కర్ణుడితో దుర్యోధనుడి పోటీ

3.80.3.192

సహజ గుణాలు

దానం చేసే గుణమూ, ప్రియముగా మాట్లాడడమూ, ధీరత్వమూ, ఉచితానుచితాల జ్ఞానమూ అభ్యాసం వల్ల రావు.  అవి సహజ గుణాలయి ఉండాలి.

తాను చేరదీసి ఆశ్రయమిచ్చిన కర్ణుడే దాన కర్ణుడని పేరు పొందడం చూసి ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడి దాతృత్వంతో పోటీ పడి అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తానని ప్రకటించాడు దుర్యోధనుడు.

ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి.. " రాజా! నేను ఓ యజ్ఞం చేయ తలపెట్టేను. దానికి చాలా కట్టెలు అవసరం. ఇప్పించమని అడిగేడు.." సరే! తమకు కావలసినన్ని కట్టెలు తీసుకుని వెళ్ళండి." అన్నాడు దుర్యోధనుడు. అప్పుడా మునీశ్వరుడు.. " రాజా! ఇప్పుడు కాదు. యజ్ఞం ప్రారంభించే ముందు వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. "సరే" అన్నాడు దుర్యోధనుడు.

కాలగమనంలో ఋతువులు మారేయి. వర్ష ఋతువు వచ్చింది. మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడిగేడు." స్వామీ! నేను ఇస్తానన్నప్పుడు తమరు తీసుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడేమో వర్షాకాలం. ఈ సమయంలో మీకు కావలసినన్ని ఎండు కట్టెలు లభించడం కష్టం కదా! మరోసారి వచ్చి తీసుకు వెళ్ళండి." అన్నాడు దుర్యోధనుడు.

" సరే!" అని ఆ మునీశ్వరుడు కర్ణుడి వద్దకు వెళ్లి తన అవసరాన్ని తెలిపేడు... వెంటనే కర్ణుడు దుర్యోధనుడు తనకిచ్చిన భవంతి ని కూలగొట్టించి అందులోని కలపను తీసుకోమన్నాడు.  కర్ణుడి దాతృత్వం తెలుసుకుని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను ఉపసంహరించుకున్నాడు.
తనకు అక్కర్లేని దానిని దానం చేయడం అధమం. తనకున్న దానిలో దానం చేయడం మధ్యమం. దానం చేసేస్తే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం. ఈ గుణమే కర్ణుడికి దాన కర్ణుడిగా పేరు తెచ్చింది. ఇలాంటి ఉత్తమ గుణమే సక్తుప్రస్థుడి ఆతిథ్యంలో చూసిన ఓ ఉడత ధర్మరాజు చేసిన రాజసూయ యాగ ఆతిథ్యంలో చూడలేక పోయింది.

అలాగే ప్రియ వక్తృత్వం అంటే ప్రియంగా మాట్లాడడం కూడా సహజ గుణమే... ఓ వరమే... మాట్లాడడం కూడా ఓ కళే... నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు. అది మన వాక్కు ప్రభావం అన్న మాట.

ధీరత్వం కూడా జన్మతః లభించే గుణమే. ఉత్తర కుమారుడు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంత ధీరుడనని చెప్పుకున్నా అభిమన్యుడిలా, అర్జునుడిలా కాలేక పోయేడు. 

ఇంక ఉచితజ్ఞత... ఇది చాలా క్లిష్టమైనది. ధర్మ సంకటమైనది.... ఒక విషయంలో ఉచితమైనది మరొక విషయంలో అనుచితం కావచ్చు..  అది సమయం, సందర్భాలను బట్టి ఉంటుంది..

కప్పను మ్రింగబోతున్న పాము బారి నుండి కప్పను కాపాడడం ఉచితమా..? పాము ఆహారం చెడగొట్టడం ఎందుకని ఊరుకుండడం ఉచితమా?  కప్ప పాముకు బలి అవుతుండడం చూస్తూ ఊరుకోవడమూ దోషమే. పాము ఆహారం చెడగొట్టడమూ దోషమే. అయితే ఆహారమా? ప్రాణమా? ఏది ముఖ్యం? అనేది ఇక్కడ చర్చనీయాశం. 

ఇలాంటి ఉచితానుచితాల జ్ఞానం ధర్మసూక్ష్మాల నెరిగిన మహానుభావులకే ఉంటుంది. మహా కావ్యమైన రామాయణమూ, గొప్ప ఇతిహాసమైన భారతమూ, ఘన పురాణమైన భాగవతమూ వాటి గాథలూ, కథలూ, ఘట్టాల లోని పాత్రల ద్వారా మనకిలాంటి ధర్మ సూక్ష్మాలని తెలుపుతాయి.

వాటిని కేవలం కీర్తించడం, పఠించడం, పారాయణ చేయడం వరకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టినప్పుడే మన జన్మ తరిస్తుంది. చరితార్థ మవుతుంది. ధన్యమవుతుంది....

హిందూ సంప్రదాయాలను గౌరవించండి --  పాటించండి..

సర్వేజనా సుఖినోభవంతు 

- పాత మహేష్ 

Quote of the day

Citizenship consists in the service of the country.…

__________Jawaharlal Nehru