Online Puja Services

ఆ రాయి విలువ

18.223.20.57

ఆ రాయి విలువ కుంకుడుకాయలు కొట్టిననాడే తెలిస్తే , ఎంతబాగుండేది !
-సేకరణ: లక్ష్మి రమణ 
 
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది 

తరువాత ఆ రాయిని అదే పనికి  చాలా సార్లు వాడుటూ ఉండేది .  ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు.

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీపట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.

అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.

నీతి :-

అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు. జీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం – జీవన గమనాన్ని సాగిద్దాం

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi