18 మెట్లుండే ‘పదునెట్టాంపడి’ రహస్యం ఏమిటి?

100.24.115.215

18 మెట్లుండే  ‘పదునెట్టాంపడి’ రహస్యం ఏమిటి? 
-లక్ష్మీ రమణ 

కార్తీకమాసంలో ఒకవైపు శివ, కేశవా , ఆరాధనలు, దీపాల తోరణాలు కనువిందు చేస్తుంటే, నియమాలే తోరణంగా , అయ్యప్పమాల ధరించి కఠోరని యమపాలనతో అపరఅయ్యప్పలు చేసే శరణు ఘోష వీనుల విందు చేస్తుంటుంది .  దేశం నలుమూలనుండీ అయ్యప్ప మాల ధరించేవారు లెక్కకి మిక్కిలిగానే ఉన్నా, దక్షిణభారతంలో ఈ దీక్షని చేపట్టేవారు సంఖ్య కాస్త ఎక్కువ.  శరణమయ్యప్ప అంటే చాలు , కరుణించి కాపాడి జ్ఞానభిక్షపెట్టే , ఆ ధర్మశాస్తాని చేరుకోవాలంటే, పద్దెనిమిట్లుండే ‘పదునెట్టాంపడిని’ అధిగమించాలి . అసలీ పదునెట్టాంపడి రహస్యం ఏమిటి? 

ఒకటవమెట్టు - శరణమయ్యప్ప , రెండవమెట్టు - శరణమయ్యప్ప అంటూ 18 మెట్లు ఇరుముడితో ఎక్కి , తమ్ముతెచ్చిన నెయ్యిని ఆ స్వామికి అభిషేకించి , తాముచేచ్చిన పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదిస్తారు . ఆ ధర్మశాస్త తమని రక్షించి ఆ విధంగా జ్ఞాన మార్గాన్ని చూపుతారని అయ్యప్ప భక్తుల విశ్వాసం . అయ్యప్ప అధివసించిన సింహాసనానికున్న ఆ 18 మెట్లు కూడా అంధకారాన్ని నిరోధించి జ్ఞానమార్గాన్ని పట్టవలసిన జీవునికి అవసరమైన పాఠాలు .  

41 రోజుల కఠోర దీక్ష . వ్యయప్రయాసలతో.. ఇరుముడి ధ‌రించి అధిగమించే 18 కొండలు. అప్పుడు దర్శనమిస్తాడు శబరిగిరిపై కొలువైన అయ్యప్ప.  స్వామీ సన్నిధికి చేరాలంటే, మళ్ళీ 18 మెట్లు ఎక్కాలి .  ఇదే ‘పదునెట్టాంపడి’. 41 రోజుల పాటు నియ‌మ నిష్టల‌తో క‌ఠోర దీక్ష చేప‌ట్టిన ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ, ‘ స్వామియేయ్ శరణమయ్యప్ప ‘ అని శరణు ఘోష చేస్తూ అయ్యప్ప చెంతకి  భక్తులు చేరుకుంటారు . అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

మెట్టుమెట్టుకో విశిష్టత:

► స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు(5) మెట్లు మన  పంచేంద్రియాలకు ప్రతీకలు . కళ్లు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. జ్ఞానాన్ని ఆశించే వారు ముందర వీటి ప్రభావాన్ని జయించాలి . 

► తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది. ఇవి కూడా జ్ఞానజిజ్ఞాసువులకు అవరోధకాలే. సాత్వికమైన ప్రవర్తనని వీటిని అధిగమించినప్పుడు మాత్రమే అలవర్చుకోగలం .  

► తర్వాత మూడు (3) మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. పరబ్రహ్మ త్రిగుణాతీతుడని , ఆ గుణాతీతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోమనే సందేశం ఈ మెట్లని అధిగమించడంలో దాగుంది . 

► ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య.. అంటే జ్ఞాన , అజ్ఞానం అనేటటువంటివి . శరీరమే శాశ్వతం అనుకోని, ప్రాపంచికమైన మోహబంధాలలో ఉండాలనుకొనేవాడు అజ్ఞాని . దీన్ని అధిగమిస్తే, పరమాత్మలో సంలీనమైన ఆత్మజ్ఞాన జ్యోతి. ఆ పరంధాముడైన శివ కేశవా స్వరూపుడే తామన్న జ్ఞానం , సత్యం . అది కదా చిట్టచివరి మెట్టు . శరణమయ్యప్ప !!

18 మెట్లలో ఆత్మా జ్ఞానాన్ని నిక్షేపించారు ఆ భగవానుడైన అయ్యప్ప . ఇదే తత్వాన్ని తెలియజేస్తూ, ఆస్వామి మాల ధరించినవారు, ప్రతి జీవిలోనూ, చెట్టులోనూ పుట్టలోనూ తననే చూడాలని, ‘అయ్యప్ప’ అనే సంబోధించాలనీ చెప్పడంలోనూ మనకి దర్శనమిస్తుంది .  క్రియతో తనవైపు నడిపిస్తున్న తండ్రిలా, అనుభవంలో బిడ్డకి నేర్పించే తల్లిలా ఆ అయ్యప్ప తన శరణు జొచ్చిన భక్తులకి జ్ఞాన మార్గం చూపిస్తారు  .     

 ఎవరైతే ఈ 18 మెట్లను భక్తిభావంతో, గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తుల ప్రగాఢ న‌మ్మకం. భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ దిగివస్తారు.

18 మెట్లకు సంబంధించి ప్రాచుర్యంలో మ‌రో క‌థ :

ఈ 18 మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చకముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు. 
 
ఇక జ్ఞాన విషయంగా మరోసారి స్వామివారి విశేషతని పరిశీలిస్తే, ఆ  ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది. 18 మెట్లు అష్టాదశ (18)పురాణాలను సూచిస్తాయని చెబుతారు . ఇక , మానధర్మానికి భూమికలైన  రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో  ఒక్కోదానిలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలే  ఉన్నాయి. 

ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి , అయ్యప్పకీ భేదం ఉండదని శ్రుతివచనం .
 
స్వామియే శరణమయ్యప్ప !!

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna