Online Puja Services

కార్తీకపురాణము - ఏకాదశాధ్యాయము

18.224.37.68

ఓం నమఃశ్శివాయ 
కార్తీకపురాణము - ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ 

ఓ జనక మహారాజా! ఈ  కార్తిక మాసవ్రతము మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పాను . ఇంకా దీనిని గురించి ఎంతగా చెప్పినా తనివి తీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజించినట్లయితే చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగుతుంది . 

విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసమును చెబుతాను. శ్రద్దగా అలకి౦చు.  అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పసాగారు .

పూర్వము కళింగ దేశములో మంధరుడనే విప్రుడున్నాడు . అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేస్తూ, అక్కడే భుజిస్తూ, మద్యమా౦సాది పానీయములు సేవిస్తూ ,తక్కువ జాతి వారి సాంగత్యము వల్ల  స్నాన,జప, ధీపారాధన మొదలైన ఆచారములను పాటించక దురాచారుడై ప్రవర్తించసాగాడు .

అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయినా, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ , పతివ్రతాధర్మమును నిర్వర్తించేది .

మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేస్తున్నా, ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాడు . ఆఖరికి దాని వల్ల కూడా పొట్ట గడవకపోవడం చేత ,  దొంగతనములు చేస్తూ , దారికాచి బాటసారులను బాధించి వారి దగ్గరున్న ధనము, వస్తువులు అపహరించి జీవించసాగాడు .

ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడిపోతుండగా అతనిని భయపెట్టి, కొట్టి, ధనమపహరిస్తుండగా, అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి, ధనాశచేత వారిద్దరిని చంపి  ధనము మూటగట్టుకొని పోసాగాడు .

సమీపములో ఉన్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాండ్రిస్తూ వచ్చి, కిరాతకునిపై పడింది . కిరతకుడు దానిని కూడా మట్టుపెట్టాడు. కానీ, అంతకుమునుపే , అ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టిఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు .

 ఈ విధముగా ఒకేకాలములో నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందువల్ల ఆ నలుగురు కూడా, యమలోకములో  అనేక శిక్షలు అనుభవిస్తూ  రక్తము కక్కుతూ బాధపడసాగారు .

 కానీ ,మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేస్తూ , సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖిస్తూ,  కాలము గడుపుతూ ఉండేది . కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చాడు .

ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామస్మరణ చేస్తూ ,జీవిస్తున్నాను. కాబట్టి, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకుంది .

ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ రోజు  కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన రోజు . ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుతారు . నేను చమురు తీసికొస్తాను . నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రా .దేవాలయముకి  ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొ గలవు " అని చెప్పినవెంటనే అందుకామె సంతోషించి , వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయముగా వత్తిచేసి, రెండు వత్తులు వేసి, ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసింది .

ఆ తరువాత యింటికి వెళ్ళి తనకు కనిపించినవారందరినీ  "ఆరోజు రాత్రి ఆలయములో  జరిగే పురాణ కాలక్షేపముకు రమ్మని" చెప్పింది . ఆమె కూడా రాత్రంతా పురాణ శ్రవణం చేసింది. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుతూ, కొంత కాలమునకు మరణించింది . ఆమె పుణ్యత్మురాలవడం వల్ల విష్ణుదూతలు వచ్చి, విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకునిపోయారు .

కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషము ప్రాప్తినిచ్చింది. దీనివల్ల మార్గ మధ్యములో యమలోకమునకు దీసికోనిపోయారు .అక్కడ నరకములో మరి ముగ్గురితో కలిసి బాధపడుతున్న తన భర్తను చూసి  "ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురుతో కలిసి నరక బాధపడుతున్నారు . కాబట్టి , నాపైన దయయుంచి వానిని వుద్దరింపు"మని ప్రాధేయపడింది .

అప్పుడు  విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండి, స్నాన సంధ్యాదులు మాని, పాపాత్ముడైయ్యాడు . రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనా , అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి, ధనముఅపహరించాడు. మూడవ వాడు వ్యాఘ్రము.  నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినప్పటికీ , అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేశాడు . ఆవిధంగా  పాపాత్ముడయ్యాడు . అందుకే యీ నలుగురు నరక బాధలు పడుతున్నారు", అని వారి చరిత్రలు చెప్పారు .

 అందుకామె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించింది.  అందుకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినట్టయితే  వారికి మోక్షము కలుగు"నని చెప్పారు .  ఆమె అందుకు సరేనని , ఆవిధానంగానే ధారపోసింది .

అప్పుడా అ నలుగురూ ఆమెతో కలిసి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లారు . కాబట్టి , ఓరాజా! కార్తికమాసములో పురాణము వినడం వల్ల , దీపము వెలిగించడం  వలన ఎలాంటి ఫలితము కలుగుతుందో విన్నావు కదా !” అని వశిష్టుల వారు చెప్పారు  .

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి,  ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya