Online Puja Services

అక్షయ తృతీయ నాడు చేయవలసిన నారాయణుని ప్రార్థనా వైభవం.

18.221.15.15

కోరినదల్లా అనుగ్రహించే  అక్షయ తృతీయ నాడు చేయవలసిన నారాయణుని ప్రార్థనా  వైభవం. 
- లక్ష్మి రమణ 

నారదుడు (Narada) అంబరీషునితో (ambarisha) ఆ తర్వాతి వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగారు. “ ఓ రాజా! పాంచాల మహారాజు (Panchala King) చేసిన ఆ దేవదేవుని స్తుతిని ఈ వైశాఖ మాసంలో (vaisakha Masam)పఠించినా విన్నా అనంతమైన పుణ్యాన్ని ఆ పరమాత్మ అనుగ్రహిస్తారు.  ఆ  దివ్యమైన స్తుతి వైభవాన్ని శృతి దేవ మహాముని శృతి కీర్తి మహారాజుతో చెబుతున్నారు.  ఆ విశేషాలని సావధానంగా  ఆలకించు” అంటూ 21వ అధ్యాయాన్ని వివరించం మొదలుపెట్టారు .  

పాంచాల రాజుకి శ్రీహరి దర్శనం అయ్యింది . ఆ దేవదేవుని ప్రత్యక్షముగా  చూసి సంతోష పడినవాడై, వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించాడు.  ఆనంద భాష్పాలను విడుస్తూ, సర్వజగములను పావనం చేసే గంగానది పుట్టుకకు కారణమైనటువంటి శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలాలను తనపై చల్లుకున్నారు.  విలువైన వస్త్రాలని, ఆభరణాలను, గంధ పుష్పాదులను, పుష్ప మాలలను, ధూపాన్ని, అమృత ప్రాయమైనటువంటి నివేదనలని, తన శరీరాన్ని, ధనాన్ని, ఇలా తన సర్వస్వాన్ని శ్రీహరికి భక్తితో సమర్పించాడు. 

ఆ తర్వాత  ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటి లేని వాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తుతించాడు. 

నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1

ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2

సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3

తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4

ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5

భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6

తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7

వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8

తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9

ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10

నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11

త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12

నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13

పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14

పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15

సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16

సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17

ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18

అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19

ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20

భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21

ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22

కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23

హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24

త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25

 పాంచాల రాజు చేసిన ఈ స్తుతి అర్థవంతము శక్తివంతం అవడం చేత దీనికి భావాన్ని కూడా చెప్పుకుందాం. చతుర్వింశతి (24) తత్వాలు+ పరమేశ్వరుడైన శ్రీహరి ఒకడు మొత్తం కలిపితే 25.  ఈ సంఖ్యకు వచ్చినటువంటి శ్లోకములు ఉన్న ఈ స్తోత్రం పరమాత్మకు ప్రీతికరమైనది, ఆ శ్రీహరి అనుగ్రహాన్ని ప్రసాదింప చేయగలిగింది . మనమందరం కూడా పాంచాల రాజు లాగా పూర్వకర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకుని, గురువులు పెద్దల వల్ల తరుణోపాయాన్ని తెలుసుకొని పాటించినటువంటి పాంచాల రాజు లాగా కష్టములను దాటుకుని సర్వసుఖాలను పొంది భగవంతుని దర్శనాన్ని పొందాలని కోరిక గల వారిమే కదా! అందుకని ఈ స్తోత్రానికి భావాన్ని తెలుసుకుని ఆ దేవదేవుని భావయుక్తంగా స్తుతిద్దాం . 

1. స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.

2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.

3. స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.

4. తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.

5. స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.

6. నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.

7. ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.

8. ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.

9. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.

10. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.

11. స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.

12. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.

13. స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.

14. నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.

15. స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.

16. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.

17. ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.

18. స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.

19. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.

20. జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.

21. ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.

22. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.

23. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.

24. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.

25. ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.

ఈ విధంగా పాంచాల రాజు చేత స్తుతించబడినటువంటి శ్రీమన్నారాయణుడు  పద్మముల లాగా విచ్చి ఉన్నటువంటి కనులతో ప్రసన్నుడై అతన్ని చూస్తూ, మేఘ గంభీర స్వరంతో ఈ విధంగా అన్నారు. “ నాయనా నువ్వు నా భక్తుడివని, కోరికలు, కల్మషములు లేనివాడవని నాకు తెలుసు.  అందువల్ల దేవతలకు కూడా పొందరా నటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను.  పదివేల సంవత్సరాల పాటు దీర్ఘాయువుతో సర్వసంపదలతో నాపైన నిశ్చలమైన భక్తితో జీవించి, చివరకు ముక్తిని పొందగల వాడవు.  నువ్వు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడై భక్తిని ముక్తిని ప్రసాదిస్తాను.  ఇందులో సందేహమే లేదు. 

నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన రోజు అక్షయ తృతీయ.   అక్షయ తృతీయ అనే పేరుతో ఈ తిధి సార్ధక నామమై నన్ను స్తుతించినటువంటి నా భక్తులకు అక్షయమైనటువంటి భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది.  భక్తి పూర్వకముగా అయినప్పటికీ, బలవంతముగా అయినప్పటికీ, మొహమాటం వల్ల అయినప్పటికీ , ఏదో ఒక కారణం చేత వైశాఖ  స్నానాధికములను చేసిన వారికి భక్తిని ముక్తిని ప్రసాదిస్తాను.  

ఈ అక్షయ తృతీయ రోజున పితృదేవతలకు శ్రార్థాన్ని నిర్వహించినట్లయితే, వారికి వంశవ వృద్ధి కలుగుతుంది అనంతపుణ్యము కలుగుతుంది.  ఈ అక్షయ తృతీయ మిక్కిలి ఉత్తమమైనది.  దీనికి సాటి అయిన తిథి లేదు.  ఈరోజు చేసినటువంటి సత్కార్యాలన్ని కూడా పూజ దానము అల్పములైనప్పటికీ కూడా, అక్షయమైన ఫలాన్ని అనుగ్రహిస్తాయి.  కుటుంబము కల బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే అతనికి సర్వసంపదలు కలిగి ముక్తిని ప్రసాదిస్తాయి.  సమస్త పాపాలను పోగొడుతుంది.  వృషభదానము చేసినవారికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాను. వైశాఖ వ్రతాన్ని దానధర్మాలను యధాశక్తిగా చేసిన వారికి జన్మజరా మృత్యు వ్యాధి భయాలను సర్వపాపాలను పోగొడతాను.  

వైశాఖ మాసంలో చేసినటువంటి పూజ దానము మొదలైన వాటి వలన సంతోషించినట్టుగా ఇతర మాసములలో చేసిన పూజలకు సంతోషపడను.  వైశాఖమాసానికి మాధవ మాసమని పేరు.  దీన్ని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహించవచ్చు. అన్ని ధర్మములలోనూ బ్రహ్మ చర్యాది వ్రతములను విడిచిన వారైనప్పటికీ, వైశాఖ  వ్రతాన్ని ఆచరించినట్లయితే నేను వారి పట్ల ప్రీతిని పొంది, వరాలను అనుగ్రహిస్తాను.  వైశాఖ వ్రతాన్ని దానాలను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యా యోగమునకు, యజ్ఞ యాగాదికములకు సాధ్యము కాని నా సాన్నిద్యాన్ని చేరుకుంటారు.  ప్రాయశ్చిత్తమేలేని వేలకొద్దీ మహా పాపములు చేసిన వారైనప్పటికీ, వైశాఖ వ్రతాన్ని ఆచరించినట్లయితే పాప క్షయము కలుగుతుంది.  అనంత పుణ్యము ప్రసాదిస్తాను.  నా పాద స్మరణ చేత వారిని రక్షిస్తాను. 

 ఓ పాంచాల మహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నప్పటికీ భక్తిశ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవయ్యావు.  కాబట్టి ప్రసన్నుడనై, నీకు ప్రత్యక్షమయ్యాను.  నీకు అనేకానేక వరాలను అనుగ్రహించాను”.  అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్దానమయ్యారు. 

 పాంచాల మహారాజు కూడా శ్రీహరి అనుగ్రహానికి ఎంతో ఆనందాన్ని పొందారు. శ్రీహరి పట్ల నిశ్చల భక్తితోటి పెద్దలను గౌరవిస్తూ, చిరకాలము ధర్మపూర్ణమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేదు, గౌరవించలేదు.  భార్య పుత్రాదుల కంటే కూడా శ్రీమన్నారాయణడే తనకు కావలసిన వాడని నమ్మి, సేవించాడు.  భార్య పుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కూడా కలిసి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ దానధర్మాలను చేస్తూ  చిరకాలము సర్వభోగాలను పొంది తుదకు శ్రీహరి సాన్నిద్యాన్ని చేరుకున్నాడు. 

 ఉత్తమమైనటువంటి ఈ కథను విన్నా వినిపించిన సర్వపాపాల నుంచి విముక్తులై శ్రీహరి సానిధ్యాన్ని చేరుకుంటారు” అని శ్రుతదేవుడు శ్రుత కీర్తి మహారాజుకు తెలియజేశారని, ఈ విధంగా నారదుడు అంబరీషునికి వైశాఖ  మాస విశేషతని వివరించారు. 

వైశాఖపురాణం 21 వ అధ్యాయం సంపూర్ణం . 

సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు !!

Vaisakha Puranam

#vaisakhapuranam #vaisakha #puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha