Online Puja Services

అద్భుతాలకు ఆలవాలం ఈ కేదారేశ్వర ఆలయం !!

3.144.86.138

అద్భుతాలకు ఆలవాలం ఈ కేదారేశ్వర ఆలయం !!
- లక్ష్మి రమణ 

ఆలయంలోని గోముఖం నుండీ నిరంతరం ప్రవహించే నీరు . 

ఎంతతిన్నా క్షణంలో జీర్ణంచేసే ఔషధ తీర్థం . 

నిశీధిలో అశ్వాల డెక్కల శబ్దం 

కాలునికి చుట్టుకొనే  కాలనాగులు 

ఇవన్నీ  కేదారేశ్వరుని ఆలయ అద్భుతాలు . 

కేదారేశ్వర స్వరూపంలో శివుణ్ణి ఆరాధించడం వలన స్త్రీలకి సౌభాగ్యాలు , పతి ఆదరాభిమానాలూ మెండుగా లభిస్తాయన్నది తెలుగువారికి తెలిసిన విషయమే . అయితే, కేదారేస్వర వ్రతం మాత్రమే కాకూండా మన దేశంలో అనేకానేక కేదారేస్వర ఆలయాలున్నాయి. మహిమాన్వితమైన ఈ ఆలయాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు . అటువంటి ఒక దేవాలయం మధ్యప్రదేశ్లో ఉంది.

  మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో పొహ్రీ అనే ఊరుంది . ఈ ఊరిలో సర్కులా నది ప్రవహిస్తూ ఉంటుంది . ఎత్తయిన కొండలు, పరుచుకున్న ప్రక్రుతి సౌందర్యం మధ్య పరమేశ్వరుడు స్వయంభువై వెలిసి ఉన్నారు . ఒక భక్తునికి కలలో కనిపించి తానూ కొండల మధ్య వెలిసి ఉన్నానని, ఆలయాన్ని నిర్మించవలసిందని ఆ కేదారేశ్వరుడు ఆదేశించారు . ఆ కలలో సూచించిన విధంగా కొండని తవ్వి చూడగా కేదారేశ్వరుడు దర్శనం ఇచ్చారు.  ఇది దాదాపు 500 ఏళ్ళకి పూర్వం జరిగిన ఉదంతం . అప్పటినుండీ ఇక్కడ కేదారేశ్వరునికి నిత్యపూజలు, అభిషేకాలు , ప్రత్యేకపూజలూ జరుగుతున్నాయి. 

ప్రస్తుతం ఉన్న కేదారేశ్వర ఆలయాన్ని 16 వ శతాబ్దంలో పోహ్రీని పరిపాలించిన  రాజు నావల్ఖండేరావ్ నిర్మించారు. పర్వతం నుండీ జాలువారే నీటి ప్రవాహం శివలింగానికి క్షణక్షణమూ అభిషేకాలు చేస్తుంటుంది . అంతకు ముందర బుధి పొహ్రి అనే ప్రదేశంలో ఈ కేదారేశ్వరుడు పూజలందుకునేవారిని ఇక్కడి పూజారులు చెబుతారు. 

ఒకవైపు గడియగడియకి గంగతానాలు సహజంగా జరుగుతూ ఉంటె, మరోవైపు ప్రధాన ఆలయానికి సమీపంలో ఒక నీటి కొలను ఉంటుంది. ఇది ఏ కాలంలోనూ ఎండిపోదని స్థానికులు చెబుతారు . సహజమైన జలతో స్వచ్ఛంగా ఉండే ఈ నీటిని ఆలయంలో పూజల కోసం ప్రజలు ఈ కొలను నుండి తీసుకువెళతారు.  

ఆలయం చుట్టూ ఉన్న కొండ ఒక ఔషధీయ బాండాగారం అని చెప్పాలి. విలువ కట్టలేని ఎన్నో ఔషధాలు, మూలికలు ఈ కొండ మీద లభిస్తాయి.  ఈ ఆలయం దిగువకి దిగి వెళ్ళినప్పుడు, గంటల శబ్దం వినబడుతుంది. ఎవరో ఆహ్వానించినట్టు అనిపిస్తుంది . కానీ ఆలయం లోకి వెళ్ళినప్పుడు  అక్కడ అటువంటి శబ్దాలు, గంటల మోతలు ఏమీ వినబడకపోవడం ఒక విచిత్రమైన విషయం .

చీకటి పడే సమయానికి ఈ  ఆలయంలో ఎవరూ ఉండరు.  అర్ధరాత్రి గుర్రాల శబ్దం వినిపిస్తుంటుంది . అంతే కాదు, నాగేంద్రుడు ఇక్కడి కేదారుణ్ని చుట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తుంటారు. సాధారణంగా మానవుల శబ్దం విన్న తర్వాత ఆ సర్పం  అదృశ్యమవుతుంది. కానీ నాగేంద్రహారాన్ని ధరించి  ఉన్న కేదారేశ్వరుని దర్శనం జన్మజన్మల అదృష్టమని భక్తుల విశ్వాసం . 

పితృదేవతలకు మహాలయపక్షాలు, పుణ్య తిథులలో ప్రజలు ఈ కొలనులో ఆర్ఘ్యం ఇస్తారు.  ఇక ఇక్కడి గోముఖ తీర్థం మరో అద్భుతం . కేదారేశ్వరునికి సమీపంలోనే ఈ తీర్థం ఉంటుంది .  ఈ తీర్థంలోని నీటిని సేవిస్తే,  ఒక వ్యక్తి ఎంత ఆహారం తిన్నా, వెంటనే జీర్ణమైపోతుందట. 

ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనిపిస్తోంది కదూ ! కేవలం మహిమాన్విత ఆలయమే కాదు, ప్రక్రుతి ఒడిలో కాసేపు హాయిగా సేదతీరాలి అనుకునేవారు కూడా ఈ ప్రాంతాన్ని, చుట్టుపక్కల ఉన్న విహార స్థలాలని ఎంపిక చేసుకోవచ్చు . కేదారేశ్వరుని మహిమని చాటుతున్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి . 

శుభం !!

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda