మానవుడు ఓడిపోయాడు.

100.26.179.251
ఔను. మానవుడే మళ్ళీ ఓడిపోయాడు.  దేవతలు గెలిచారు. కుట్ర చేసి బాలుని ఎత్తుకుపోయారు. నువ్వేం చేయగలవు అంటూ మనిషిని హేళనగా చూస్తూ ఎత్తుకుపోయారు.

హన్నా! స్వర్గం లో మాత్రమే లభించవలసిన “అమరగానం” భూలోకంలో లభించటమా! ఇక స్వర్గం గొప్పతనమేమిటి? అనుకున్నారు. ఈ కిడ్నాప్ కు వాళ్ళు ఎన్నాళ్ళ నుండి ‘స్కెచ్’ వేస్తున్నారో? 

ఇక వాళ్ళు ఘంటసాల, బాలులతో జుగల్బందీ చేయించుకోవచ్చు. దేవతలకు ‘పాడాలని ఉంది ‘ పోటీలు పెట్టుకోవచ్చు. 
 
కడుపులో మెలితిప్పుతున్న ఈ బాధను ఎలా వ్యక్తం చేయను? చెబుదామంటే భాష కూడా అయిపోయిందే.లక్షలాది మంది ఆయన అభిమానులు తెలుగు భాషలోని శక్తివంతమైన పదాలు,ఉపమానాలు ఉపయోగించి భాషని ఖాళీ చేశారే! మళ్ళీ నన్నయగారు వచ్చి భాషని పెంచితేగాని నా బాధని వర్ణించలేనుకదా !
 
అయినా,వ్యర్ధ ప్రయత్నం చేస్తూ తెలుగులో మిగిలిపోయిన పదాలనూ, అందరూ వదిలేసినవాటిని  ఏరుకొని మీ ముందు పరుస్తున్నాను. ఈ నా బాధను మీతో పంచుకుంటే కొంతైనా తగ్గుతుందేమోనని ఆశ.
 
బాలు గొప్ప గాయకుడు. ఇది మాములు మాట.ఆయన పాటకు ఈ స్థాయి సరిపోదు. సినిమా పాట ఆయన గొంతులోని అమృతభాండంలో తడిసి మురిసింది, మెరిసింది, ఆనందతాండవం చేసింది. తరించింది. 
 
బాలు సినిమా పాటకు పాఠాలు నేర్పిన గురువు. దానికి నడకలు, నృత్యాలు నేర్పిన నృత్యాచార్యుడు. దాని చేత కసరత్తులు చేయించిన జిమ్ ట్రైనర్.  మ్యాజిక్కులు చేయించిన మెజీషియన్. దానికి దిశా నిర్దేశం చేసిన మార్గదర్శి. 
 
బాలు పాట కన్యను తేనెల జలపాతంలో జలకాలాడించి,మంచి గంధాన్ని అద్ది, నక్షత్రాల చీర కట్టి, తన నెమలి వాహనం మీద కుర్చోబెట్టుకొని ప్రపంచంలోని  శ్రోతల హృదయాకాశాలలో విహరింపచేసినవాడు.
 
“రావే కన్య సుమబాల! జవరాల! ప్రియురాలా !” అని పాడుకుంటూ , ఆ కన్య పాలరాతి శిల్పాన్ని  చెక్కి ,నగిషీలు దిద్ది, విశ్వసుందరిలా నిలబెట్టినవాడు.
 
ఒకవేళ రామదాసు ఆయన పాడిన తన కీర్తనలు వింటే -“పాలుమీగడలకన్నా, పంచదార చిలకలకన్నా రామ నామమే కాదు,బాలు గానం కూడా ఎంతో రుచిగా ఉందని” మార్చి రాస్తాడేమో!
అన్నమయ్య బాలు పాడిన తన పదాలు వింటే విష్ణుమూర్తి ఖడ్గం నందకము  మళ్ళీ తనలాగా ఇంకొకసారి భూమి మీద పుట్టిందా అని ఆశ్చర్యపోతాడు.  ఇలా ఎన్నని వర్ణించగలము? 
 
బాలు పాటను దశ కంఠాలతో పాడటం ఒక అద్భుతం- ఒక సంభవమైన అసంభవం- ఒక ప్రపంచపు వింత.
 
పాటకు బాణీతో పాటు సాహిత్యం కూడా ప్రాణం. ఈ సాహిత్యపు విలువల కోసం బాలు పాటుపడ్డాడు. తెలుగు భాషను “ఉద్ధరించాలి.. ఉద్ధరించాలి” అంటూ చాల మంది చేసే శుష్కనినాదాల కన్నా దానిని ఆచరించి చూపాడు.ఔత్సాహిక గాయకులకు పదాల విలువలు, ఉచ్ఛరణా విధానము వివరిస్తూ, వారు చేసే దోషాలు ఎత్తి చూపి,మళ్ళీ వాళ్ళ చేత తెలుగు పదాలు దిద్దించే ప్రాధమిక పాఠశాల గురువు అయ్యాడు.
 
బాలు గాత్రం- వేటూరి గీతం- మహదేవన్ స్వరం - విశ్వనాధుని మార్గదర్శనం పాటకు పట్టాభిషేకం చేశాయి.పాటను మానస గంగోత్రిలో స్నానాలు చేయించి కైలాస శిఖరాన అధిష్టింపచేశాయి. అందుకే ఎవరు ఏకీభవించిన ఏకీభవించకపోయిన  కర్ణాటక సంగీతానికి మూల పురుషులు శ్యామ శాస్త్రి, త్యాగ రాజు, ముత్తుస్వామి దీక్షితులు అయితే సినిమా పాటకు ఘంటసాల, K .J. ఏసుదాసు, S P బాలు ముఖ్య పురుషులు. భవిష్యత్ సినిమా పాటకు వీరే మార్గదర్శకులు.
 
ప్రస్తుతం నా మనసులోని ఇంటర్నెట్ లో తిలకిస్తుంటే స్వర్గంలోని కల్పవృక్షం కింద చలువ రాతి శిల మీద  ఘంటసాల కూర్చొని ఉంటే, “నీలి మేఘాలు కమ్ముకొని గాలి కెరటాలు వీస్తూ ఉంటే”, “సరసస్వరసుర ఝరీ గమనమౌ సామ వేద గానమిది” అంటూ బాలు ఆయన పక్కన కూర్చొని తన పాట వినిపిస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా మీ ఇంటర్నెట్ లో దానిని వీక్షించండి.
 
బాలు తన గాత్రంతో  ఈ దేశంలోని కోట్లాది ప్రజలనేగాక, దేవుళ్ళను కూడా అర్థశతాబ్దంపాటు సమ్మోహనపరిచాడు.మరి అతనికి “భారత రత్న” ఇవ్వద్దూ? ఇవ్వకపోతే ఎం? ఎం జరుగుతుంది? అంటారా ? 
ఎం జరగదు కానీ “భారత దేశం లో మానవుని నాగరికతా పరిణామక్రమం ఇంకా పూర్తి కాలేదని”ఇతర దేశస్తులు అనుకోవచ్చు అంతే! 
 
ఇక బాలు పాటను వర్ణించటానికి నేను ఏరుకొచ్చిన పదాలు అయిపోయాయి.అందుకే ముగిస్తున్నాను. 
బాలుకు సిక్స్త్ సెన్స్ ఉందేమో, ముందే తన విగ్రహాన్ని తయారుచేయించుకున్నాడు, తన నిష్క్రమణా గీతాన్నీ పాడుకున్నాడు.
 
లోకానికి సెలవు,
గానానికి సెలవు !అంటూ వెళ్ళిపోయాడు.
 
శివకుమార్ కొంపల్లి,హైదరాబాద్.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya