Online Puja Services

బలరాముడు ప్రతిష్టించిన నాగేశ్వరుడు.

13.58.244.216

కాలసర్పదోషాలు, నాగదోషం తొలగించే బలరాముడు ప్రతిష్టించిన నాగేశ్వరుడు. 
- లక్ష్మి రమణ  

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్

అని శ్రీ శివ స్తుతి పన్నగభూషణుణ్ణి స్తుతిస్తుంది.  ఆ స్వామీ పన్నగభూషణుడు మాత్రమే కాదు, పన్నగములకి ఈశ్వరుడైన పన్నగేశ్వరుడు కూడా ! నాగులకీ మనుషులకీ విడదీయలేని అనుబంధం ఉన్నది. ఆ నాగులు సామాన్యమైన నాగులు కాదు . దివ్యలోకాలకి చెందిన  నాగులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి .  అటువంటి నాగులు అర్చించిన మణి నాగేశ్వరస్వామి ఆలయం దర్శిద్దాం . ఈ ఆలయ దర్శనం వలన నాగదోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషాలు తొలగిపోతాయి.  స్వామి అర్ధనారీశ్వర లింగంగా దర్శనమిస్తారు.     

నాగావళినది పరవళ్లు  తొక్కుతూ బంగాళాఖాతం లో కలిసే పవిత్ర సంగమక్షేత్రం కల్లేపల్లి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పట్టణానికి  సుమారు ఏడు కీ.మీ దూరములో నాగావళి నదీ తీరానికి సమీపంలో ఉన్న కళ్లేపల్లి గ్రామంలో కొలువై ఉన్నాడు శ్రీ మణి నాగేశ్వరుడు. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా బలరాముడు ప్రతిష్టించారు. పంచబాలరామ క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన ఈ క్షేత్రంలో స్వామి పశ్చిమాభిముఖుడై ఉంటారు . విశిష్టమైన ఈ లింగాన్ని నిత్యమూ ఆ నాగరాజే ఆరాధించారని, అప్పటి నుండీ ఈ లింగానికి జారీ మణి నాగేశ్వరుడని పేరొచ్చిందని స్థానిక విశ్వాసం.  

కళ్లేపల్లి లోని స్వామి ఆలయం సుందరమైన మూడు అంతస్ధుల గాలి గోపురాలతో అలరారుతూ ఉంటుంది.  నంది మండపం, ఉపాలయాలు, గర్భలయం తో ముచ్చటగొలిపే ఆవరణలో  శ్రీ గౌరీ సమేతుడై  శ్రీ మణి నాగేశ్వరస్వామి దర్శనం ఇస్తారు. గర్భలయంలోని ఈశ్వరలింగము అర్ధనారీశ్వర స్వరూపంగా  దర్శనమిస్తుంది.  ముందు భాగం శివరూపంగా , లింగము  వెనుక భాగంను  గౌరీ దేవిగా అర్చిస్తారు .  ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి.  

ప్రతి మంగళవారం ఈ ఆలయంలో కాల సర్ప దోష పరిహార్ధం ప్రత్యేక పూజలు నిర్వహించుతారు. అమ్మ వారికి కుంకమార్చనలు ఉంటాయి.  మహాశివ రాత్రి నాడు లింగోద్భవ ఉత్సవాలు ఉంటాయి. కార్తీక మాసంలో విశేముగా పూజలు జరుగుతాయి.

ఈ విధంగా  బలరాముడు పంచ శివాలయాలు స్థాపించడానికి వెనుక కారణం కురుక్షేత్ర మహా సంగ్రామమే. ఆ యుద్ధంలో జరిగిన రక్త పాతం తన కళ్ళతో చూడలేని బలరాముడు తీర్థ యాత్రలకు బయలు దేరాడు. అలా అనేకానేక  పుణ్య క్షేత్రాల్ని దర్శిస్తూ, కళ్ళేపల్లి ప్రాంతానికి చేరుకున్నారు . ఇక్కడ  ప్రజలు త్రాగేందుకు నీరు లేక బాధపడుతుంటే ఒడిస్సాలోని పాయకపడులో ఉన్న  కలహంది ప్రాంతం లో ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశారు .  ఆ విధంగా ఈశ్వరుని కటాక్షము పొంది, ఆయన ఆయుధమైన నాగలి మొనతో భూమిపై ఒక పాయను తవ్వారు. ఆ పాయనుండీ జల ఉద్భవించినది . ఆ విధంగా నాగలిచాలుతో ఉద్భవించిన నది కాబట్టి, ఈ నదికి నాగావళి అని పేరొచ్చిందట.  ఒడిస్సాలో దీన్ని ‘లాంగుల్యా’ అనీ అంటారు.

ఈ నది ఒడ్డునే బలరాముడు  పాయక పాడు, గుంప, సంగం, శ్రీకాకుళం, కళ్ళేపల్లిలో ఒకే రోజు  "జేష్ట బహుళ ఏకాదశి " నాడు పంచలింగాలు ప్రతిష్ఠించాడట. ఈ  ఐదు క్షేత్రాల్ని ఒకే రోజు దర్శించి,  అభిషేకం చేసిన వాళ్ళకు పునర్జన్మ వుండదని నమ్ముతారు భక్తులు. ఇదే రోజు అంటే "జేష్ట బహుళ ఏకాదశి " నాడు ఈ ఆలయాలలో శివ పార్వతుల కళ్యాణము కూడా చేస్తారు . ఆ విధంగా సాక్షాత్తూ ఆదిశేషుని అంశ అయినా బలరాముడు స్థాపించి , నాగరాజు చేత అర్చనలు అందుకొన్న మణి నాగేశ్వరుణ్ణి ఆరాధించడం వలన ప్రత్యేకించి కాలసర్పదోషాలు , నాగదోషాలు తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది . 

 అష్టనాగేశ్వరాలయాలు (ఎనిమిది నాగేశ్వరాలయాలు) ఆంధ్రప్రదేశ్ లో కొలువై ఉన్నాయి .  అవి కళ్లేపల్లి, మందపల్లి, మేడూరు, పెద కళేపల్లి, మచిలీపట్నం, గిద్దలూరు, ఓర్వకల్లు, ప్రాతకోట క్షేత్రం. ఈ క్షేత్రాలన్నింటిలోనూ నాగేశ్వరుని అర్చించడం శుభాలని కలిగిస్తాయి.  కాలసర్పదోషాలు తొలగించుకొనేందుకు దివ్యమైన క్షేత్రాలు.  సంతాననుగ్రహప్రదాయకాలు. 

శుభం !! 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya