శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సంప్రదాయం

54.165.57.161

కన్నులపండుగ శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సంప్రదాయం 
-లక్ష్మీ రమణ 

కార్తీకమాసంలో ఆచరించే దీపారాధన , నదీ హారతి, జ్వాలాతోరణం  జన్మజన్మల పాపాన్ని తొలగిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని కదా ఆర్యోక్తి .  అటువంటి పుణ్యస్థలంలో , నదీహారతి, జ్వాలా తోరణం చాలా అద్భుతంగా నిర్వహిస్తారు . ఈ పర్వదినాన శ్రీశైలంలో భక్తి దీపాల కాంతులతో మల్లికార్జనుడు,  ఆ స్వామినవ్వుల్లో భ్రమరాంబిక, హారతివెలుగుల్లో శిగజారి నేల చేరిన పాతాళ గంగమ్మ, పరవశించిపోతారు . వెలుగుతున్న తోరణంకిందనుండీ నడిచే ఆ ముక్కంటిని చూసి భక్తులు తరించిపోతారు . రండి ఈ రోజు ఆ వైభవాన్ని గురించి చెప్పుకుందాం .  

కార్తీకదీపం :

ఆత్మలోనే పరమాత్మ  నిండి ఉంటాడు.  ఆత్మ ప్రకాశానికి అడ్డుగా నిలిచే చీకటి మాయ. మనసును మూసిన మాయను తరిమేసి, ఆత్మ స్వరూపంగా హృదయంలోనే కొలువైన భగవంతుని చూడమని   జ్ఞాన ప్రభోధమే దీపారాధానం. విశ్వమంతా నిండి , అనంతమై, అనేకమై  అణువణువునా నిలిచిన ఆ  పరమాత్మ,  తిరిగి ఏకమైన విశ్వప్రకాశాన్ని తెలుసుకొనేందుకు ఆత్మ జ్ఞానం మొక్కటే దారి. అది తెలుసుకొని, మాయ మొహబంధం నుండి బయట పడమని వెలుగుతున్న దీపాలు బోధిస్తాయి. వరుసలుకట్టి దేదీప్యంగా వెలుగుతూ దేవదేవుని దివ్య సన్నిధికి దారి చూపుతాయి.  అందుకే దీపాలు వెలిగించడం పుణ్యప్రదం అని చెబుతారు . కార్తీకమాసంలో వీటిని వెలిగించడం మరింత ఫలదాయకం. శ్రీశైలంలో వెలిగే ప్రతిదీపం ఒక జ్యోతిర్లింగమై స్వామి తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది . చూసే వారికి కన్నులపండుగే ఈ దీపాల వేడుక .  

కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి శివా రాదన చేయడం అత్యంత ఫల ప్రదామని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. దీపారాధనే కాదు, వెలుగుతున్న దీపంలో కాస్త చమురు వేసి వృద్ధి చేయడం , ఆఖరికి జీర్ణమైన దీపాన్ని వెలిగించినా  కూడా వారు విశేష ఫలాన్ని పొందుతారని ఆర్యోక్తి. కార్తీక పురాణంలో ఒక మూషిక  వృత్తాంతం కార్తీక దీప ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. కార్తీక పౌర్ణమి రోజు , శివైక్యం చెందిన ఒక  దీపపు ఒత్తిని  తినాలనుకొంది  ఒక ఎలుక. ఒత్తిని నోటితో కరుచుకొని వెళుతుండగా, పక్కనే మరో వెలుగుతున్న దీపానికి తగిలి ఆ ఒత్తి ప్రకాశించింది. వెంటనే, అ ఎలుకకు విప్ర రూపం సంప్రాప్తించింది. అంతటి పుణ్యం, ప్రాస్త్యం కలిగినది కార్తీక దీపారాధన.

గంగమ్మకి ఏకాదశ హారతులు :

ఇక , ప్రాణకోటి కి జీవనాధారమైన నదులను దేవతామూర్తులుగా  అర్చించడం మనసంప్రదాయం. అందునా గంగా నదిని  పరమ పావనిగా పేర్కొంటున్నాయి మన శృతులు . గంగానది పంచపాయల్లో కృష్ణవేణి ఒకటి. శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగగా కృష్ణమ్మ పూజలందు కొంటోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా  ఏకాదశ నదీహారతు లతో కృష్ణమ్మను కొలుస్తారు. 

హారతి అంటే , వెలుగు అని అర్థం. సమస్తసృష్టికీ పరమాత్మే ఆధారం. ఆ పరమాత్మ కారణంగానే సూర్యుడు , నక్షత్రాలు మొదలైన వన్నీ ప్రకాశించడం జరుగుతుంది. అలా స్వయం ప్రకాశకములైన వాటికి కూడా ప్రకాశాన్ని అనుగ్రహించిన మూల ప్రకాశమే జగన్మాత. అటువంటి మూల ప్రకాశాన్ని ఆధ్యాత్మిక దృష్టితో అవగాహన చేసుకోవడమే హారతి ఇవ్వడం వెనుక పరమార్ధం . 

శ్రీశైల దేస్థానం పాతాళ గంగ స్నాన ఘట్టాల వద్ద పుణ్య నదీ హారతి పేరుతొ కృష్ణవేణి కి ఏకాదశ హారతులను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది . శాస్త్రోక్తంగా  ఏక, నేత్ర, బిల్వ, నాగ, పంచ, పుష్ప, నంది, సింహ, నక్షత్ర, విష్ణు, కుంభ హారతులనే 11 రకాల హారతుల తో  పాతాళ గంగను పూజిస్తారు. నేత్రానందకరంగా సాగే  ఈ ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాలుపంచుకుంటారు.  

 జ్వాలా తోరణం :

లోకకంటకులైన త్రిపురాసురులను సంహరించి కైలాసానికి విజయం చేసిన పరమేశ్వరునికి జ్వాలా తోరణంతో స్వాగతం చెప్పిందట పార్వతీ మాత . స్వామికి తగిలిన దిష్టి ఈ రకంగా అమ్మవారు తొలగించిందట. ఇక అప్పటినుండి ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించిన కార్తీక పౌర్ణమి పర్వదినాన జ్వాలా తోరణం నిర్వహించడం శైవ క్షేత్రాలలో ఆనవాయితీగా మారింది.

శ్రీశైలంలో జ్వాలాతోరణం సందర్భంగా మల్లన్న సన్నిధి లోని గంగాధర మడపం వద్ద  ఆవునేతిలో నానిన నూలు వస్త్రాలను తోరణాలుగా అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు . అనంతరం ఆలయ ప్రదక్షినగా శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని పల్లకీలో తీసుకు వచ్చి, వెలుగుతున్న జ్వాలా తోరణం కింది నుండి  ఆలయంలోకి తీసుకు వెళతారు.ఈ జ్వాలా తోరణ భస్మాన్ని ధరించడం వల్ల  సర్వపాపాలు నశిస్తాయని, అపమృత్యు భయం ఉండదని భక్తుల విశ్వాసం. వైభవోపేతమైన ఈ మల్లన్న వేడుకల్లో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని తరిస్తుంటారు .

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda