Online Puja Services

కార్తీక పురాణం - ద్వితీయాధ్యాయం

18.218.129.100

ఓం నమః శివాయ
కార్తీక పురాణం ద్వితీయాధ్యాయం -రెండవ  రోజు పారాయణము 
- సేకరణ: లక్ష్మి రమణ 

వసిష్ఠుడు కార్తీక వ్రత విధానాన్ని జనకమహారాజుకి వివరిస్తున్నారు . “జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసములో ఆచరించాల్సిన విధి క్రమము మాత్రమే చెప్పాను . కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము ఉంది . కాబట్టి , సోమవార వ్రతవిధానముని , దాని మహిమని  గురించి వివరిస్తాను . సావధానుడవై ఆలకించు. అని ఇలా చెప్పనారంభించారు. 

“ కార్తీక మాసములో వచ్చే సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని ఏ జాతివారైనాగాని, రోజంతా  ఉపవాసముండి , నదీస్నానము చేసి, తమశక్తి కొలదీ దానధర్మములు చేసి, నిష్ఠతో పరమేశ్వరునికి  బిల్వపత్రాలతో అభిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భోజనం చేయాలి . 

ఈ విధముగా నిష్ఠతో పూజ చేసి , ఆ రాత్రి మొత్తం జాగరణ చేసి, పురాణ పఠనం  చేయాలి . 

తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలదీ పేదలకు అన్నదానము చేయాలి . అలా  చేయలేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైన తృప్తిగా భోజనము పెట్టి, ఆ తర్వాత వారు భోజనం చేయాలి .

ఉండగలిగిన వారు సోమవారమునాడు, రెండుపూటలా భోజనము గాని యే విధమైన ఫలహారముగాని తీసుకోకుండా ఉండడం మంచిది. ఇలా కార్తీక మాసములో వచ్చే సోమవారాల వ్రతమును చేసినట్లయితే, పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి, శివసన్నిధిని అనుగ్రహిస్తాడు .

భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివపూజ చేసినట్లయితే ,  కైలాసప్రాప్తి - విష్ణు పూజ చేసినట్లయితే వైకుంఠప్రాప్తి పొందుతారు . దీనికి ఉదాహరణముగ ఒక ఇతిహాసముని నీకు చెబుతాను. శ్రద్ధగా విను. అని ఇలా చెప్పసాగారు . 

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమును పొందడం  :

       పూర్వకాలములో  కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . అతడు పురోహిత వృత్తిని చేపట్టి,  తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు . అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె జన్మించింది . ఆమె పేరు 'స్వాతంత్ర్య నిష్ఠురి'.  తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన  మిత్రశర్మ అనే  సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేశారు . 

ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములూ, శాస్త్రములూ అభ్యసించినవాడు.  సదాచారపరాయణుడు. భూతదయ గల్గినవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు. ఇటివంటి సద్గుణాలు కలిగిన అతన్ని ప్రజలు  'అపరబ్రహ్మ' అని కూడా కీర్తిస్తూ  ఉండేవారు .

ఇటువంటి ఉత్తమపురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమిన్ను గానక పెద్దలను దూషిస్తూ  - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరిస్తూ, దుష్టురాలై తిరుగుతూ ,ఉండేది. ఆమె  వంశమునకు అప్రతిష్ట వస్తోందని అత్తమామలు ఆమెను తమ యింటినుండి వెళ్లగొట్టారు .

 కానీ , శాంతస్వరూపుడైన  ఆమె భర్తకు మారాము ఆమెపైన అభిమానము పోలేదు .  ఆమె యెంతటి నీచకార్యములు చేసినా ఓపికతో సహించేవాడేగానీ , చీ పొమ్మనలేదు. విడిచిపెట్టలేదు . ఆమెతోనే కలిసి కాపురము చేస్తుండేవారు . 

కాని, చుట్టుప్రక్కలవారు ఆ  నిష్ఠురి గయ్యాళితనముని అసహ్యించుకొని - ఆమెకు "కర్కశ" అనే ఎగతాళి పేరును పెట్టారు.  అది మొదలందరూ ఆమెని  "కర్కశా" అనే  పిలుస్తూ వుండేవారు.

 ఇట్లు కొంతకాలము అయ్యాక  - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి శయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయము చూచి, మెల్లగాలేచి, తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలు గాని లేకుండా,  ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది.  వెంటనే అతడు మరణించాడు. 

భర్త మృతదేహమును రహస్యంగా దొడ్డిదారిని తీసుకుపోయి,  వూరి చివర ఉన్న పాడుబడిన నూతిలో పడేసి,  పైన చెత్తాచెదారములతో నింపి, ఏమీ యెరుగని దానిలా తిరిగి  యింటికి చేరుకుంది . ఇక తనకు అడ్డు చెప్పేవారు లేరని మరింత విశృంఖలంగా ప్రవర్తించడం మొదలెట్టింది .  

         తాచెడ్డకోతి వనమెల్లా చెరచిందన్న చందాన ,   పడుచుకన్యలను, ఇతర ఇల్లాళ్ళనీ , తనమాటలతో చేరదీసి, వారిక్కూడా దుర్భుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జన చేయడం మొదలుపెట్టింది .

జనకమహారాజా! యవ్వనబింకము యెంతో కాలముండదుగదా! కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది.

 శరీరములో  మేహవ్రణములు బయలుదేరాయి . ఆ పుళ్ళ నుండి చీము, రక్తము రసికారుతోంది . దానికితోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతోంది . రోజురోజుకీ ఆమె శరీరపటుత్వము కృశించి, కురూపిగా మారి  భయంకర రోగములతో బాధ పడుతోంది. ఆమె యవ్వనములో నుండగా యెన్నో విధాల తృప్తి కలిగించిన విటులు యే ఒక్కరూ యిపుడామెను కన్నెత్తి కూడా చూడట్లేదు .

 కర్కశ ఇలా నరక బాధలని అనుభవిస్తూ , కొంతకాలానికి పురుగులు పడి  చనిపోయింది. బ్రతికినన్నాళ్లూ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్టురాలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి , ప్రేతరాజయిన యముని సన్నిధిలో ప్రవేశ పెట్టారు.  

యమధర్మరాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింతకాదు. వెంటనే యీమెను తీసుకువెళ్లి యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమునకి కట్టేయండి " అని ఆజ్ఞాపించారు . విటులతో సుఖించినందుకు గాను - యమభటూలామెను యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమును కౌగలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టిచంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టారు . 

పతివ్రతలను- వ్యభిచారిణులుగా మార్చిన పాపానికి  సలసల క్రాగిన నూనెలో పడేశారు . తల్లి దండ్రులకూ, అత్తమామలకూ అపకీర్తి తెచ్చినందుకు, సీసము కరిగించి నోటిలోనూ, చెవులలోనూ పోసి,యినుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు .

చివరకి, కుంభీపాకమనే నరకములో పడేశారు.  అందులో ఉండే  యినుపముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెఱ్ఱులు ఆమెని కుట్టాయి . ఆమె చేసిన పాపములకు గాను ఇటు ఏడు తరాలవాళ్లు, అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుతున్నారు .

 ఈ ప్రకారముగా నరకబాదలని అనుభవించి , చివరకి కళింగదేశములో కుక్క జన్మ ఎత్తిందా నిష్ఠురి. ఆకలి బాధపడలేక, యిల్లిల్లూ తిరుగుతూంటే, ఆ కుక్కని  కఱ్ఱలతో కొట్టేవారు కొందరైతే, తిట్టేవారు , ఈసడించుకునేవారూ ఇంకొందరు .

ఇదిలాఉండగా, ఒకరోజు ఒక సదాచారపరాయణుడైన ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము  అరుగుపైన పెట్టి, కాళ్లుచేతులు కడుక్కోవడానికి లోపలి వెళ్ళాడు . ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠురి వచ్చి ఆ బలియన్నమును తిన్నది.

 వ్రతనిష్టాగరిష్టుడైన అ బ్రాహ్మణుని పూజావిధానము తర్వాత జరిపించిన బలియన్నమవ్వడం చేత , ఆరోజు కార్తీకమాస సోమవారమవడం వల్లా , ఆ కుక్క ఆరోజంతా ఆహారం దొరక్క ఉపవాసముతో ఉండడంవల్ల , శివపూజా పవిత్రస్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వల్లా , ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం కలిగింది .  వెంటనే ఆ శునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడు ' అని మొరపెట్టుకుంది .

ఆ మాటలు బ్రాహ్మణుడు విని,  బైటకు వచ్చి చాశాడు . అక్కడ కుక్క తప్ప వేరెవ్వరూ అతనికి  కనిపించలేదు . దాంతో లోపలికి వెళ్లబోతుండగా , మళ్ళీ 'రక్షింపుము, రక్షింపుము' అని కేకలు వినిపించాయి . దాంతో ఆ  విప్రుడు బైటకు వచ్చి ఆ మాటలు ఆ శునకము మాట్లాడుతోందని గ్రహించి , 'ఎవరు నీవు ! నీ వృత్తాంతమేమి?'యని ప్రశ్నించాడు. 

అప్పుడా కుక్క  "మహానుభావా! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలలో నేను వరుసగా  విప్రకులాంగనని . వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి , వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించాను. ఆ  తరువాత, యమదూతలవల్ల మహానరక మనుభవించి, నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల యీ జన్మలో కుక్కగా పుట్టాను . ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ వుంచిన బలియన్నమును తినడం వల్ల  నాకీజ్ఞానోదయము కలిగినది.

 కాబట్టి ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రతఫలాన్నిచ్చి, నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను" యని వేడుకుంది.  కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోశాడు. దాంతో ,  వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చింది .

 ఆమె అందరికీ నమస్కారం చేసి , అందరూ చూస్తుండగానే , ఆ  విమానమెక్కి శివసాన్నిధ్యము చేరింది . కాబట్టి ఓ  జనక మహారాజా! నీవు కూడా  ఈ కార్తీక సోమవారవ్రతాన్ని ఆచరించి , శివసాన్నిథ్యమును పొందు”  అని వశిష్ఠులవారు హితబోధ చేసి, ఇంకా ఈ విధంగా చెప్పా సాగారు . 

           స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యములోని  రెండవ అధ్యాయము సంపూర్ణం . రెండవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! శుభం .

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi