Online Puja Services

సుబ్రహ్మణ్య ఆరాధన - రాహు కేతు దోష నివృత్తికి మార్గం .

3.145.163.58

సుబ్రహ్మణ్య ఆరాధన - రాహు కేతు దోష నివృత్తికి మార్గం .
- లక్ష్మి రమణ 

సుబ్రహ్మణ్యుడు సర్పస్వరూపుడైన స్వామి. సర్పస్వరూపులైన రాహు , కేతు గ్రహాలకి అధినాయకుడు. ఈ గ్రహాలు సుబ్రహ్మణ్యస్వామి అధీనంలో ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఆయన ఆరాధన వలన దుష్టగ్రహాల పీడ నుండీ విముక్తి లభిస్తుంది. అంతేనా, ఆయన  సంతాన ప్రదాయకుడు కూడా.

కేతువు :

కేతువు బూడిద (బూడిద) వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువు కేతువు తల నరికి, ఆ స్థానము లో పాము తలను అతనికి ప్రసాదించారు . అప్పటి నుండి పాముతలతో మనిషి శరీరంతో  కేతువుగా పేరొందాడు .  విష్ణు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు. 

రాహువు : 

రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి, మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణుమూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేశారు.  ఆ మొండానికి  పాము శరీరం అతికించుకొని రాహువుగా పేరొందాడు. అప్పుడు  విష్ణుమూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కథనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.

ఈ విధంగా రాహువు, కేతువు ఇద్దరూ కూడా సర్పశరీరులయ్యారు .  ఈ రెండు గ్రహాల ప్రభావం  జాతకునికి అనేక దుష్ట పరిణామాలు ఎదురవుతాయి . అటువంటి వాటిని ఎదుర్కోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సాయపడతాయి . సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా ఉపయోగపడుతుంది. 

ప్రత్యేకించి మంగళవారం, అందులోనూ శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఇలా ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చండ్ర సమిధలు నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరించాలి. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది.

కుటుంబంలో వివాహం కావలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ తరచుగా కుటుంబ వ్యక్తుల పైన అత్యధిక స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా వారికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది.  అది కుజదోష ప్రభావం. వివాహం ఆలస్యం అవుతుందా లేదా వారి కోపం తారా స్థాయిలో ఉన్నప్పటికీ వారి జాతకం పరిశీలించుకుని తగిన పరిహారాలు చేసుకున్న ఎడల త్వరగా వివాహం జరిగి వారి జీవితం సుఖమయం అయ్యే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్ !! 

 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore