Online Puja Services

భారత దేశంలో వున్న ప్రసిద్ధ సూర్య దేవాలయాలు

18.191.171.235

భారత దేశంలో వున్న ప్రసిద్ధ సూర్య దేవాలయాలు దర్శిద్దాం రండి . 
- లక్ష్మి రమణ 

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కరా ! అని ఆ సూర్యనారాయణునికి ప్రతిరోజూ నమస్కారం చేసుకోమని చెబుతున్నాయి మన శాస్త్రాలు . అలా నమస్కారం చేసుకోవడం వలన సర్వదేవతలకీ నమస్కారం చేసినట్టవుతుంది . ఆయన నుండీ వెలువడే దివ్యమైన కిరణాలవలన మనలోని రోగాలు అంతరించి పోతాయి. అదీ సూర్యోరాధనలోని విశిష్టమైన లక్షణం . పైగా సూర్యుడు ప్రత్యక్షంగా మనకళ్ళకి కనిపించే దేవుడు కనుక ఆయన్ని ఆరాధించడం మరింత సులువు. అయినా ఆకాశంలో ఉన్న ఆ స్వామిని చూడడం మాత్రం అంత సులువైన విషయంకాదు. తీక్షణంగా ఉన్నప్పుడు చూశామంటే, కళ్ళు దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు . అందుకే ఆ భగవానుడికి ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని తనివితీరా చూసి, అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం . అలా మన దేశంలో సూర్యునికి అంకితం అయిన ఆలయాల వివరాలు ఇక్కడ మీకోసం ! 

1.దక్షిణార్కా ఆలయం
బీహార్లోని , గయలో ఉన్న ఈ  ఆలయం అత్యంత ప్రాచీనమైనది. విష్ణుపాద ఆలయానికి సమీపాన తూర్పు ముఖంగా ఈ ఆలయం ఉంటుంది . ఈ ఆలయంలో అనేకమైన సూర్యనారాయణమూర్తి విగ్రహాలు వున్నాయి. ఇక్కడ వున్న సూర్యభగవానుడు , గుండెకు కవచాన్ని ధరించి సుందరంగా దర్శనమిస్తాడు. ఆలయ తూర్పు దిశలో సూర్య గుండ తీర్ధం కూడా ఉంటుంది . 

2.బ్రహ్మన్యదేవ్ ఆలయం
మధ్యప్రదేశ్ లోని  ఝాన్సీకి సమీపములో ఉన్న గ్రామం ఉణవ్. ఈ ప్రాంతంలో బ్రహ్మన్యదేవ్ గా పూజలు అందుకుంటున్నాడు సూర్యభగవానుడు.   మధ్యప్రదేశ్‌లోని ఈ ఆలయ  నిర్మాణ శైలి చాలా  ప్రత్యేకమైనది. సూర్యభగవానుడు నల్లటి పలకలతో కప్పబడిన ఇటుక వేదికపై నిలబడి పరమ సౌందర్య మూర్తిగా దర్శనమిస్తారు . సూర్యుని 21 దశలను సూచించే ఇరవై ఒక్క త్రిభుజాలు మందిరంలో చెక్కబడి ఉంటాయి. ఇక్కడ ఆదివారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో భక్తులు చర్మవ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని స్థానికుల నమ్మకం. ప్రత్యేకించి కుష్టువ్యాధి వారు, దృష్టి లోపాలు వున్నవారు ఈ  ఆలయంలోని భాస్కరుని ప్రార్ధించి  ఆరోగ్యాన్ని  పొందుతున్నారు.

3.సూర్యబహార్ ఆలయం 
అస్సాం రాష్ట్రంలోని గోల్పారా సమీపములో ఉన్న  సూర్యబహార్ కొండ మెట్ట మీద నిర్మించబడినది ఈ ఆలయం. వలయాకారంలోని రాళ్ళవేదిక మీద ద్వాదశ సూర్యులు దర్శనమిస్తుంటారు. మధ్యలో సూర్య భగవానుని తండ్రి కశ్యప ప్రజాపతి  నెలకొని ఉంటారు .

కశ్యప ప్రజాపతి ,అదితి దంపతుల పుత్రుడే సూర్యభగవానుడు. ఆది భగవానుడు . ఈ దంపతులకు యిక్కడ విశిష్టమైన మర్యాదనిస్తారు. కాలిక పురాణంలో, సూర్యునిగిరి శిఖరాన్ని గురించి వివరించబడినది. అది ఈ   గిరే నని విశ్వాసం . ఈ  శిఖరానికి అడుగున ఒక లక్ష శివలింగాలు వుండేవట! కాల క్రమంలో కొన్ని మరుగైనా ఇప్పటికీ ఇక్కడి లోయలో అనేక శివలింగాలు కనిపిస్తాయి . 

4.సూర్యనారాయణ మూర్తి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో ఉంది  ఈ సూర్యనారాయణ మూర్తి దేవాలయం. 5 అడుగుల ఎత్తుతో, చేతిలో పద్మాన్ని ధరించి, ఉషా, ఛాయాదేవి సమేతుడై సూర్య భగవానుడు ఇక్కడ దర్శనమిస్తుంటారు .  ఈ స్వామి కి పద్మపాణి అనే పేరు వున్నది.  చేతిలోని పద్మం జ్ఞానాన్నిసంకేతిస్తుంది .

5.మోదేరా సూర్యభగవానునిఆలయం (గుజరాత్)

పశ్చిమాన అరేబియా సముద్రానికి సమీపంలో గొప్ప నిర్మాణ కౌశలంతో నెలకొని ఉన్న అద్భుతమైన సూర్యదేవాలయం ఉంది . అదే మొధేరా సూర్యదేవాలయం. ఈ ఆలయమే ఒక ఊరంత ఉంటుంది. అంతటి విశాలమైన ప్రాంగణంలో కాలానికి సంబంధించిన ఎన్నో అద్భుతమేళవింపులతో నిర్మించిన ఈ ఆలయాన్ని చూసి తరించాల్సిందేగానీ వర్ణించతరంకాదు . దాదాపు వెయ్యేళ్ళక్రితం కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది ఈ  సూర్యనారాయణ మూర్తి ఆలయం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో సూర్యుని కోసం ఒక యజ్ఞం చేశారని స్థానిక గాథ . ఉత్తరాయణ పుణ్యకాలం మొదటి రోజున సూర్యుని విగ్రహం మీద సూర్య కిరణాలు పడతాయి. అప్పుడు మండప స్ధంభాల మీద ఉన్న సూర్యభగవానుని శిల్పాలు వేరు వేరు భంగిమలలో దర్శనమిస్తాయి. ఇక్కడే ప్రతి సంవత్సరంజనవరి మాసంలో ".మోద్రా నాట్య ఉత్సవం" ఘనంగా జరుపుతారు. 

#suryanarayana #surya #modhera #arasavelli #temples

Tags: Suryanarayana, Arasavelli, Modhera, Surya, 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda