కార్తీక పౌర్ణమి- జ్వాలాతోరణం

54.165.57.161

కార్తీక పౌర్ణమి- జ్వాలాతోరణం 
-లక్ష్మీ రమణ 

కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనది ప్రశస్తమైనది . కార్తీకపూర్ణమి నాడు వృషోత్సర్జనం (ఆంబోతును విడిచిపెట్టడం ) , లక్షవత్తుల నోము నోచుకోవడం , చాతుర్మాస్య వ్రతం సమాపనం , దీపదానాలు చేయడం , కార్తీక పురాణం పఠించడం , కార్తీక వ్రతాన్ని ఆచరించడం తదితరాలు అత్యంత ఫలప్రదాయకాలు . వీటన్నింటితోపాటు , లోకక్షేమం కోసం హాలాహలాన్ని స్వీకరించిన పరమశివునికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ , జరిపే జ్వాలాతోరణం కార్తీకపౌర్ణమినాడే నిర్వహిస్తారు . విశిష్టమైన ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో మనకి క్షీరసాగర మథనం కథ చెబుతుంది .  భాగవతం వివరిస్తుంది . 

పరమేశ్వరుడు భక్త సులభుడు. బోళాశంకరుడు అనే పేరు అందుకేగా వచ్చింది . యెంత భక్త సులభుడంటే, ఆయన ఇల్లాలు , జగజ్జనని అయిన అమ్మని అనుక్షణం ఆయన చింత వేదించేంత ! సర్వమంగళనే ! హన్నన్నా ఎంతమాట! అంటారా ? పురాణాలు చూస్తే , అలాగే అనిపిస్తుంది మరి. 

భక్తితో పిలిచేవారు మానవులా , దానవులా , దేవతలా అనే భేదం ఎరుగని స్వామికదా ఆ శంకరుడు ! అందుకే గజాసురుడు , నా గర్భంలో ఉండవయ్యా అంటే, కైలాసాన్ని వదిలి , అమ్మని విడిచి ఆ రాక్షసుని గర్భవాసం చేశారు . తొమ్మిదినెలలు తల్లి కడుపులో ఉన్నందుకే శిశివు శోకంతో తపిస్తుందే, అలాంటిది పరమాత్మ ఆ రాక్షసుని గర్భంలో ఎంతటి బాధ అనుభవించారో కదా !అయినా భక్తి కోసం భరించారు . 

ఇక గజాసురుని మించిన ఘనుడు మరో అసురేంద్రుడు .  ఈయన భక్తితో భజిస్తే, బోళాశంకరులు అమ్మతోసహా దర్శనమిచ్చారు . ఆయన ఏకంగా అమ్మనే తనకిమ్మని , వివాహం చేసుకుంటానని అన్నాడు  . ఈయన అప్పుడూ అడ్డుచెప్పలా! సరేనని , అమ్మని ఇచ్చేసి వచ్చారు . ఆ అసురపురుషోత్తముడేగా రావణాసురుడు. ఇలాంటి శివయ్య కథలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే ! 

భక్తి మాత్రం చాలు . ఇంకేమీ అక్కర్లేదనేవాడేకదా పరమాత్ముడు . అదే మరి మన సాంబయ్య తత్త్వం కూడా ! అదిగో ఆ భక్తికి దాసుడయ్యే, దేవీ దేవతలెవ్వరూ చేయని సాహసానికి ఒడిగట్టారు పరమేశ్వరుడు. రాక్షసులు , దేవతలు కలిసి క్షీరసాగరాన్ని మధించారు . అప్పుడు లక్షీదేవి పుట్టింది - విష్ణుమూర్తి వరించారు. ఐరావతం వచ్చింది - ఇంద్రుడు తీసుకున్నాడు . ఇంకా ఎన్నో సంపదలు వచ్చాయి - అన్ని తలా ఒక్కరూ పంచుకున్నారు .  

ఈ క్రమంలో అమృతానికి ముందుగా హాలాహలం పుట్టింది . అది సామాన్యమైనది కాదు . మంచికి ముందొచ్చే ఉపద్రవంలాంటిది. వెలుగుకి ముందర ఆవరించిన తిమిరం అది . లోకాలన్నీ భస్మం చేయగల కాలకూటమది .  దాని ధాటికి పక్కకు తప్పుకునేవారేగానీ , స్వీకరించి భరించగలవారు ఒక్కరూ కనిపించలేదు దేవతలకీ, రాక్షసులకీ కూడా ! అప్పుడిక ఈశ్వరుడే దిక్కని అందరూ ఆయనని శరణు వేడారు . 

జగత్కళ్యాణమేగా ఈశ్వరుడు కోరేది ! పైగా భక్తిగా అడిగారాయె ! వెంటనే ఆయన ఆ హాలాహలాన్ని తన తాగనారంభించాడు . అమ్మ కలత పడింది. కానీ వారించలేదు.  ఆ హాలాహలం శివుని కంఠాన్ని దాటకుండా ఉండేట్టయితే, నేను ముమ్మారు జ్వాలా తోరణం క్రింది నుండీ వెళతానని అగ్నిదేవుని మొక్కుకుందట జగజ్జనని. గరళం , గళం దాటకుండా ఆగిపోయినందుకు అమ్మే స్వయంగా ఈ జ్వాలాతోరణం కింది నుండీ వెళ్లిందనీ అప్పటినుండి ఇది ఆచరించడం ఆనవాయితీగా మారిందని ఐతిహ్యం. పోతనామాత్యులవారు ఈ దృశ్యాన్ని భాగవతంలో ఇలా వర్ణిస్తారు :

“మ్రింగెడివాడు విభుండని 
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మాది నమ్మినదో”

అంటూ సర్వమంగళ తన మాంగల్యాన్ని ఎంతనమ్మిందో కదా , భర్తనే , ప్రజలహితంకోసం గరళాన్ని మింగమన్నది అని తెలుగు నుడికారాన్ని జోడించి చమత్కరిస్తారు . 

మరో కథ కూడా చెబుతారు. లోకకంటకులైన త్రిపురాసురులను సంహరించి కైలాసానికి విజయం చేసిన పరమేశ్వరునికి జ్వాలా తోరణంతో స్వాగతం చెప్పిందట పార్వతీ మాత . స్వామికి తగిలిన దిష్టి ఈ రకంగా అమ్మవారు తొలగించిందట. ఇక అప్పటినుండి ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించిన కార్తీక పౌర్ణమి పర్వదినాన జ్వాలా తోరణం నిర్వహించడం శైవ క్షేత్రాలలో ఆనవాయితీగా మారిందట. 

 ఈ సంప్రదాయం కాస్త వైవిధ్యంగా , ప్రమాద భరితంగా అనిపించినా , చాలా గొప్పవేడుక ఇది . నూనె నిండిన నూలువస్త్రాలను గానీ , ఎండుగడ్డిని గానీ తోరణంగా అమర్చిన కట్టెకి చుడతారు . అలా తయారైన తోరణాన్ని జ్వలింపజేసి , దాని క్రిందనుండీ, శివపార్వతులని పల్లకీలో కూర్చుండబెట్టి , ముమ్మార్లు అటూ ఇటూ తిప్పుతారు . ఈ తోరణానికి కట్టిన గడ్డి పూర్తిగా మసిగా మారకుండానే , ఆ మంటలు ఆర్పేసి , ఆ పరకల్ని పశువుల మేతలో కలిపి వాటికి అందిస్తారు రైతులు . ఈ జ్వాలా తోరణ భస్మాన్ని ధరించడం వల్ల  సర్వపాపాలు నశిస్తాయని, అపమృత్యు భయం ఉండదని భక్తుల విశ్వాసం. 

శ్రీశైల క్షేత్రంలో కూడా ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా చేస్తారు . చూసేందుకు రెండుకళ్ళూ చాలవన్న చందంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా ఈ జ్యోతిర్లింగేశ్వర దర్శనం చేస్తుంటారు . అయినా అమ్మ సర్వమంగళాదేవి మాంగల్యాన్నే కాపాడిన ఘనతగల ఈ జ్వాలా తోరణాన్ని , ఈ కార్తీకపౌర్ణమికి మనం కూడా దర్శిద్దామా !!

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda