Online Puja Services

సంక్రాంతిని స్వచ్ఛంగా ఆస్వాదించేందుకు పోదాం పదండి పల్లెకు!

18.223.32.230

సంక్రాంతిని స్వచ్ఛంగా ఆస్వాదించేందుకు  పోదాం పదండి పల్లెకు!
లక్ష్మీ రమణ 
 
సంక్రాంతి పండుగంటే, ప్రకృతి పండుగ . సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం . రైతులకి గాదెల నిండా ధాన్యం నిండి ఆనందం నిండే సమయం . అందుకే ఈ సంబరాలకు సరైన చిరునామాలు పల్లెలే ! పల్లెలు చల్లగా ఉంటె, దేశమే సుభిక్షంగా ఉంటుంది. ఈ సంబరాల సందడిని సహజంగా (ఆర్టిఫీషియల్ గా కాకుండా ) ఆస్వాదించాలంటే,  పల్లెకి పోవాల్సిందే ! మరింకెందుకాలస్యం … పదండి పోదాం పల్లెకు !

“మేషాదిషు క్రమేణ సంచరత సూర్యస్య పూర్వస్మాదుత్తరరాశౌ సంక్రమణప్రవేశ సంక్రాంతి”  అని కదా ఆర్యోక్తి ! 

సూర్య భగవానుడు ప్రాణికోటి మూలాధారమైన ప్రత్యక్ష దైవం . సూర్యభగవానుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు . ఇదే సంక్రమణం . దీనినే సంక్రాంతి అంటారు . అలాటప్పుడు సంక్రాంతులు నెలకొకసారి వస్తాయి కదా ! సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడం లోని విశేషత ఏమిటి ? మనం పండుగగా జరుపుకొనే సంక్రాంతి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకునేది . ఈ మాక్రో సంక్రాంతి మిగిలిన సంక్రాంతులన్నింటిలోకీ ప్రత్యేకతని కలిగి ఉంది . మార్గశిర మాసం వరకూ సూర్యుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. కాబట్టి అది దక్షిణాయనం . ఆ తర్వాత ఆరునెలలూ ఉత్తరానికి అభిముఖుడై ఉంటాడు . కానట్టి ఆ కాలం ఉత్తరాయణం . 
 

ఉత్తరాయణ కాలం :
ఉత్తరాయణ కాలం పవిత్రమైనది . ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం . ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం లోనే ఈ సంక్రాంతి పండుగ వస్తుంది . 
సంక్రాంతి పండుగ ఏవారంనాడు వాస్తుదో దాన్ని అనుసరించి కూడా ఈ పండుగని వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు . మకరసంక్రాంతి సంబరాలు పండుగకి నెలరోజులు ముందు నుండే అంటే, ధనుర్మాసారంభం నుండే ప్రారంభం అవుతాయి .  

సంక్రాంతి సందడి  :
“ అంబపలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు” అంటూ ఇంటి ముందర సందడి చేసే బుడబుక్కలవాళ్ళ సవ్వడితో ఈ సంక్రాంతి మొదలవుతుంది .

ఆ వెంటనే , మూపురాన్ని రంగురంగుల బట్టలతో అలంకరించుకొని, కొమ్ములకు రంగు దారాలు , పూసలు, గవ్వలూ  చుట్టుకొని , నడుముల నుండీ వేళ్ళాడే మువ్వల పట్టీలు, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని వాయిద్యాలకి అనుగుణంగా నాట్యం చేస్తూ, అపర నందీశ్వరుని లాగా వచ్చేస్తాయి గంగిరెద్దులు. ‘ అయ్యగారికి దండంపెట్టు , అమ్మవారికి కాళ్ళకి మొక్కు ‘ అని గంగిరెద్దుల దొర చెబుతుంటే, వినాయక చవితికి చదువుకునే గజాసురుడి వృత్తాంతం కళ్ళకి కట్టక మానదు .

 ఇక తలమీద అక్షయపాత్ర పెట్టుకొని, నుదుటన తిరుచూర్ణం  ధరించి , తంబూరా మీటుకుంటే వచ్చే హరిదాసు ‘ హరిలోరంగ హరి అంటూ వచ్చి, కృష్ణార్పణం అనగానే , ఆ దేవర్షి నారదుడే కిందికి దిగివచ్చాడేమో అని బ్రమించడంలో తప్పులేదనిపిస్తుంది. కేశవుని కి నేనుమాత్రం తీసిపోతానా అన్నట్టు శివస్వరూపంలో ప్రత్యక్షమవుతారు  జంగమ దేవరలు. ఒక్క శంఖానాదంతో ప్రరిశరప్రాంతాలలోని దుష్టశక్తులన్నింటినీ తరిమికొడతారు . 

ఇక పగటి వేషగాళ్ళు , పులి వేషగాళ్ళు , కాశికావిళ్ళు , దొమ్మరిఆటగాళ్ళు , కోయలు, చెంచుల వేషాలు , కోతులనాడించేవారితో   పల్లెలన్నీ సందడిగా మారిపోతాయి . కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు వంటివి నిషేదాజ్ఞలు ఉన్నప్పటికీ , సంప్రదాయమైన సరదాకోసం అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి . 

సంతోషముగా కేరింతలు కొడుతూ పిల్లలు రివ్వురివ్వున ఎగరేసే గాలిపటాలు ఆ గగనతలంలోకి దూసుకెళ్లి, సూర్యుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి . ఈ సందడికి, సంబరానికి, సంతోషానికి స్వాగతం పలుకుతూ పల్లెలన్నీ కొత్త పెళ్లి కూతుళ్ళలాగా సింగారం చేసుకుంటాయి. 

పల్లెల్లో సంప్రదాయం: 
గ్రామీణ ఆడపడుచులంతా చక్కగా ఆవుపేడని తీసుకొచ్చి, ముంగిట్లో ఆ పేడ కాలిపిన నీళ్లు జల్లి రంగవల్లులు తీరుస్తారు . పసుపుకుంకుమలు పెట్టుకొని కొప్పున బంతులు , చేమంతులు , గుమ్మడిపూలు అలంకరించుకొని గొబ్బెమ్మలు ఈముగ్గుల్లో పెద్దముత్తయిదువుల్లా ఒదిగిపోతాయి . ఈ గొబ్బిళ్ళ చుట్టూ ఆడపిల్లలు చప్పట్టు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ‘ గొబ్బియల్లో గొబ్బియల్లో…  చందమామకు గొబ్బియల్లో అని ఇంకా ‘ చందమామకు పిల్లలెందరు .. నీలగిరి కన్యాలందరు ‘ అని చక్కని జానపదాలు పాడుతుంటారు .
 
ఇలా నెలనాళ్ళ పండుగ రోజుల క్రాంతి ఒకఎత్తయితే, ఇక సంక్రాంతి పండుగ కాంతి మరో ఎత్తు. సంక్రాంతి ముందు రోజుని భోగి అంటారు . భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేసి, రంగనాథుణ్ణి నాధునిగా పొందింది ఈరోజునేననేది విశ్వాసం . ఆ విధంగా సకల భోగాలనూ ప్రసాదించేది కాబట్టి అది భోగి అయ్యింది . 

భోగి :
 భోగి తెల్లవారు ఝామున భోగిమంటలు వెయ్యడం ఆచారం . ఆనాటి  పిల్లలకి దృష్టిదోషాలు తొలగిపోవడానికి రేగిపళ్ళు తలపైన పోస్తారు . వీటినే భోగిపళ్ళు పోయడమని వ్యవహరిస్తుంటారు . ఇక ఆమరుసటి రోజు సంక్రాంతి . 

సంక్రాంతి :
సంక్రాంతి రోజున ప్రత్యేకంగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తారు .  ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని తర్పణాలు విడుస్తారు . సంక్రాంతి రోజునే బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయం . ముత్తయిదువులందరినీ పేరంటానికి పిలిచి , తాంబూలం మివ్వడం చాలా అద్భుతమైన వేడుకగా ఉంటుంది .

కనుమ , ముక్కనుమ :
 ఇక, ఆ తరువాతి రోజు కనుమ పండుగ . ఈ పండుగ ప్రత్యేకత వృత్తిలవారీగా వారి పనిముట్లని ,  అలాగే,రైతులు పశువులనీ పూజించుకుంటారు . మరుసటి రోజు ముక్కనుమ మూడురోజుల బొమ్మలకొలువు ఈ రోజుతో ముగుస్తుందన్నమాట . 

ఇలా ,కోలాహలంగా   సందడిగా,చక్కని సంప్రదాయాలతో విలసిల్లే సంక్రాంతి కాంతి కాంక్రీటు అరణ్యాలలో (సిటీలలో ) కన్నా గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ గుమ్మం  చూసినా, పసుపు కుంకుమతో , మామిడి తోరణాలతో శోభిల్లుతూ పండు ముత్తయిదువలాగా, దైవకాలతో ఉట్టిపడుతూ ఊరు ఊరంతా సంబరంగా , కళాత్మకంగా ఉండడమే సంక్రాంతి ప్రత్యేకత. అందుకే కదా ! సిటీలన్నీ కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే, దాదాపుగా ఖాళీ అయిపోతాయి . పల్లెలన్నీ , తిరిగి తమ గూటికి చేరిన చిలుకలతో నిండుగాకళకళలాడతాయి . 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda