స్త్రీలలో కనిపించే ఏడు గుణాలు ఏమిటో తెలుసా?

34.200.222.93
నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ.....
 
స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.
 
 దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 
 
ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...
 
 1) కీర్తి...
 
సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు. 
 
 2) శ్రీ...
 
శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. శ్రీ అంటే లక్ష్మి. 
 
 3) వాక్కు...
 
వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 
 
 4) స్మృతి...
 
జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.
 
 సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 
 
 5) మేధా...
 
ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇది కూడా భగవంతుని విభూతియే.
 
 6) ధృతి...
 
ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.
 
 7) క్షమా...
 
 అత్తమామలను ఆదరించటంలోను, భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోను, పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.
 
 విశేషార్థం...
 
'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే...
 
-  శేషావధాని, కంచి మఠం 

Quote of the day

What is Art? It is the response of man's creative soul to the call of the Real.…

__________Rabindranath Tagore