Online Puja Services

చందమామ రావే..

3.144.86.138

చందమామ రావే..
                 
శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు ఉరఫ్ సాంబయ్య గారు దేవుడి గదిలో శివ పూజ చేసుకుంటున్నారు. 

 ఇంతలో ఎవరో హాల్లోంచి ఏదో రాగం తీస్తునట్లుగా సన్నగా ఆయనకు వినిపించింది. అది చాలా మాధుర్యంగా ఉంది. కాసేపటికి ఆ రాగం ఆగిపోయింది. సాంబయ్య గారు శివపూజ కొనసాగిస్తున్నారు. కాసేపటికి మళ్ళీ ఆ రాగం ఆరంభమై కొద్ది సెకన్ల తరువాత ఆగిపోయింది. సాంబయ్య గారు పూజ ముగించుకొని లేచివచ్చి హాల్లో చూచారు. అక్కడ ఎవరు లేరు. బయటకు వెళ్లి చూచారు. అక్కడ కూడా ఎవరు లేరు. ఆయన లోపలికి వస్తుంటే మళ్ళీ రాగం ఆరంభమైంది. ఆ రాగం తమ పడక గదిలోంచి వస్తున్నది. ఆయన గబ గబ గదిలోకి వెళ్లి చూచారు. 

అక్కడ మంచం మీద పడుకుని ఉంది ఆయన భార్య శకుంతలమ్మ గారు. ఆమె ప్రసవించి అప్పటికి కొద్ది రోజులే అయింది. పొత్తిళ్ళలో పసివాడు. 
ఆ రాగం ఆ పసివాడి నుంచి వస్తున్నది. కానీ అది రాగం కాదు. పసి వాడు పాల కోసం ఏడుస్తున్న ఏడుపు. అది రాగంలా ఉంది. 
సాంబయ్య గారు చాల సేపు అలా చూస్తూనే ఉండిపోయారు.  
                      ***
ఎలిమెంటరీ స్కూలు. 1వ తరగతి.
ఒక రోజు పిల్లలంతా వెళ్ళి మాస్టారుకి ఫిర్యాదు  ఇచ్చారు. “సార్! బాలు రోజు క్లాసులో పాటలు పాడుతున్నాడు. అసలు మాట్లాడటం లేదు సార్.”
సార్ బాలును దగ్గరికి పిలిచాడు.
 “ఏరా,ఎవరబ్బాయి రా నువ్వు?”
“ మా నాన్నగారి పేరు సాంబయ్య గారు సార్.” బాలు రిప్లై.
“ఏం చేస్తుంటాడు రా ఆయన?”
“హరికథలు చెబుతుంటారు సార్!”
“అందుకని నువ్వు కూడా హరికథలు చెప్తున్నావా?”
“లేదు సార్! నేను క్లాసులో ఎప్పుడు పాటలు పాడలేదు. నేను వీళ్ళతో మామూలుగానే మాట్లాడుతున్నాను. అంతే సార్! సత్యప్రమాణకంగా “ నెత్తిన చెయ్యి పెట్టుకొని భయపడుతూ చెప్పాడు బాలు.
మాస్టారు గారికి అర్థమైంది. బాలు నిజమే చెబుతున్నాడు. అట్లా అని పిల్లల ఫిర్యాదు  అబద్ధం కాదు. అది కూడా నిజమే! బాలు మాట్లాడటమే చేస్తున్నాడు. కానీ అవి పాటలలాగా వినిపిస్తున్నాయి అంతే! 
మాస్టారుగారు కాసేపటికి బాలు నెత్తి మీద చెయ్యి పెట్టి “అఖండ యశోధన ప్రాప్తిరస్తు “ అంటూ దీవించాడు. 
                     ***
బాలు పెరుగుతున్నాడు. ఏవో సినిమా పాటలు పాడుతున్నాడు. కూని రాగాలు తీస్తున్నాడు. సాంబయ్య గారు కుమారుడికి మొదట సంగీతం నేర్పాలనుకున్నాడు. కానీ సంగీతం నేర్చుకొని హరికథలు నమ్ముకున్న తన జీవితం ఏమైంది? సినిమాల దెబ్బకు హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు వంటి అనేక కళలు వెలసిపోయాయి కదా! తాను అనుభవిస్తున్న ఆర్ధిక ఇబ్బందులు ఇక తన కొడుకు కూడా అనుభవించాలా? “ఉహూ! వాడికి సంగీతం నేర్పను. ఇంగ్లీషు చదువును చదివిస్తాను. పెద్ద ఇంజినీరును చేస్తాను” గట్టిగా నిర్ణయించుకున్నారు సాంబయ్య గారు. 
బహుశా ఆయన జీవితాన్ని చూసే కాబోలు, యాయవరం చేస్తూ ఒంటి చేత్తో త్యాగరాజ ఉత్సవాలు నిర్వహిస్తున్న “శ్రుతిలయలు” సినిమాలోని సత్యనారాయణ పాత్ర, శంకరాభరణంలోని శంకర శాస్త్రి  పాత్రలు ఆ తరువాత రూపుదిద్దుకున్నాయేమో!  
                     **** 
P U C  తర్వాత బాలును మద్రాస్ లో చేర్పించారు సాంబయ్య గారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయమే ఆ తర్వాత కరెక్ట్ అయింది, ఎందుకంటే ఈ నిర్ణయమే సినీ ప్రపంచానికి ఒక గాన గంధర్వుడిని అందించింది. 
                    ***
బాలు మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణిని కలిసాడు. ఆయనకు బాలు గొంతులో ఒక మెరుపు కనిపించింది. భవిష్యత్ సినిమా "ఆశ" కనిపించింది. ఆయన బాలుతో  అన్నాడు "తెలుగు సినిమా పరిశ్రమకు నిన్ను నేనే పరిచయం చేస్తున్నాను,త్వరలో నీ చేత మొదటి పాట పాడిస్తున్నాను.”
                      **** 
సినిమా-మర్యాద రామన్న
మ్యూజిక్ రికార్డింగ్ థియేటర్ 
పాట- "అహో!ఏమిటీ వింత మోహం"
నలుగురు గాయకులు, ముగ్గురు అప్పటికే లబ్ద ప్రతిష్టులు.ఒక కొత్త గాయకుడు . అతడు బాలు. 
ఆ ముగ్గురు బాలును అనుమానంగా చూసారు. "ఎవరీ పిల్లవాడు? ఇతను పాటలు పాడగలడా? అందులో మాతో సరిసమానంగా." 
వారు అనుమానంగా కోదండపాణివైపు చూసారు. అయన చిరునవ్వు నవ్వాడు కానీ ఏమి మాట్లాడలేదు. 

పాట రిహార్సల్స్ ప్రారంభమయినాయి. 

పాటలో బాలు వంతు వచ్చి పాడాడు.

ఆ ముగ్గురు ఒక్కసారి నిర్ఘాంతపోయారు. ఒక కొత్త గొంతు, అందులో తేనే,కలకండ, చేరుకురసం, మామిడిపండు రసంలాంటివన్నీ కలబోసి ఉన్నాయి.ఇటువంటి గొంతు వారు అప్పటివరకు విని ఉండలేదు.అంతలో వాళ్ళకే అనుమానం వచ్చింది" ఈ పిల్లవాడు మనతో తూగటం కాదు, మనమే ఈ పిల్లవాడితో తూగగలమా?"
పాట సందర్భం నలుగురు శిల్పులు, ఒక కన్య పాలరాతి శిల్పాన్ని చెక్కటం.కానీ బాలు ఈ పాటలో పాట కన్య పాలరాతి శిల్పాన్ని చెక్కి దానిని విశ్వసుందరిగా నిలబెట్టాడు.
ఈ పాట ఆంధ్ర దేశం లో దూసుకుపోయింది.
                    *****
 బాలు పాట ఆంధ్ర దేశాన్ని ఉర్రుతలూగిస్తున్నది .
“రావమ్మా మహాలక్ష్మి రావమ్మా,ఏ దివిలో విరిసిన పారిజాతమో,సిరిమల్లె నీవే, మేడంటే మేడా కాదు,ప్రతి రాత్రి వసంత రాత్రి ",లాంటి పాటలు అతని "సిగ్నేచర్" పాటలు అయ్యాయి. ప్రజల గుండెల్లో పచ్చబొట్లు వేసుకుంటూ వెళ్ళాయి.

ఇంతలో ఊహించని సంఘటన.
1974 లో సినీ పరిశ్రమకి టాటా చెప్పి ఘంటసాల గంధర్వ లోకానికి గాన కచేరీకి వెళ్ళాడు. 
సినీ పరిశ్రమలో ఏర్పడ్డ "పెద్ద శూన్యత ".

ఈ లోటు ఎవరు పూరించగలరు?
పరిశ్రమకు సమాధానం దొరికింది. బాలు తన గొంతుతో సమాధానం ఇచ్చాడు. మిమిక్రీ చేసాడు. అగ్ర నటులతో పాటు,ఇతర నటులకు కూడా, గొంతులు మార్చి పాట పాడ సాగాడు.బాలు "దశకంఠాలతో" పాటలు పాడటం- ఒక అద్భుతం.ఒక సంభవమైన అసంభవం. ఒక ప్రపంచపు వింత. 

సినిమా పరిశ్రమ లోటు తీరింది. శూన్యత పూరించబడింది.

తర్వాత బాలు జైత్రయాత్ర ప్రారంభమయింది. భారతదేశంలోని భాషలన్నిటినీ జయించుకుంటూపోయాడు. సినీ గాన సామ్రాజ్యానికి ఒక అలెగ్జాండర్ ది గ్రేట్, ఒక ఎంపరర్ అశోక అయ్యాడు.
                    *****
"పథేర్ పాంచాలి, చ్చెమ్మీన్, సోమన దుడి, ధిక్కట్ర పార్వతి" - ఇట్లా ప్రతి సంవత్సరం అన్య భాషా చిత్రలేనా, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా నిలబడటం. తెలుగు చిత్రాలకు ఆ దమ్ము, సత్తా లేవా?
"ఎందుకు లేదు ?" అంటూ ఒక తెలుగు వస్తాదుకు తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయిలో 'దంగల్' లో నిలబెట్టాడు కాశీనాథుని విశ్వనాధ్. 

ఆ వస్తాదే 'శంకరాభరణం '.శంకరాభరణం రొమ్ము విరిచి బరిలో నిలబడింది.మీసం మెలేసింది, తొడకొట్టి సవాలు చేసింది,ఫలితం-ఆ సంవత్సరం ప్రత్యుర్థులందరిని మట్టి కరిపించింది.ఆ సంవత్సరం "వినోదము,ఉత్తమ కళాత్మక విలువలు" గల చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. 
ఈ సినిమాను చూసి అఖండ భారతం నోరు తెరిచింది. చాల కాలం అది మూతపడలేదు.

ఈ సినిమాకు ప్రధాన సూత్రధారులు నలుగురు. విశ్వనాధ్,వేటూరి,మహదేవన్,బాలు. అయితే ఒక్క విషయం.

శంకరాభరణం  మైనస్ బాలు .

ఫలితం ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి.

                       ****
  బాలుకి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా -సత్యభామ తన సంపదతో   శ్రీ కృష్ణుణ్ణి తూచలేనట్లు, అవన్నీ బాలు గానాన్ని తూచగలవా?                                                                               ****
బాలు జీవితం లో సినిమా పాట అతని 20 వ ఏట ప్రారంభమైంది.ఈ పాటల ప్రయాణం 54 ఏళ్ళు కొనసాగింది.అన్ని భారతీయ భాషల్లో 40 వేల పాటలు ఆ ప్రయాణంలో మైలు రాళ్ళు.
ఒకరకంగా చెప్పాలంటే ఆయన తన జీవితం లో సినిమా పాటలు పాడటం కాదు, ఆయన జీవితమే సుదీర్ఘంగా 54 ఏళ్ళ పాటు సాగిన ఒక “సినిమా పాట”.అంతే!
                         ***
"సెప్టెంబర్ 25 బాలు మొదటి వర్ధంతి" దిగులుగా అన్నది ఉమ.ఉమ నా భార్య. కిందటి సెప్టెంబర్ 25 న మైండ్ పోగొట్టుకొని , 2  రోజులు అన్నం తినని బాలు భక్తురాలు.

“వర్ధంతి ఏమిటి నాన్సెన్స్ , చనిపోయిన వారికి వర్ధంతి.బాలుకు వర్ధంతి ఎందుకు వస్తుంది?" 
తెల్లబోతూ నా వైపు చూసింది ఉమ. ఆమెకు నా మాటలు అర్ధం కాలేదు.
నేను మళ్ళీ అన్నాను,"మన శైవ సమాజం లో రోజు ధూర్జటి మహాకవి వచ్చి తన "కాళహస్తీశ్వర శతకం" లో ఒక పద్యం చెప్పి వెళ్తున్నాడు. ధూర్జటి చనిపోయాడా? ఆధ్యాత్మిక T  V ఛానెల్స్ లో నన్నయ తిక్కన, ఎర్రన తమ మహా భారతపురాణాన్ని వినిపిస్తున్నారు, వారు చనిపోయినారా? పిచ్చిదానా, పుట్టిన మనుషులు చాల మంది గిట్టవచ్చు.కానీ -కొంతమంది పుడతారు కానీ చనిపోవడం మాత్రం ఉండదు. "వారు నిరంతరం ప్రజల నాలుకలయందు జీవిస్తూనే ఉంటారు", అట్లాంటి వారిలో "బాలూ" కూడా ఒకరు.అందువల్ల బాలుకు అన్ని జయంతులే ,వర్ధంతులు ఉండవు" . 

మరి "కనిపించడు కదా?" దిగులుగా అన్నది ఉమ.

ఎందుకు కనిపించడు! బాలు భూలోకంలోని దేశాలన్నిటిలో కచేరీలు చేసాడు కదా! ప్రస్తుతం ఊర్ధ్వ లోకాలకి కచేరీలకు వెళ్ళాడు. అందువల్ల  బాలు వెళ్ళింది ఈ సారి దీర్ఘకాలం సాగే టూరు.అయినా నీకు బాలుని చూడాలని ఉందా?అయితే అట్లా అనిపించినపుడల్లా మేడ మీదకు వెళ్ళి ఉత్తర దిక్కున చూడు. అక్కడ ధ్రువ నక్షత్రం పక్కన ఇంకొక నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది ,ఆ నక్షత్రం అక్కడ కచేరీలు చేస్తున్న బాలునే .జాగ్రత్తగా వింటే ఆ పాటలు కూడా వినిపిస్తాయి విను. 

అంతేనా ఇక నుంచి తల్లులు కూడా తమ చంటి పిల్లలకు గోరు ముద్దలు తినిపించేటప్పుడు, మేడ మీదకు వెళ్ళి , "చందమామ రావే! జాబిల్లి రావే !నెమలిక్కి రావే , బాలు పాట తేవే " అని పాడుతూ బువ్వ తినిపిస్తుంటారు. అట్లా ఈ యుగాంతం వరకు ఈ పాట పాడుతూ ఉంటారు.  
పాడుతూనే ఉంటారు. "సరేనా " అన్నాను నేను. 

ఉమ కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచింది. నా వైపు చూసి నెమ్మదిగా మేడ మెట్ల వైపు నడుచుకుంటూ వెళ్ళింది.

బహుశా బాలుని చూడటానికి- ఆయన పాట వింటానికేమో .

 —శివకుమార్ కొంపల్లి
  Ph:8330990262

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya