శివుడు నటరాజమూర్తిగా మారుటకు కారణమైన మంకణ మహర్షి కధ

3.235.101.141
"శివుడు నటరాజమూర్తిగా మారుటకు 
కారణమైన మంకణ మహర్షి కధ"
 
పరమశివభక్తుడు మంకణ మహర్షి 'ఆర్యావర్తము' అనే ప్రదేశము చేరి తపోనిష్టలో మునిగిపోయాడు. పంచాక్షరీ (నమఃశివాయ) మంత్రజపంతో అతని శరీరం సూర్యసమాన తేజోవంతమైంది. క్రమంగా భక్తి పారవశ్యంతో తాండవం చేయసాగాడు ఆ మహర్షి. అంతటి భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ మంకణుడు తాండవం ఆపడే. శివుడు అతని తాండవం ఆపడానికి ప్రయత్నించి ప్రశ్నించాడు "ఎవరికోసం నీ తపస్సు, నీ కోరిక ఏమిటి?". దేనికీ జవాబు చెప్పడాయే ఆ మహర్షి. తాండవం ఆపడు.

దానితో శివుడు ఉగ్రుడై- "వెయ్యి శిరస్సులు, వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళుతో కూడిన విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా" మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతోపాటు ఒక స్త్రీమూర్తి కూడా ఉంది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దానితో అతనికి జ్ఞానోదయమయింది. శరణంటూ సాష్టాంగ నమస్కారం చేసాడు శివుడికి.

అప్పుడు శివుడు శాంతించి విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీ కూడా అంతర్ధానమైంది. మహర్షి శివుడికి నమస్కరించి "దేవాదిదేవా! ఈ మహాతాండవం ఏమిటి? ఆ స్త్రీమూర్తి ఎవరు?" అంటూ ప్రశ్నించాడు. అప్పుడు శివుడు "ఇది పరమేశ్వరుని దివ్యరూపం. ఆ దివ్యమూర్తిని నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి. బ్రహ్మరూపుడినై నేను సకల ప్రాణులను 25 (పంచవింశతి) తత్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణులయందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ విషయం గ్రహించి, భక్తితో నన్ను ఉపాశించి, శివసాయుజ్యం పొందు" అని చెప్పాడు శివుడు.

(శ్రీశివ పురాణంలోని సతీఖండము నుండి)

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 

- బి సునీత 

Quote of the day

Without peace, all other dreams vanish and are reduced to ashes.…

__________Jawaharlal Nehru