Online Puja Services

మహాన్యాసంలోని శివదర్శనం చేద్దామా

18.188.241.82

మహాన్యాసంలోని శివదర్శనం చేద్దామా !
-లక్ష్మీ రమణ 

మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటారు కదా ! అంటే, మహాన్యాసంతో కూడినటువంటి రుద్రాభిషేకం అని అర్థం ఈ మహాన్యాసంలో శివుని ఐదు ముఖాల వర్ణన ఉంటుంది . ఇవి పంచ గుణాత్మ ప్రతీకలుగా కనిపిస్తాయి . తదనుగుణంగానే ఆయన స్వరూపాన్ని వర్ణించడం జరిగింది . ఆవిధంగా శివుని దర్శించిన తర్వాత, ఆయనకీ నమక చమకాలతో కూడిన అభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట . మహాన్యాసంలోని అద్భుతమైన ఆ పరమేశ్వరుని పంచముఖాలనూ ఇక్కడ దర్శిద్దాం.

మహాన్యాసం రుద్రానికి ముందుగా చేయడం (పూర్వాంగంగా ) జరుగుతుంది . మహాన్యాసము అంటే, భక్తుడు రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చేసేందుకు అర్హత పొందాలి . 

‘నారుద్రో రుద్రా మర్చయేత్ ‘ 

అంటే, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకమునకు అనర్హుడు అని అర్థం . ఇది ప్రమాణవచనం . అందువల్లే రుద్రుని తన ఆత్మలో నిలుపుకోవడానికి, రుద్రతత్వాన్ని తెలుసుకొని అర్హతపొందే ప్రక్రియ మహాన్యాసం . దీంట్లో భక్తుడు పంచాంగాన్యాసం చేయాల్సి ఉంటుంది . ఇలా వివిధ శరీరభాగాలని స్పృశిస్తూ , ఆ రుద్రుని తన దేహాత్మలో మంత్ర యుక్తంగా ఆవాహన చేయడం ద్వారా తానే , రుద్రుడై , రుద్రార్చనకి అర్హుడవుతాడని వేదవచనం . 

రుద్రమహాన్యాసము ఐదు అంగాలు కలిగిఉంటుంది . అంటే ఐదు స్వరూపాలు అన్నమాట. లేదా ఐదు తత్వాలు అనికూడా చెప్పుకోవచ్చు . ఈ పంచతత్వాలూ కలిగినవారు పంచాంగ రుద్రులు .

రుద్రాభిషేకంలోని  పంచముఖ ధ్యానం లోని శ్లోకాలు వాటి అర్థ సహితంగా :

రుద్రాభిషేకంలోని  పంచముఖ ధ్యానం లోని శ్లోకాలు మహాన్యాసంలో ప్రస్తావించడం జరిగింది . తత్పురుష , అఘోర , సద్యోజాత , వామదేవ, ఈశాన అనే ఐదు ముఖాలన్ని కలిగిన రూపాయలా పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాలని మనకి ఋషులు అందించారు .  దీనినే శివ పంచానన స్తోత్రం అనికూడా అంటారు . ఈ ఐదు ముఖాలలో ఒక్కొక్క రూపానికి ఒక ప్రత్యేకత ఉంది . ఈ మహాన్యాస వివరణని ‘రావణ ప్రోక్త న్యాస ప్రక్రియ’లో తెలియజేశారు . 

తత్పురుషముఖం - ధ్యానం :

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్థితేజోరుణం
గంభీర ధ్వని సామవేద జనకం -తామ్రాధరం సుందరం 
అర్ధేందుద్యుతిలోల పింగళజటా  - భారప్రబద్ధోరగం  
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః 

ప్రళయకాలములో జ్వలించేటటువంటి అగ్నికాంతోనూ , త్రటిల్లున మెరిసే  మెరుపుల తేజముతోనూ , బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీపడే తేజములే తనరూపముగా కలిగినది , గంభీర ధ్వనితోపాటు భయంకరమైన అగ్నిలాగా ప్రకాశించే యెర్రని పెదవులు కలిగినది , చంద్రఖండ కాంతితో మెరిసే పింగళ వర్ణపు జడలు కలిగి , దాని చుట్టూ గట్టిగా చుట్టుకున్న సర్పములు కలది, సిద్ధులు , సురలు , అసురులు నమస్కరించేది అయిన శూలి తూర్పు ముఖానికి నమస్కరిస్తున్నాను అని అర్థం . 
రజోగుణ ప్రధానమైన సృష్టి తత్వము ఈ శ్లోకములో ప్రస్తుతింపబడింది . 

అఘోరముఖ ధ్యానం :

కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిభం -వ్యావృత్త పింగేక్షణం 
కార్నోద్భాసిత భోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం 
సర్పప్రోత కాపాలశుక్తి శకల - వ్యాకీర్ణతా శేఖరం 
వందే దక్షిణమీశ్వరస్య వందనం - చాతర్వనాదోదయం 

కారుమేఘములు ,  నల్లని తుమ్మెదల వంటి మెరుపుని  పోలిన కాంతితో ప్రకాశించేటటువంటిది , బాగా మిట్టగా తిరిగేటటువంటి పింగావర్ణపు కన్నులు కలిగి, కోరలు, శిరోరత్నాలు కలిగిన నాగులు కర్ణాభరణాలుగా కలిగినది , సర్పాలతోపాటు కాపాలమాలని ధరించినటువంటిది , ముత్యపు చిప్పలపోలిన కనురెప్పలపైన, ఎగుడుదిగుడు నడకతో భయంకరమైన అరణ్యాన్ని పోలిన కనుబొమ్మలు కలిగిన ఆ ఈశ్వరుని దక్షిణ ముఖమునకు నమస్కరిస్తున్నాను .  తమోగుణప్రధానమైన లయకర్త తత్వాన్ని ఇక్కడ స్తుతించడం జరిగింది . 

సద్యోజాత ముఖ ధ్యానం :

ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం 
భస్మాభ్యంగ మనంగ దేహదహన - జ్వాలావళీ లోచనం 
విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత పదం - ఋగ్వేదనాదోదయం 
వందేహం సకలం కళంక రహితం - స్థాణోర్ముఖం పశ్చిమం 

హిమవత్పర్వతం , చంద్రుడు , మల్లెపూల వంటి తెల్లని ఛాయ కలిగినది , ఆవుపాలమీది నురుగువంటి స్వచ్ఛమైన కాంతిని కలిగినది , విభూతిని ధరించి ఉన్నది , మన్మధుని శరీరముని దహించే జ్వాలల పంక్తితో నిండిన త్రినేత్రాన్ని కలిగినది , బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడుతున్నది , యోగులచేత శ్రద్ధగా అర్చింపబడుతున్నది, నిర్మలమైన నిండు వదనంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శివుని పశ్చిమ ముఖానికి నమస్కరిస్తున్నాను . సత్వగుణ ప్రధానమైన ఆ ఈశ్వరుని తత్వాన్ని ఈ శ్లోకములో స్తుతించడం జరిగింది . 

వామదేవ ముఖం - ధ్యానం :

గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం
భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం 
స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం 
వందే యూజుష వేదం ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం 

గౌరవర్ణము (ఎరుపుతోకూడిన తెలుపు ) కలది , కుంకుమ పూతతో నిండునది , అందముగా దిద్దిన తిలకాన్ని ధరించినది, ధవళకాంతితో మెరిసేటటువంటి చెక్కిళ్ళు , కనుబొమ్మల కదలికతో కూడిన చక్కని కడగంటి చూపుతో ప్రకాశిస్తూ, తెల్లని కలువలని చెవులకి అలంకారంగా ధరించినది, చక్కని చిరునవ్వుతో మెరిసే దొండపండు వంటి క్రింది పెదవితో , దోబూచులాడే నల్లని ముంగురులతో , నిండుపున్నమి జాబిలిలా ప్రకాశించే ఆ శివుని ఉత్తరముఖమునకి నమస్కరిస్తున్నాను .  మూడుగుణాల మిశ్రమరూపమైన ఆ ఈశ్వర తత్వాన్ని ఇక్కడ ప్రస్తుతించారు . 

ఈశానముఖ ధ్యానం :

వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం - శస్త్రింశతత్వాధికం 
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః 
ఓంకారాది సమస్త మంత్రం జనకం - సూక్ష్మాది సూక్ష్మం పరం 
వందే పంచమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం 

వ్యక్తము , అవ్యక్తము (స్పష్టరూపం కలిగినది , రూపం స్పష్టంగా లేనిది ) అనే రెండు లక్షణాల కంటే కూడా భిన్నమైన లక్షణం కలిగినది , ముప్ఫయ్ఆరు తత్వముల రూపములో పరిణమించింది , సకల తత్వములకంటే, ఉన్నతమైనదైన అనుత్తరము అనే అక్షర (అకార) తత్వముని కలిగినది , ఎల్లప్పుడూ యోగులచేత ధ్యానింపబడేది అయిన తమోగుణ రహితమైన, త్రినేత్రములు కలిగిన సూక్ష్మాసతి సూక్షముకన్న ఉన్నతమైన శాశ్వతముని , ఆకాశమంతా వ్యాపించి ఉన్న తేజమే తన రూపమైన ఆ సర్వేశ్వరుని ముఖమునకు నేను నమస్కరిస్తున్నాను . గుణాతీతమైన బ్రహ్మతత్వమును ఇక్కడ స్తుతి చేస్తున్నారు .   

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha