Online Puja Services

ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం

3.139.238.76

నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ... వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే... నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. 

విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు' అనుకున్నాడు. ఆవిషయాన్నే సాక్షాత్తూ విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. 

'ఓ దేవదేవా! ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా
కొలుచుకునేది ఎవరు' అని అడిగాడు. 
'ఓస్! అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. 
అల్లదిగో ఆ పల్లెటూరిలో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా! అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. 
నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే!' అన్నాడు విష్ణుమూర్తి.

అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు?' అనుకుంటూ ఓసారి తన దివ్యదృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు.

ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానాచాకిరీ చేస్తే కానీ అతనికి బొటాబొటీకా తిండి దక్కేదికాదు.

ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్రపోయే దాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీదా మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయణుడిని తల్చుకునేవాడు అంతే! 

అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గుగా తోచింది.

ఇంతలో విష్ణుమూర్తి...అన్నట్లు నాకో చిన్న సాయం చేసిపెట్టవా నారదా! ఈ పాల కుండ ఉంది చూశావూ దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్లి ఇచ్చిరావా అయితే మార్గమధ్యంలో పాలు ఏమాత్రం తొణకకూడదు సుమా! ఒక్క చుక్క కిందకి ఒలికినా అపచారం అవుతుంది.' అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు. 

అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు.

"చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు. సంతోషం నారదా! కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండని తీసుకుని వెళ్లేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు" అని అడిగాడు విష్ణుమూర్తి.

ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన
దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది. కాబట్టి నారాయణుడిని తల్చుకునే అవకాశమే లేదు.

అప్పుడర్థం అయ్యింది నారదుడికి... విష్ణుమూర్తి ప్రశ్నలోని
ఆంతర్యం! తను ఈ ఒక్క రోజు ఏదో పనిలో పడి అసలు
నారాయణుడిని తల్చుకోవడమే మర్చిపోయాడు.

అలాంటిది, ఆ రైతు ఎంతో కష్టాన్నీ, శ్రమనీ ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుడిని తల్చుకోవడం మానలేదు.
అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తల్చుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి! 

*"ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం"* అనే సూత్రమూ బోధపడింది.

 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya