Online Puja Services

సర్వశతృ వినాశనం - శ్రీ నీలసరస్వతీ ఉపాసనం

18.116.62.45

సర్వశతృ వినాశనం - శ్రీ నీలసరస్వతీ ఉపాసనం . 
-లక్ష్మీ రమణ . 

విద్యకి మరో పేరు జ్ఞానం . ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే మాత సరస్వతి . పూజా విశేషాలు, విధానాలూ విభిన్నంగా ఉండొచ్చు . కానీ జ్ఞానానికి అధినేత్రి ఆ దేవే . ఒక గమ్యాన్ని  చేరుకొనేందుకు అనేకమైన దారులుంటాయి . కొన్ని దుర్గమంగా ఉన్నా , త్వరగా ఆ జ్ఞానాంబిక సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాయి.  ఇంకొన్ని సుగమంగా ఉండి , సాత్వికమైన విధానంలో అమ్మ ఒడిని చేరుస్తాయి . చూసేవారి హృదయంలో , అర్థం చేసుకొనే మనస్సులో , విషయాన్ని గురించిన పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండడంలోనే ఉంది - అసలు కిటుకంతా ! ఈ రోజు మనం నీల సరస్వతి గురించి చదువుకుందాం . 

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ!

భావము:
భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ! అంటూ తెల్లని సుందరమైన రూపంలో ఉన్న భారతీదేవిని స్మరించి, ఆమె దర్శనానికి పరితపిస్తాడు సరస్వతీ పుత్రుడైన బమ్మెర పోతన భాగవతంలో . 

కానీ , నీలవర్ణంలో కూడా  సరస్వతీదేవి స్వరూపాన్ని వామాచారా విధానంలో పూజిస్తారు . దశమహావిద్యలలో రెండవరూపమైన తారకి ఈమె విశేష రూపంగా చెప్పబడింది . ‘ఏకజట , ఉగ్రతార , మహాగ్రతార , నీల , నీల సరస్వతి మొదలయినవన్నీ తార యొక్క స్వరూపాంతరాలే అంటుంది నీల సరస్వతీ తంత్రం’ . నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. ఏరూపంలో ఆరాధించినా , ఏ విధానంలో పూజించినా అమ్మ వాక్కుకి అధిదేవతే. 


ప్రకృతికి గల అనేక రూపాలలో అత్యంత మనోహరమైనది నీల రూపము . కలియుగములో సర్వ తంత్రములలోనూ ఉత్తమమైనది మహాతంత్రమైన నీల తంత్రము . బ్రహ్మాదులు, సూర్య చంద్రులు, అగ్ని వరుణులు, కుబేర దత్తాత్రేయ , దూర్వాస, వశిష్ఠులు , సర్వ దేవతలూ ఈదేవిని ఆరాధించారు . ఈ దేవిని వామాచార విధానంలోనే అర్చించాలని ఈ గ్రంథం చెబుతుంది . పూజించేది అమ్మనే అయినప్పుడు, అది ఏ విధానమైతే, ఏమిటి . కాకపొతే, ఇది కొంచెం దక్షిణాచార విధానాన్ని అనుసరించే సాత్విక పూజావలంబకులకి విరుద్ధంగా ఉంటుంది . కానీ అమ్మని చేరుకునేందుకు అదో విధానం అంతే . ఆంతర్యం తెలిసి , అంతరార్థం తెలుసుకుంటే, అది ఒక దైవిక తంత్రం . కాకపొతే, భయంకర నరకం . 

అయితే, బమ్మెర వారి వర్ణననకి పూర్తి విరుద్ధంగా సాక్షాత్కరిస్తుంది నీలసరస్వతీ స్వరూపం . నీలసరస్వతీ స్తోత్రంలో అమ్మవారిని ‘ఘోరరూపే మహారావే , సర్వశత్రుక్షయంకరీ’ అని వర్ణించడాన్ని గమనిచొచ్చు. అదే సమయంలో ఆమె భక్తులకి వరదాయిని అని, శత్రువులని దునిమి రక్షించే శరణాగతవత్సల అని తెలియవస్తుంది . సృష్టి స్వరూపంగా ఈ దేవిని అర్చిస్తారు సాధకులు .ఇంకా ‘బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్’ అని జ్ఞాన భిక్షని అర్థించడం కూడా ఈ స్తోత్రంలో గమనించవచ్చు .  అందువల్ల ఈ అమ్మ ఆ జ్ఞానాంబికే ! సందేహం లేదు .  ఆ నీల సరస్వతీ అనుగ్రహం కోసం చేయవలసిన శ్రీ నీల సరస్వతీ స్తోత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం . ఆమెని ఈ రూపంలో స్మరించి తరించండి . 
 

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram)

ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 ||

సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2 ||

జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 3 ||

సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 4 ||

జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 5 ||

హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 6 ||

బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || 7 ||

ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |
తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ || 8 ||

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 9 ||

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || 10 ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || 11 ||

పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః || 12 ||

ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

శుభం .

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi