు ఏదైనా రోగము వస్తే నీళ్ళలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది. దీనివలన వృక్షాలకు రుచికి సంభందించిన జ్ఞానం ఉందని తెలుస్తోంది . 

మనం కమలపు కాండం నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము. అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన తమ  వేళ్ళ ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి.

వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది. అంటే తనకు గాయం అయ్యిందని తెలుసుకుని తిరిగి మాన్పుకున్నట్లే కదా. అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి. కనుక వృక్షములలో ప్రాణమున్నది. అవి అచేతనాలు కావు.

వృక్షములు వేళ్ళ ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు, అగ్ని ఉడికిస్తాయి. ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది. ఇలా భృగు మహర్షి అనేక ఋజువులు చూపిస్తూ వృక్షాలని గురించి , వాటికి ప్రాణమున్న విషయాన్ని నిరూపణ చేస్తారు . కాబట్టి మన శాస్త్రాలని పురాణాలనీ ముందుగా మనం చదివి అర్థం చేసుకొని, పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన తర్వాతే, వాటిని గురించిన వ్యాఖ్య  చేసే ప్రయత్నం చేద్దాం . శుభం . 

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha