Online Puja Services

తిరుగులేని అనుగ్రహమిచ్చే మందేశ్వరుడు .

18.224.37.68

వెనక్కి తిరిగి చూడకుండా పూజిస్తే, తిరుగులేని అనుగ్రహమిచ్చే మందేశ్వరుడు . 
- లక్ష్మి రమణ 

శనీశ్వరుడికి మందుడని పేరు . ఎందుకంటె ఆయన చాలా నెమ్మదిగా కదులుతుంటాడు. ఆచీ తూచీ ధర్మబద్ధంగా అడుగులు వేస్తుంటారు. కానీ జాతకంలో శని దోషం ఉన్నప్పుడు ఆ జీవి పడే బాధలు సామాన్యంగా ఉండవు.  అవి మనం చేసుకున్న కర్మల ఫలితాలే . అయినా కూడా వాటిని భరించడం అంత సామాన్యమైన విషయం కాదు . శని ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్నో పరిహారాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉంటారు . అటువంటి వాటిల్లో ఒకటి మందేశ్వరస్వామి దర్శనం, పూజ . ఆ క్షేత్రాన్ని మనం కూడా దర్శించి తరిద్దాం రండి . 

మందేశ్వరుడు శనీశ్వరుడు స్థాపించిన శివలింగం . నిజానికి ఆయన పేరు సోమేశ్వరుడు.  శనిచేత స్థాపించబడ్డారు కాబట్టి ఆయన శనీశ్వరుడు , మందేశ్వరుడు అనే పేర పూజలు అందుకుంటూ ఉన్నారు . ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలో ఉన్న మందపల్లి లో ఉంది.  మందపల్లి శనీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే, తైలంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహించి, నల్లటి వస్త్రాన్ని దానం చేస్తే శనిబాధల నుండీ విముక్తిని పొందుతారని స్వయంగా శనీశ్వరుడే అనుగ్రహించారని ప్రతీతి . 

పూర్వకాలం అగస్త్య మహర్షి దక్షిణ దిక్కున సత్రయాగం చేయడానికి సంకల్పించారు. ఆ దీక్షా దక్షులై ఆయన ఉండగా కైటభుడనే రాక్షసుని కొడుకులు, ధర్మకంటకులైన అశ్వర్థుడు, పిప్పలుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ యాగాన్ని భగ్నం చేసి పొట్టనింపుకొనే యత్నాలు చేయడం మొదలుపెట్టారు .  అక్కడి మునులను తాపసులను హింసిస్తూ ఉన్నారు. వారిలో అశ్వర్థుడు రావిచెట్టు రూపంలోనూ, పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోనూ  కాచుకుని ఉన్నారు. రావిచెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడు, ఆ వృక్షం నీడలో విశాంతి తీసుకునే వారిని, బ్రాహ్మణులని రోజు తినేస్తూ ఉండేవాడు. పిప్పలుడు సామవేదం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులను తినేసేవాడు.  ఈ విధంగా రోజురోజుకి బ్రాహ్మణుల సంఖ్య క్షీణించిపోతోంది. 

 దీన్ని గమనించినటువంటి మహర్షులు గౌతమి తీరంలో తపస్సు ఆచరిస్తున్నటువంటి సూర్యపుత్రుడైన శనికి ఈ ఘోరమైన రాక్షస కృత్యాలను గురించి చెప్పి, తమను రక్షించమని వేడుకున్నారు.  అప్పుడు శనీశ్వరుడు “ఓ ఋషులారా! నేను ఇప్పుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను. తపోదీక్షలో ఉన్న నేను రాక్షస సంహారం చేయలేను .  నా తపస్సు పూర్తి కాగానే వారిని వధిస్తాను” అని మాట ఇచ్చారు.  దానికి మహర్షులు “మేమందరము కూడా మా తపస్శక్తిని మీకు ధారపోస్తాము. దానివల్ల మీ తపస్సు సంపన్నం అవుతుంది .  దయచేసి వెంటనే ఆ రాక్షసుల బారి నుండి మాకు విముక్తిని కలిగించండి” అని శనీశ్వరుని వేడుకున్నారు. 

 అప్పుడు శనీశ్వరులు బ్రాహ్మణ వేషాన్ని దాల్చి, వృక్షరూపంలో ఉన్న అశ్వర్థుని వద్దకు వెళ్లి ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు.  అప్పుడు అశ్వర్థుడు ఈ శనిని కూడా మామూలు బ్రాహ్మణుడే అనుకుని అలవాటు చొప్పున మింగి వేశాడు.  అప్పుడు శనీశ్వరుడు ఆ రాక్షసుని దేహంలో ప్రవేశించి కడుపులో ఉన్న పేగులను తెంపి వేశాడు. వెంటనే అతడు మరణించాడు. 

ఆ తరువాత రెండవ రాక్షసుడైన పిప్పలుడి వద్దకు వెళ్లి తాను సామవేదాన్ని అభ్యసించడానికి వచ్చిన బ్రాహ్మణునని వినయంగా చెప్పాడు. అప్పుడు పిప్పలుడు ఈ సూర్యపుత్రుడైన శనిని కూడా అలవాటు ప్రకారంగా నోట్లో వేసుకొని మింగేశాడు. అప్పుడు శని ఆ రాక్షసుడి పేగులు కూడా తెంచి బయటకు వచ్చాడు. ఆ విధంగా ఆ ఇద్దరు రాక్షసులను సంహరించారు శని.  అయితే దానివల్ల ఆయనకి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది.  ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడడానికి మందపల్లిలో ఉన్నటువంటి ఈశ్వరుని ప్రతిష్ట చేశారని స్థల పురాణం. 

 ఎవరైతే నియమనిష్ఠలతో అశ్వద్ధవృక్షానికి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ కోరికలు అన్నీ తీరుతాయని, అటువంటి వారికి శని పీడ కలగదని శనీశ్వరుడు వరాన్ని ప్రసాదించారు . ఈ అశ్వద్ధ తీర్థముగా ప్రసిద్ధికెక్కిన మందేశ్వరంలోని  శనీశ్వర తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారికి సమస్త కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని ఆయన అనుగ్రహించారు. అంతే కాకుండా  శనివారం రోజున అశ్వద్ధ ప్రదక్షిణాలు చేసిన వారిని గ్రహ పీడలు పీడించవు. ఈ తీర్థంలో స్నానం చేసి చేసినట్లయితే బంగారాన్ని దానం చేసినటువంటి ఫలం లభిస్తుంది.  అని శనీశ్వరుడు గొప్ప తీర్థాలతో ఈ ప్రదేశం అలరారేలా అనుగ్రహించారు . అప్పటి నుంచి ఈ ప్రదేశంలో అశ్వర్థ తీర్థము, పిప్పల తీర్థము, సానుగ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్విక తీర్థము, యజ్ఞంక తీర్థము, మొదలైన 148 తీర్ధాలు అనేకమంది ఋషుల చేత, దేవతల చేత కల్పించబడి ప్రసిద్ధి చెందాయి. 

 ఇక్కడ శనీశ్వరుడు ప్రతిష్టించిన మహేశ్వరునికి పక్కనే సప్తమాతృకలు ప్రతిష్ట చేసినటువంటి పార్వతీదేవి దర్శనం ఇస్తారు. ఈ  ఈశ్వరుడికి బ్రహ్మేశ్వరుడు అనే పేరు కూడా ఉంది.  పక్కనే అష్టమహా నాగులలో ఒకరైనటువంటి కర్కోటకుడు ప్రతిష్టించిన నాగేశ్వరుడు కొలువయ్యారు .  ఆ పక్కనే సప్త మహర్షులలో ఒకరైన గౌతమ మహర్షి చేత ప్రతిష్టించబడిన వేణుగోపాల స్వామి మనోహరంగా దర్శనమిస్తారు. మొత్తం మీద ఒకే ప్రాకారంలో వరుసగా ఐదు దేవాలయాలను మనము దర్శించుకోవచ్చు. 

 ఈ ఆలయాన్ని దర్శించినటువంటి వారికి సమస్త కోరికలు తీరడమే కాకుండా అంత కాలంలో మోక్షము పొందగలరని ప్రతీతి.  శని త్రయోదశి, మహాశివరాత్రి, అమావాస్య శనివారం రోజున ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. ఈ శనీశ్వర దర్శనం, ఆరాధన చాలా గొప్ప సంతృప్తిని, ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం . ప్రత్యేకించి  కోర్టు కేసులు, శత్రుబాధలు, రోగాలు, రుణ బాధల నుంచి భక్తులు విముక్తి పొందుతారని ప్రతీతి. 

ప్రధానంగా ఈ ఆలయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది .  ఆలయంలో దర్శనం పూజ అనంతరం బయటకు వెళుతూ వెనక్కి తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే, శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని ఇక్కడ పూజారులు భక్తుల్ని పదేపదే హెచ్చరిస్తూ ఉంటారు. 

 ఈ మందేశ్వర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని  ముఖ్యపట్టణాలైన  కాకినాడ పట్టణానికి 75 కిలోమీటర్లు అమలాపురానికి 31 కిలోమీటర్లు విజయవాడ నుంచి 140 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . ఈ ప్రాంతాలకి రైలు సౌకర్యం , బస్సు సౌకర్యం కూడా ఉంది . దగ్గరలోని విమానాశ్రయం రాజమెండ్రి. 

శుభం . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi