Online Puja Services

శంకరుడు స్వయంగా రామునికి చెప్పిన విభూతి మహిమ!

18.223.159.195

శంకరుడు స్వయంగా రామునికి చెప్పిన విభూతి మహిమ! 
- లక్ష్మి రమణ 

పూజ చేసుకోవడానికి పూజామందిరం లోకి వెళ్లేప్పుడు పవిత్రంగా ఉండడం అవసరం. అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే, పూజామందిరంలోకి వెళ్ళాలి.  పూజ చేసుకునేప్పుడు మనసు మనం చేసే పూజపైన నిలబడాలి .  అలా భగవంతుని పైన మన ఏకాగ్రత నిలబడాలంటే   భస్మధారణ, రుద్రాక్ష మాల  ధరించి బిల్వదళార్చన చేయమంటుంది శివ పురాణం . అటువంటి ప్రాశస్త్యమైన  విభూతి మహిమని స్వయంగా పరమేశ్వరుడే రామావతారంలో ఉన్న విష్ణుమూర్తితో చెప్పినట్టుగా పద్మపురాణం వివరిస్తోంది  . ఆ విశేషాలు తెలుసుకుందాం.  

పరమేశ్వరుడు స్వయంగా ఒక విప్ర వేషాన్ని ధరించి రాముని వద్దకు వచ్చారు. రాములవారు ఆయనని పరిచయం చేసుకొనే ప్రయత్నం చేశారు. “స్వామీ ! మీ పేరేమిటి ? తమరు ఎక్కడ నుంచి వచ్చారు ? “ అని అడిగారు. ఆయన “నా పేరు శంకరుడు.  కైలాసవాసం నా నివాసం” అని శంకరుడు సమాధానమిచ్చారు.  

ఆయన్ని స్వయంగా విచ్చేశిన రుద్రునిగా గ్రహించిన రాములవారు  విభూతి మహిమను చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు.  “ఓ రామా ! భస్మ మహత్యాన్ని చెప్పడానికి బ్రహ్మాదులకు కూడా వర్ణింప తరం కాదు.  బట్టమీద చారలను అగ్ని కాల్చినట్లుగా, మన నుదుట బ్రహ్మ రాసిన రాతలను కూడా తుడిచి వేసేటటువంటి శక్తి భస్మానికి ఉంది.  విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నట్లయితే, త్రిమూర్తులనూ మనము దేహము పైన ధరించినట్టు అవుతుంది. 

ఎవరైతే ముఖము మీద భస్మాన్ని ధరించి ఉంటారో నోటితోటి పాపములు చేయరు. అంటే, తిట్టడం, అభక్ష్యాలను తినడం అనే పాపములను చెయ్యరు.  చేతులు పైన ధరించి, చేతితో పాపములను చేయకుండా ఉంటారు. అంటే, కొట్టడం మొదలైనవి.  హృదయము పైన విభూతిని ధరించి, మనః పాతకాలనీ చేయకుండా ఉంటారు. అంటే దురాలోచనలు చేయకుండా ఉంటారు.  నాభి స్థానంలో విభూతిని ధరించడం వలన  వ్యభిచారాది దోషాలని, నాభికి రెండు పక్కలా ధరించడం వల్ల పరస్త్రీ స్పర్శ దోషాలని పోగొట్టుకుంటారు. 

 ఇలా  పాపములను దర్శనము చేసి అంటే బెదిరించి పోగొట్టేది కాబట్టి దీనిని భస్మము అని పిలుస్తాము. భస్మము మీద పడుకున్నా ఒంటికి పూసుకున్న పాపములన్నీ భస్విభూతములు అవుతాయి.  ఆయుష్షు  పెరుగుతుంది.  గర్భిణీ స్త్రీలకి సుఖ ప్రసవం కలిగిస్తుంది. సర్ప , వృశ్చికాది విషాలని హరిస్తుంది. భూత పిశాచాలను పారద్రోలుతుంది.” అని విభూతి మహిమని వివరించి అందుకు సంబంధించిన కథని ఇలా చెప్పసాగారు పరమేశ్వరుడు . 

వశిష్ట వంశములో ధనుంజయుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  అతడికి వందమంది భార్యలు, వందమంది కొడుకులు ఉన్నారు.  వారికి తన ఆస్తులన్నీ సమానంగా పంచి ఇచ్చి ఆ విప్రుడు కాలం చేశారు.  కొడుకులు అసూయ తోటి, దురాశ తోటి ఒకరి ధన కోసం మరొకరు ఆశపడుతూ తన్నుకోసాగారు. 

వారిలో కరుణుడు అనే కొడుకు శత్రుజయాన్ని పొందడానికి  గంగా తీరానికి వెళ్లి స్నానం చేసి, తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆయన మునులను సేవిస్తూ ఉండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతి అని ఒక నిమ్మ పండు తెచ్చి అక్కడ పెట్టాడు.  దానిని ఇతను వాసన చూశాడు.  దాంతో అనుగ్రహించాల్సిన  మునులు కాస్తా ఆగ్రహించి, ఈగ వై పొమ్మని శపించారు. తిరిగి అతను వేడుకొనగా, అతనికి  పూర్వ జన్మ స్మృతిని ఇచ్చారు. 

దాంతో అతను ఏడుస్తూ వెళ్లి, భార్యతో విషయం అంతా చెప్పాడు.  ఆమె మంచి పతివ్రత. భర్త దుస్థితిని చూసి  చాలా విచారించింది.  ఒకనాడు ఈ రహస్యాన్ని తెలుసుకున్న అతని సోదరులు ఆ ఈగ రూపంలో ఉన్న కరుణుణ్ణి పట్టి చంపేశారు. అతని భార్య ఈగ దేహాన్ని తీసుకుని అరుంధతి దగ్గరకు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా ప్రార్ధించింది. 

అరుంధతీదేవి కరుణతో మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి, కరుణుణ్ణి బ్రతికించింది. ఇలాగే మరోసారి దాయాదులు అతనిపైన దాడిచేసి, చంపి ఇంటి ముందు పారేశారు.  అతని భార్య ఏడుస్తూ, దిక్కు తెలియక  భర్త దేహముతో వనములలో పిచ్చిదానిలాగా తిరగసాగింది. అప్పుడు దధీచముని ఆమెకి దర్శనమిచ్చారు. ఆమె ఆ మహార్షి తో తన బాధని చెప్పుకొని, రక్షించమని వేడుకుంది .  

అప్పుడాయన , తల్లీ !ఈ భస్మముతో నా బ్రహ్మ హత్యా పాపములనే  ఆ పరమశివుడు పోగొడతాడు.  దానినే నేను ఇతనిపై చల్లుతున్నాను. దీంతో ఇతను శాప విముక్తుడై తిరిగి జీవించగలడు” అని ఆ ఈగరూపంలో ఉన్న శరీరము పైన విభూతిని జల్లారు. అప్పుడు కరుణుడు తిరిగి జీవించడమే కాకుండా తన పూర్వ రూపాన్ని కూడా పొందాడు . దేవతలు ఆ విభూతి ప్రభావాన్ని చూసి వేనోళ్ళ కొనియాడారు . కరుణ దంపతులు దధీచమునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. అతడు వారిని దీవించి భస్మాన్ని తయారు చేసుకొనే విధిని వివరించి వెళ్ళిపోయాడు.

భస్మాన్ని తయారు చేసుకొనే విధి : 

ఆవు పేడతో చేసిన పిడకలను శత రుద్రీయాన్ని అంటే నమక మంత్రాన్ని చెబుతూ కాల్చి భస్మము చేయాలి.  దానిని త్రయంబక మంత్రముతోను, సద్యోజాతాది మంత్రాలతోనూ ధరించాలి. మంత్రములు చదవడం రానట్లయితే,  ప్రణవనామం ఓం కారాన్ని పలుకుతూ  ధరించాలి. బ్రాహ్మణేతరులు నమశ్శివాయ మంత్రంతో ధరింపవచ్చు.”

కాబట్టి రామా ! విభూతి అనేది అంతటి విశిష్టమైన మహిమ గలిగినది . నిత్యమూ ధరించేవారికి పాపములన్ని భస్మమై , అనేక శుభాలు కలుగుతాయి.అంత్యాన కైలాస వాసం  ప్రాప్తిస్తుంది”  అని పరమేశ్వరుడు వివరించారు.  

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !! శుభం . 

#bhasmam #viboodi #vibhoothi #vibhoodi

Tags: bhasmam, vibhoothi, vibhoodi, viboodi,

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore