Online Puja Services

మీసాల మల్లన్న జాతరకెళదామా

18.191.174.168

తండ్రి స్వరూపుడైన మీసాల మల్లన్న జాతరకెళదామా ! ( కొమురవెల్లి)
-లక్ష్మీ  రమణ 

చారడేసి కన్నులవాడు.. బారడేసి మీసాలవాడు.. కొమురవెల్లిలో కొలువు దీరాడు. జానపదుల కొంగు బంగారమై పూజలందుకుంటున్న ఈ మల్లికార్జనుడిని కాకతీయుల వీరశైవానికి ప్రతీకగా భావిస్తారు. ‘పోదాం పద యాతరో.. కొమురెల్లి జాతర..’ అంటూ ఈ మల్లన్న దర్శనానికి తెలుగు ప్రజలు బారులు తీరతారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఉన్న ఖండోభా దేవుడే  ఇక్కడ మల్లన్నగా వెలిశాడని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రానికి మరో విశేషం ఉంది. ఇక్కడి స్వామికి దూళి దర్శనం చేసుకుంటారు భక్తులు . 

శివుణ్ణి లింగాకృతిలో దర్శించి పూజలు నిర్వహించడమే గానీ ఆయన ప్రతిమలని పూజించడం చాలా అరుదు.  అలా ప్రతిమ రూపంలో మీసాలున్న శివయ్య రూపాన్ని దర్శించుకోవాలంటే, కొమురవెల్లి కి వెళ్లాల్సిందే . ఇక్కడి స్వామి తండ్రి స్వరూపమైనవాడు .  కాళ్ళు కూడా కడుక్కోకుండా నాన్న అని ఎలాగయితే పిల్లాడు పరిగెత్తుకుని వెళ్లి తండ్రిని కౌగలించుకొని తన ప్రేమని వ్యక్తం చేస్తాడో అదేవిధంగా , భక్తులు కూడా బస్సు దిగి నేరుగా దర్శనానికి వెళ్ళిపోతారు . కాళ్ళుకూడా కడుక్కోరు .  అలా సౌచాన్ని , దైవికాన్ని పక్కన పెట్టి , తండ్రిలా ఆదరించే స్వామి, మహా వాత్సల్యంతో భక్తులని అక్కున చేర్చుకుంటారు . వారి కోరికలు విని , అనుగ్రహిస్తారు . ఇదే ఇక్కడి గొప్పదనం . దీన్నే ధూళి దర్శనం అంటారు . శివరాత్రికి ఇక్కడ అమితమైన కోలాహలంగా సంబరాలు జరుగుతాయి .  

పూర్వ కాలంలో ఈ ప్రదేశంలో కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి అయింది అని ప్రతీతి. పరమ శివుడు ఇక్కడ తన భక్తులను కాపాడటానికి వీరశైవమతారాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం చెపుతుంది. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు.

కొమురవెల్లి మల్లన్న స్వామి కొండల మధ్యన . యాదవ కులానికి చెందిన  కేతమ్మ, మేడలమ్మ ఇద్దరు భార్యలు స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిదని విశ్వాసం .  కాలక్రమేణా ఇక్కడికి భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలోని మండపాలని విస్తృతపరిచి అభివృద్ధి చేశారు . చుట్టుపక్కల  సత్రాలు, నూతన కట్టడాలు నిర్మించారు.

ఇక్కడ జరిగే అగ్నిగుండాలు ఉత్సవాన్ని వీక్షించి తీరాల్సిందే ! చూసేవాళ్ళకి ఒళ్ళు గుగుర్పొడిచే విధంగా అద్భుతంగా మల్లన్న సత్యాన్ని నిరూపిస్తోందా అన్నట్టుగా జరుగుతుంది .  వీర శైవ పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు జాము సమయానికి ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా పేర్చి ,ఆ  కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్తారు. స్వామివారివెంట  వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. దీనివలన గ్రహదోషాలు, దుష్టశక్తుల పీడా వదిలిపోతుందని భక్తుల నమ్మకం . 

సుతిమాను గుండు మీద స్వామి త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది.

ఇలా చేరుకోవాలి :

నమ్మి కొలిచే భక్తులకు కొండంత అండగా ఉండే దేవుడు ఈ కొమురవెల్లి మల్లన్న. సిద్ధిపేట్ నుండి సికింద్రాబాద్ వచ్చే మార్గంలో సిద్ధిపేట నుండి 24 కిలోమీటర్ల దూరంలో చేర్యాల మండలంలో కొమురవెల్లి గ్రామంలో నెలకొని ఉంది ఈ కొమురవెల్లి మల్లన్న దేవాలయం. హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు లేదా కారు ప్రయాణం శ్రేయస్కరం . 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya