సేవ - ఫలితం

3.235.11.178
శ్రీవారు తిరువిడైమరదూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పూజదళములు, పూలు పంపడానికి పక్కనే ఉన్న కళ్యాణపురం మీరాశీదారు ఒక వృద్ధబ్రాహ్మణుని ఏర్పాటు చేశారు. అతడు ఎంతో శ్రద్ధతో ఈ పూలు దళాలు సంగ్రహించుకొని మడితో తనకు వచ్చిన నామాలు, మంత్రాలు వల్లెవేస్తూ కావేరీ నది దాటి రెండు మూడు మైళ్ళు నడిచి శ్రీవారి బసకు చేరి పూజకట్టులో సమర్పించి, స్వామివారు ఆ సమాయంలో ఒకవేళ బయట దర్శనం ఇస్తుంటే సాష్టాంగ నమస్కారం చేసి కళ్యాణపురం తిరిగివచ్చి తన అనుష్టానం కానిచ్చుకొనేవాడు.

యధాప్రకారం ఒకరోజు పూలు ఇచ్చి స్వామివారు లోపల ఎవరితోనో మాట్లాడుతూండటం గమనించి బయటనుండే సాష్టాంగంగా ఇంటి త్రోవ పట్టాడు. రెండు నిముషాల తరువాత స్వామివారీతని గురించి వాకబు చేశారట. వచ్చి వెళ్ళిపోయాడని తెలుసుకొని వెంటనే పిలుచుకురమ్మని సైకిలుమీద మనిషిని పంపారు. తనవల్ల ఏమి అపచారం జరిగిందో అంటూ భయపడిపోయాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. స్వామివారు పళ్ళెంనిండా విభూది, కుంకుమ, అక్షంతలతో కూడిన ప్రసాదం నింపి ఉంచారట. నీవీ చాతుర్మాస్యాలలో చేసిన సేవకు పరమేశ్వరుడు నీకు సంపూర్ణ ఫలితాన్నిస్తాడని ఆశీర్వదిస్తూ ప్రసాదం అందించారు. నోటమాట రాలేదు బ్రాహ్మణునికి. రేపటి నుండి తనను రావద్దంటున్నారా? అయోమయంతో సాష్టాంగంగా నమస్కరించాడు.

స్వామి మోములో ఎక్కడా కోపపు ఛాయలు లేవు సరికదా ఎంతో అనుగ్రహ దృష్టితో చూస్తున్నారు. ఆ అనుగ్రహంతో గుండె అంతా నిండిపోగా, ఇంటికెళ్ళి స్నానం చేసి దర్భాసనం మీద కూర్చుని మధ్యాహ్నికం చేస్తూ గాయత్రిలో కలిసిపోయాడు వృద్ధబ్రాహ్మణుడు. రాముని సేవకై వేచి దర్శనం కాగానే ఆయనతో కలిసిపోయిన శబరి గుర్తుకు రావడంలేదూ!

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi