Online Puja Services

కీర్తిని , పుత్రులని ప్రసాదించి, రోగాలని హరించే దివ్యమైన ఉదంతం.

3.141.27.244

విన్నా, చదివినా- కీర్తిని , పుత్రులని ప్రసాదించి, రోగాలని హరించే దివ్యమైన ఉదంతం. 
- లక్ష్మి రమణ 

నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని వివరిస్తూ ఉన్నారు. నిధులకిపతి అయిన శృత కీర్తి మహారాజు శృతదేవ మహామునిని  “ముక్కింటి కంటి మంటకు ఎర  కావడానికి మన్మధుని జన్మ విశేషం కారణమయ్యిందా ?శివునిమీదే మన్మథ బాణాన్ని ప్రయోగించిన తర్వాత మన్మధుని కర్మము ఏవిధంగా పరిణమించింది ?  అతడేటువంటి దుఃఖాన్ని అనుభవించాడు?” వివరించమని కోరాడు. అప్పుడు  శృతదేవుడు ఈ విధంగా వైశాఖ పురాణంలోని పదకొండవ అధ్యాయాన్ని చెప్పసాగారు.  

కుమార స్వామి జన్మ కథ పవిత్రమైంది. విన్న వెంటనే చేసిన పాపాలను నశిస్తాయి.  కీర్తిని పుత్రులని ప్రసాదిస్తుంది.  ధర్మబుద్ధిని కలిగిస్తుంది.  సర్వరోగాలనీ హరిస్తుంది. అటువంటి దివ్యమైన కథని చెబుతున్నాను సావధానంగా విను! అంటూ ఈ విధంగా చెప్పసాగారు. “ఓ రాజా శివుని కంటి మంటకు మన్మధుడు దహించుకుపోవడం  చూసి మన్మధుని భార్య అయిన రతి దుఃఖముతో మూర్ఛపోయింది. ఆమె దుఃఖము చూసిన వారికి కూడా, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఆమె తన భర్తతో సహగమనం చేయాలని తలచింది.  అందుకోసం తగిన ఏర్పాట్లుని చేయడానికి, తన భర్తకు మిత్రుడైన వసంతుడిని తలచింది.  వీరపత్ని  అయిన ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచడానికి వసంతుడు అక్కడికి వచ్చాడు.  మిత్రుడి దుర్మరణానికి, మిత్రుని భార్య దురవస్థకు విచారిస్తున్న వసంతుడు రతి దేవిని ఊరడించాడు.  “అమ్మ నేను నీ పుత్రుడి వంటి వాడని.  పుత్రుడైన నేనుండగా, నువ్వు సహగమనము చేయరాదు”.  అని వసంతుడు బహు విధాలుగా చెప్పినప్పటికీ, రతి సహగమనాన్ని చేయడానికె  నిశ్చయించుకుంది.  

వసంతుడు ఆమెను నిర్ణయాన్ని మరలించలేకపోయాడు.  ఆమె కోరిన విధంగా చితిని నదీ తీరంలో ఏర్పాటు చేశాడు.  ఆమె గంగ స్నానం చేసి, సహగమనము చేయడానికి ముందుగా చేయవలసినటువంటి విధులను పూర్తిచేసి, భర్తను తలుచుకుంటూ చితిని ఎక్కబోతోంది.  అప్పుడు ఆకాశవాణి “ఓ కళ్యాణి! పతిభక్తి మతి! అగ్ని ప్రవేశం చేయకు.  శివుని వల్ల, శ్రీకృష్ణ అవతారం ఎత్తినటువంటి శ్రీ మహా విష్ణువు వల్ల నీ భర్తకు రెండు జన్మలు ఉన్నాయి. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వల్ల రుక్మిణి దేవికి ప్రద్యుమ్నుడిగా మన్మథుడు జన్మిస్తాడు.  నువ్వు బ్రహ్మ శాపవశాన శంబరాదరుని ఇంట జన్మిస్తావు. అప్పుడు నీ భర్త అయిన ప్రద్యుమ్నుడితో కలిసి శంబరాదరుని ఇంట ఉండగలవు.  ఆ విధముగా నీకు భర్త సమాగము ఉన్నది.  అందువల్ల అగ్ని ప్రవేశాన్ని మానుకో”మని పలికింది.  ఆకాశవాణి మాటలు పాటించి రతి అగ్ని ప్రవేశాన్ని మానుకుంది. 

 ఆ తర్వాత బృహస్పతి ఇంద్రుడు మొదలైన దేవతలు  అక్కడికి వచ్చారు.  తమ ప్రయోజనం కోసము  శరీరాన్ని కోల్పోయిన మన్మధుని భార్య అయిన రతీ దేవిని చాలా విధాలుగా ఊరడించారు.  ఆమెకు అనేక వరాలను ప్రసాదించారు.  శివుడి కంటి మంటలో దహించబడి, శరీరము లేనివాడైనా అనంగుడు అనే పేరును మన్మధుడు పొందాడు.  నీకు మాత్రము యధా పూర్వకముగా మన్మధుడు కనిపిస్తాడని ఆమెకు మరెన్నో వరాలను ఇచ్చి ఊరడించారు. అనేక ధర్మాలను ఉపదేశించి, ఇంకా ఈ విధంగా చెప్పారు. “ ఓ కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు . అప్పుడు కూడా నీవే ఇతని భార్యవి . అప్పుడు రజో దోషము పొందినప్పటికీ, ఆ దోషములను పాటించకపోవడం చేత ఇప్పుడు నీకి స్థితి వచ్చింది.  కాబట్టి వైశాఖ  మాసంలో గంగా స్నానం చేసి, వైశాఖ వ్రతాన్ని ఆచరించు.  పూర్వ జన్మలో నువ్వు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తమవుతుంది.  

ప్రాతః కాలంలో గంగా స్నానము చేసి, శ్రీమహావిష్ణువుని పూజించు. పూజానంతరము విష్ణు కథా శ్రవణం చెయ్యి. నీ విధంగా చేసినట్లయితే నీ భర్త నీకు లభిస్తాడు.  అని రతికి అశూన్యశయన వ్రతాన్ని ఆచరించే విధాన్ని చెప్పి, దేవతలు వెళ్లిపోయారు.  రతీదేవి అతి కష్టముపై,  దుఃఖాన్ని దిగ మింగి, సూర్యుడు మేషరాశిలో ఉండగా, వైశాఖమాసంలో వైశాక వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్యశయన  వ్రతాన్ని చేసింది.  ఆ వ్రత ప్రభావముచేత ఆమెకు భర్త అయినటువంటి మన్మధుడు కంటికి కనిపించాడు.  ఆమెతో యధాపూర్వకంగా సుఖిస్తూ ఉన్నాడు. 

అయితే,  మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజుగా ఉన్నాడు.  అప్పుడతడు వైశాఖ  వ్రతాన్ని చెయ్యలేదు.  వైశాఖ  దానాలను చేయలేదు.  అందుచేత ఇతడు శ్రీమహావిష్ణువు కుమారుడైనప్పటికీ కూడా, శివుడి కోపాగ్ని చేత శరీరాన్ని పోగొట్టుకున్నాడు.  విష్ణు పుత్రుడై, వైశాఖ  వ్రతాన్ని ఆచరించకపోవడం వల్ల, ఆ మన్మధునికి ఇటువంటి పరిస్థితి వచ్చింది.  ఇక మిగిలిన వారి గురించి ఏమని చెప్పాలి? కాబట్టి ఇహలోక సుఖాలను ఆశించే వారందరూ తప్పకుండా వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి.” అని చెప్పారు. 

వైశాఖ పురాణం  11 వ అధ్యాయం సంపూర్ణం. 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha