Online Puja Services

మృత్యుంజయ మంత్రం అర్థం తెలుసా !

18.221.53.5

గుడిలో తీర్థాన్ని ఇచ్చేటప్పుడు, విభూతిని ధారణ చేసేప్పుడు మృత్యుంజయ మంత్రాన్న్ని చెప్పడం మనం వింటూంటాం.  ఈ మంతం ఒక శక్తినిపాతం. అపమృత్యు భయం నుండీ సర్వదా రక్షించే మహామంత్రం. 

మంత్రం అంటే ఒక శబ్దము . ఒక శక్తి . ప్రప్రథమంగా ఈ పరమేశ్వర ప్రతీకాత్మ అయిన శబ్దము , సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం గా రూపొందిందని , ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. వేదముల నుండీ ఉత్పన్నమైన అకార -ఉకార -మకారముల సంగమమే  ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మ కారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. 

మంత్రము ద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. సర్వ దేవతలూ మంత్రాధీనులే. మంత్రాలు అక్షరాధీనములు. సర్వ అక్షరాలూ ఓంకార స్వరూపాలే . అటువంటి ఓంకార శబ్దానికి సాకార స్వరూపం, విశ్వేశ్వరుడైన శంకరుడు. ఆయన స్వరూపం ఈ విశ్వ సృష్టికి సంకేతం. 
మృత్యుంజయ మంత్రం తైత్తిరీయోపనిషత్తు లోని నారాయణప్రశ్నము లోనిది. ఇది తైత్తిరీయం లో 56 వ అనువాకం.

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।

అర్థం :

"త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; 
యజామహే = పూజించు చున్నాము; 
సుగంధిం = సుగంధ భరితుడు;
 పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; 
వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; 
ఉర్వారుకం = దోస పండు; 
ఇవ = వలె; 
బంధనాత్ = బంధమును తొలగించు; 
మృత్యోర్ = మృత్యువు నుండి; 
అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; 
ముక్షీయ = విడిపించు.

తాత్పర్యం:-- అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!

ప్రాశస్త్యము:-- మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును.

సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన (18, 27 etc.) దీనిని పారాయణం చేస్తారు.

సేకరణ 
- లక్ష్మి రమణ 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya