Online Puja Services

శుభాలు అనుగ్రహించే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం

18.219.86.155

కష్టాలు తొలగించి, శుభాలు అనుగ్రహించే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం . 
- లక్ష్మి రమణ 

సుబ్రహ్మణ్యుడు రుద్రసంభవుడు . పరమాత్మకి పుత్రుడు. అందుకే ఆయనకొక్కడికే కుమారుడు అనే పేరు సార్థకమై చెల్లింది. కుమారుని జననం తారకాసుర సంహారం కోసమే జరిగిందని స్కాందపురాణం తదితర పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్యుని విశిష్టత ఏమిటంటే, ఎవరైనా సరే, ఈ క్షేత్రంలో స్వామిని దర్శిస్తే, ఆ సౌందర్యానికి బద్దులైపోతారు. తన్మయులై అలా ఆ స్వామిని చూస్తూ ఉండిపోతారు . అంతటి మనోహరమైన మూర్తి . ఈయన అహంకారాన్ని నాశనం చేసేస్తారు. సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. ఈ క్షేత్ర దర్శనం అహంకారంతో పాటు అజ్ఞానాన్ని దూరం చేసేస్తుంది. పాపాలని హరించి , చక్కని శుభాలను అనుగ్రహిస్తుంది . 

కుమారస్వామి శివుని గురించి తపస్సు చేసిన క్షేత్రం :    

తారకాసురుడు, సూరపద్ముడు ఇద్దరూ రాక్షసులే . వీరి అరాచకాలని అంతం చేయడానికే కుమార సంభవం జరిగింది.  అమృతతులయమైన ఆ కథని ఇప్పటికే మనం ఈ వేదికలో అనేక సార్లు చెప్పుకున్నాం కూడా ! అయితే, పేరుకి తగ్గట్టు పరాక్రమవంతులు, పరమ శివ భక్తులు కూడా అయిన  ఆ రాక్షసులని వధించేందుకు అవసరమైన శక్తిని సమకూర్చుకునేందుకు కుమారస్వామి పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన క్షేత్రం తమిళనాడులోని తిరుచెందూరు. 

తరించిపోయిన సూరపద్ముడు : 

పరమేశ్వర కటాక్షంతో యుద్ధం ఆరంభమయ్యింది. సూరపద్ముడు మహా మామిడి చెట్టు అవతారమెత్తి కుమారస్వామి మీదికి వచ్చాడు . కుమారుడు ఆ రాక్షసుణ్ణి రెండుగా చీల్చివేశాడు . ఆ రెండుభాగాలూ ఒకటి ఆ స్వామీ వాహనమైన నెమలిగానూ , రెండవ భాగము ఆయన ధ్వజమైన కుక్కుటము (కోడిపుంజు) గానూ మారిపోయాయి.  వాటిని తన సేవకు అనుగ్రహించారు సుబ్రహ్మణ్యుడు. ఆ విధంగా అహంకారం అనే రాక్షసుడు మరణించి , పరమాత్మ సేవలో దివ్యత్వాన్ని పొందాడు .  

కుమార ప్రతిష్టిత లింగాలు : 

ఆవిధంగా కుమారుడు సంహరించింది రాక్షసుణ్ణే అయినా, ఆ రాక్షసుడు శివ భక్తుడు కావడం వలన శివభక్తుని సంహరించిన పాపం కుమారునికి సంక్రమించింది .  ఆ దోష పరిహారం కోసం ఆయన ఇక్కడ మూడు శివలింగాలని ప్రతిష్ట చేశారని స్థలపురాణం చెబుతుంది . ఈ లింగాలని దర్శించడం వలన జన్మజన్మల పాపాలూ తొలగిపోతాయని విశ్వాసం. 

రోగనాశనమైన కోనేరు : 

ఆలయానికి  ముందర భాగంలో ఒక చక్కని కోనేరు ఉంటుంది . ఈ కొన్నిటిని తన తరఫున పోరాడుతున్న గణాల దాహాన్ని తీర్చడం కోసం స్వయంగా సుబ్రహ్మణ్యుడే తన ఈటెతో భూమిని చీల్చి సృష్టించారని స్థానిక విశ్వాసం. ఇక్కడి కోనేటిలో నీళ్లు  చాలా తీయగా ఉంటాయి.  అంతే  కాకుండా ఇందులోని నీరు  దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా నయం చేయగలిగిన ఔషధీయ గుణాలతో నిండి ఉందని చెబుతారు . దానికోసం అనేకమంది భక్తులు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు . అంగ ప్రదక్షిణాలు చేయడం ఇక్కడ ఒక సంప్రదాయంగా వస్తోంది .  

విభూతి : 

షణ్ముఖుడు తన ఆరుముఖాలతో , వల్లీ, దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. ఇది నిస్సందేహంగా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. ‎సుబ్రహ్మణ్య‬ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది. 

సముద్రతీరంలో కొలువైన కార్తికేయుడు :  

ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి‬ నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర తీరంలో ఇంతటి ‎శక్తివంతమైన , సుందరమైన దివ్య క్షేత్రం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు . సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరములో కొండ మీద కొలువై ఉన్నాడు. 

శృతి విశేషం : 

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ‪ఆదిశంకరాచార్యుల‬ వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు ‪సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగ స్తోత్రం  చేశారు. ఈ ‪భుజంగ‬ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు వదిలిపోతాయి .  అటువంటి వాటిల్లో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి. ఈ దోషాలకి కారణమైన పనులని మనం స్వయంగా చేసి ఉండకపోవచ్చు . కానీ , మన వంశంలోని వారెవరో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ దోషాలకి కారణం కావొచ్చు .  ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి.  అటువంటి ‪దోషములను‬ కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య ‪భుజంగము‬ ద్వారా తెలియజేశారు.(భుజంగ ప్రయాత స్తోత్రం - శ్రీ ఆదిశంకరాచార్య విరచితం).  

తమిళనాడులోని ప్రధానమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుచెందూర్ ఒకటి . ఇక్కడ పంచ శివలింగాలు కూడా ఉంటాయి . అద్భుతమైన ఈక్షేత్రాన్ని ఈ సారి మీ యాత్రలో భాగంగా తప్పక దర్శించండి .  శ్రీ సుబ్రహ్మణ్యానుగ్రహ సిద్ధిరస్తు !! శుభం !! 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore