Online Puja Services

పాశుపతం మహా శక్తివంతం

52.14.8.34

మహాభారతంలో ఈ పాశుపత ప్రభావం మనకి తెలియవస్తూంది . మాయా జూదం ఆడిన తర్వాత , పరాజయం పాలైన పాండవులు అడవులబాట పట్టారు. రానున్న మహాభారత సంగ్రామాన్ని గురించి కృష్ణ కృపతో హెచ్చరికని అందుకున్న అర్జనుడు అందుకు సంసిద్ధమవుతుంటాడు . 

అరివీరభయంకరులు , వీరులు , శూరులూ ప్రత్యర్థులుగా నిలవబోతున్నారు . బలాబలాలెరిగిన బంధువులే శత్రువర్గం తరఫున పరిస్థితులు పొంచిఉన్నాయి . అందుకే ముందుగానే ఆ మహాసంగ్రామానికి సిద్ధమయ్యేందుకు పూనుకున్నాడు అర్జనుడు . దానికోసం శివుని కృపాని పొంది, తద్వారా ఆయధ శక్తిని పొందాలనుకున్నాడు . ఆశయసిద్ధికోసం నేటి విజయవాడలోని  ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సుకు పూనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడ అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేసిన శివుడు. 

అస్తశస్త్రాలను అనుగ్రహించేముందు అర్జనుని శక్తిని పరీక్షించాలనుకున్నాడు ఆ పరమేశ్వరుడు . 
కొండదేవరా వేషం కట్టి , జగజ్జననిని దొరసానిని చేసుకొని జగన్నాటకానికి బయల్దేరతాడు . 

వేటకొచ్చిన కోయదొర ఒక అడవిపండి వెంటపడతాడు. బాణమెక్కుపెట్టి ఆ వరాహాన్ని కొట్టబోతాడు. అది మాయా వరాహం . ఋషుల తపస్సులను భంగంచేయడానికే అక్కడికొచ్చిన మూకాసురుడు. అది శివబాణం తప్పించుకొని అర్జనుడు తప్పస్సు చేస్తున్న చోటికి వస్తుంది. అక్కడున్న మునీశ్వరులు గగ్గోలుపడడంతో , తన అమ్మును దానికి గురిపెడతాడు అర్జనుడు .   

అదే సమయంలో కోయ దొర రూపంలో ఉన్న శివుడు అక్కడికి చేరుకుని అర్జునుడిని వారిస్తాడు. ''ఆ అడవి పందిని తాను వెదుక్కుంటూ వస్తున్నాని, అదే తన లక్ష్యం'' అని చెబుతాడు. అయితే కోయ దొర మాటలను ధిక్కరించిన అర్జునుడు.. '' నేను ఒకసారి విల్లు ఎత్తాకా దించడం అనేది ఉండదని, అది నీదో నాదో విల్లుతోనే తేల్చుకుందాం'' అని సవాలు విసురుతాడు. 

అలా అడవి పంది రూపంలో ఉన్న అసురుడిపైకి ఇద్దరూ బాణాలు సంధిస్తారు . 

చివరికి  ఆ అడవి పంది ప్రాణాలు వదులుతుంది. అయితే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది . తన బాణం వల్లే అడవి పంది చనిపోయింది అంటే.. తన బాణం వల్లే ప్రాణాలు విడిచిందంటూ ఇద్దరూ వాగ్వీవాదానికి దిగుతారు. దీంతో అర్జునుడు కోయ దొరతో  ఈసారి మనం ఇద్దరం పోటీపడదామని, ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్టు భావించాల్సి ఉంటుందని సవాలు విసురుతాడు.

శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడు అలా తనకు తెలియకుండానే తన దైవం పైనే  యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది.  కొద్దిసేపటి తర్వాత అర్జునుడి వద్ద ఆయుధాలు అయిపోతాయి. అది చూసి ఆ కొండదేవరే స్వయంగా  అర్జునుడికి ఆయుధాలు అందిస్తాడు. అయితే ప్రత్యర్థి ఇచ్చిన ఆయుధాలను తీసుకోవడానికి మనసొప్పుకోని అర్జునుడు ఈసారి ఖడ్గంతో యుద్ధానికి దిగుతాడు. కానీ ఆ ఖడ్గం దొర శరీరాన్ని తాకడంతోనే పూలదండగా మారిపోతుంది. దీంతో ఆ దొరతో యుద్ధానికి తన శక్తి సరిపోదని గ్రహించి,  శివలింగం వద్ద కూర్చుని '' ఓం నమఃశివాయ.. ఓం నమఃశివాయ '' అంటూ ఘోర తపస్సుకు పూనుకుంటాడు అర్జనుడు . 

అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు... అప్పుడు అసలు రూపంలో ప్రత్యక్షమై.. ఓ అర్జునా... నీ భక్తికి మెచ్చి ఇది నేను ఇస్తున్న వరం అంటూ పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు. అది నీకు యుద్ధంలో తోడు ఉంటుంది. తిరుగులేని మహాశక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతారు. 

ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు. ఇదీ పాశుపతాస్త్రం కథ. అయితే విజయుణ్ణి (అర్జనుణ్ణి) వారించినా ఈ విజయానికి కారణం ఆయన పరమేశ్వరుణ్ణి అర్చించిన పాశుపత మంత్రం . ఇది 14రకాలుగా చెప్పబడుతుంది . సరైన విధి విధానాలతో దీనిని ఆచరిస్తే, పరమేశ్వరుడు పరమ ప్రసన్నుడవుతాడని ఆర్యవచనం. శుభం . 

 (14 రకములుగా చెప్పబడే ఆ పాశుపత మంత్రాల గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ ని ఉపయోగించండి . )

- లక్ష్మి రమణ 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore